Instant happiness | ఇన్స్టంట్ కాఫీ, ఇన్స్టంట్ సూప్, ఇన్స్టంట్ దోసె మిక్స్.. ఇన్నిన్ని ఇన్‌స్టంట్‌గా లభిస్తున్నప్పుడు.. ఆనందాన్ని మాత్రం ఇన్‌స్టంట్‌గా అందుకోలేమా? ఓ ఇల్లు కట్టినప్పుడో, ఓ ప్రమోషన్ కొట్టినప్పుడో మాత్రమే ఆ అనుభూతిని ఆస్వాదించాలా? మనసుంటే మార్గమూ ఉంటుంది, ‘టూ మినిట్స్ మ్యాగీ’లా చిటికేయగానే ఆనందాన్ని పొందేయవచ్చు.
చిటికెడు ఆనందం కావాలనిపించగానే.. ఇంట్లోంచి బయటికి వచ్చేయండి. దగ్గర్లోని పార్కుకు వెళ్లండి. ఏదైనా పచ్చని చెట్టుకింద నిలబడి.. గుండె నిండా ఆక్సిజన్ పీల్చుకోండి. కొత్త ఉత్సాహం వస్తుంది. కొత్త ఆనందమూ సొంతం అవుతుంది.
బుక్షెల్ఫ్లోంచి నచ్చిన పుస్తకం బయటికి తీసి.. అందులో మీకు బాగా నచ్చిన అధ్యాయం చదవండి. మరీమరీ నచ్చిన వాక్యాలను నాటకీయంగా బయటికే చదివేయండి. ఇష్టమైన కవిత్వాన్నీ ఒకటికి రెండుసార్లు చదవండి.
ఓ మంచి సంభాషణ మనసుకు ఎక్కడలేని ఊరటనిస్తుంది. ఫోన్లో మీ బాల్య స్నేహితుడితో మాట్లాడండి. చిన్నప్పటి విషయాలు నెమరేసుకోండి. హాయిగా నవ్వుకోండి.
రొటీన్‌ను బ్రేక్ చేయండి. పొద్దున్నే లేవడం, వాకింగ్, స్నానం, బ్రేక్‌ఫాస్ట్.. ఈ చైన్‌ను విడగొట్టండి. మీకు ఇష్టమైన పద్ధతిలో ఆ పూట గడిపేయండి. ఆ ఒక్కరోజుకూ నో రూల్స్! కించిత్ అనారోగ్యకరమే అయినా.. హానికరమేం కాదు. అదీ ఆ పూటకు మాత్రమే.
నిద్రపోండి. నిద్రపోండి. నిద్రపోండి. నిద్రే మీ ప్రపంచం అయిపోవాలి. మనసారా.. కళ్లారా.. పగలూ రాత్రీ.. తేడా వద్దు. కొన్నిసార్లు నిద్రను మించిన ఆనందం లేదనిపిస్తుంది. ఊర్మిళాదేవి కోరికోరి ఆ వరాన్నే ఎంచుకోవడం వెనుక ఉన్న రహస్యమూ ఇదే కావచ్చు.
పాటకు సాటివచ్చే పరవశం లేదు. నచ్చిన పాట పాడుకోండి. నచ్చిన వాద్యం వాయించండి. నచ్చిన పాట వినండి. ఆ సుస్వరాలు మిమ్మల్ని సుదూర తీరాలకు తీసుకెళ్తాయి. డ్యాన్స్ కూడా మైమరచిపోయేలా చేస్తుంది.
మీకు పాతిక జతల బట్టలు ఉండవచ్చు. అందులో బాగా ఇష్టమైనవి ఒకటో రెండో ఉంటాయి. అందులోంచి మరీ ఇష్టమైన ప్యాంట్-షర్ట్-టీషర్ట్, పైజమా-జుబ్బా, చీర, చుడీదార్.. బయటికి తీయండి. సందర్భం లేకపోతేనేం.. చక్కగా ముస్తాబు చేసుకోండి.
‘ఆనందంగా ఉన్నాను’ అనిపించడమే ఆనందం. కారణం అవసరం లేదు. విజయాలతో పన్లేదు. ఇదో మానసిక ప్రక్రియ. మనసును మనసుతోనే గెలవాలి. కారు ఖరీదైనదని, బంగారం విలువైనదని, ఇంక్రిమెంట్ లాభదాయకమనీ.. మనసుకు తెలియదు. మనం చెబితేనే తెలుస్తుంది. కాబట్టి, ఓ నెగెటివ్ ఆలోచనను మరో పాజిటివ్ ఆలోచనతో గెలవండి. చిటికెలో ఆనందాన్ని ఆస్వాదించండి.