షాపింగ్ విషయంలో భారతీయులు ‘తగ్గేదేలే!’ అంటున్నారు. ఖర్చుకు వెనకాడకుండా.. కోరుకున్న వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. దాదాపు 92 శాతం మంది.. తమ పండుగ ఖర్చును పెంచాలని యోచిస్తున్నారట. ఈ విషయాన్ని జియో స్టార్.. తాజా ‘ఫెస్టివ్ సెంటిమెంట్-2025’ సర్వే ఫలితాల్లో వెల్లడించింది. ఖర్చులు, ఆవిష్కరణలు, కొనుగోళ్ల పరంగా వినియోగదారుల ప్రవర్తనను విశ్లేషించడానికి ఈ నివేదికను రూపొందించింది.
ఈ సర్వేలో భాగంగా.. భారతీయుల షాపింగ్‌కు సంబంధించిన అనేక విషయాలను బయటపెట్టింది. భారతీయుల సగటు షాపింగ్ బడ్జెట్ రూ.16,500గా ఉన్నది. అందులోనూ నవతరం జెన్ జెడ్‌తో పోలిస్తే.. మిలీనియల్స్ ఎక్కువ ఖర్చు పెట్టడానికి వెనకాడటం లేదట. ఇక కొనుగోళ్లలో వైవిధ్యాన్ని చూపించడంలో ఎప్పటిలాగే మహిళలే ముందున్నారు. షాపింగ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఉత్పత్తులుగా దుస్తులు-ఫ్యాషన్ మొదటిస్థానంలో నిలిచాయి.
దాదాపు 33 శాతం షాపింగ్.. ఈ రంగంలోనే ఉన్నట్లు తేలింది. ఆ తర్వాత 27 శాతంతో మొబైల్స్ రెండోస్థానంలో, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు (18 శాతం) మూడోస్థానంలో నిలిచాయి. ఇక తమకోసం కాకుండా.. బహుమతులు ఇవ్వడానికి షాపింగ్ చేస్తున్నవారు 50 శాతం మంది ఉన్నారట. దాదాపు ఇద్దరు వినియోగదారులలో ఒకరు.. ఇతరుల కోసం షాపింగ్ చేయాలని యోచిస్తున్నారట. అదే సమయంలో డిజిటల్ చెల్లింపులు కూడా పెరుగుతున్నాయని సర్వే నిర్ధారించింది. దాదాపు 61 శాతం మంది దుకాణదారులు యూపీఐ, మొబైల్ వాలెట్ లాంటి నగదు రహిత ఎంపికలను ఇష్టపడుతున్నట్లు వెల్లడించింది. పండుగలైనా, పెళ్లిళ్లు పేరంటాలైనా.. ఘనంగా నిర్వహించే సంప్రదాయం భారతీయులది. అందుకు తగ్గట్టుగానే షాపింగ్ కూడా ఘనంగానే ఉంటున్నదని ఈ సర్వే తేల్చింది.