Indian Shoes | అక్కడ ఓ నలుగురు మాట్లాడుతున్నారు. చూడగానే చెప్పేయొచ్చు అదిగో అతను భారతీయుడు. ఇతను అమెరికన్. ఆ పక్కన.. నేపాలీ. అయితే పోలికల్లోనే కాదు, పాదాల కొలతల్లోనూ తేడా ఉంటుంది. అందుకు అనువైన బూట్లు కావాలి. మన కాళ్లకు సౌకర్యంగా ఉండాలి. ఇప్పుడు భారతీయ బూట్ల తయారీ సంస్థలన్నీ అచ్చంగా ఇలానే ఆలోచిస్తున్నాయి. నూరుశాతం ఇండియనైజ్డ్ షూస్ తయారు చేస్తున్నాయి.
రెడీమేడ్ బట్టలు ఎంత దొరుకుతున్నా, టైలరింగ్ షాపులకు, డిజైనర్ బొటిక్‌లకు ఇంకా అంత క్రేజ్ ఎందుకంటే.. ఒంటికొలతలతో కుట్టించుకున్న బట్టల సౌకర్యం మరి దేనికీ రాదనే ఆలోచన. శరీరాన్ని కప్పి ఉంచే వస్ర్తాలకే కాదు, పాదాలను పట్టి ఉంచే బూట్లకూ ఈ విషయం వర్తించాల్సిందే. పాఠశాల స్థాయి నుంచి ఆఫీసు దాకా.. రోజూ ఎన్నో గంటల పాటు బూట్లను ధరిస్తాం. వాటితోనే ఏడాదికి కొన్ని వందల కిలోమీటర్ల మేర నడుస్తాం. అందుకే, మన జీవితంలో వీటి ప్రాధాన్యాన్ని గుర్తించిన తయారీ సంస్థలు సౌకర్యమే పరమావధిగా డిజైన్లను మార్చుకుంటున్నాయి. అంతర్జాతీయ బ్రాండ్ల ధరల్లో సగానికే అందించేలా తమ ఉత్పత్తులను రూపుదిద్దుతున్నాయి. ఇందుకోసం సరికొత్త మెటీరియల్, ఫోమింగ్ టెక్నాలజీకి తోడుగా సృజనాత్మక డిజైనింగ్‌ను ఉపయోగిస్తున్నాయి. ప్లేటో, అరెటో, ఎలెవర్ స్పోర్ట్స్, నీమన్స్.. తదితర కంపెనీలు ప్రత్యేకించి మనవాళ్ల పాదాల కోసమే బూట్లను రూపొందిస్తున్నాయి.
భారతీయ పాదాల పొడవు-వెడల్పును బట్టి, కాలి ఆకృతిని బేరీజు వేసి రకరకాల కంపెనీలు విభిన్నమైన షూస్ తయారు చేస్తున్నాయి. ఇందులో అరెటో సంస్థ, ఒకటి నుంచి పన్నెండేండ్ల పిల్లల కోసం తయారు చేస్తున్న బూట్లు కూడా అందులో ఓ రకం. ఎదిగే పిల్లల కాలికి తగ్గట్లు దాదాపు మూడు సైజుల దాకా పెరిగేలా సూపర్ గ్రూవ్ అనే ప్రత్యేక టెక్నాలజీ వాడుతున్నారు. పిల్లల కాలి పరిమాణం పెరిగే కొద్దీ దాదాపు 18 మిల్లీమీటర్ల దాకా బూట్లు వెడల్పు కావడం ఈ సాంకేతికత ప్రత్యేకత. ప్లేటో అనే మరో సంస్థ కూడా పిల్లల కోసమే ప్రత్యేక కుషనింగ్‌తో బూట్లను రూపొందిస్తున్నది. వందల మంది చిన్నారుల పాదాలను అధ్యయనం చేసి మరీ వీటిని డిజైన్ చేసింది. పెద్దలకూ ఇంతే సౌకర్యంగా తయారు చేయమంటూ వచ్చిన అభ్యర్థనలతో ఇప్పటి దాకా ఆరులక్షల జతలకు పైగా బూట్లను అమ్మిందీ సంస్థ. ఇందుకోసం, భారతీయ పాదాలపై కనీసం 4వేల గంటల పాటు పరిశోధనలు చేశామని చెబుతున్నారు నిర్వాహకులు.
బయో ఫుట్ అనే బ్రాండ్ అయితే.. మన పాదాలను ఎక్కువగా ఇబ్బంది పెట్టే మడమనొప్పికి జవాబు వెతికింది. అలాంటి వాళ్లు ధరించే షూస్నూ తయారు చేస్తున్నది. నొప్పిని అధిగమిస్తూ కాలికి మద్దతు ఇచ్చేలా ఆ డిజైనింగ్ ఉంటున్నది. పర్యావరణ హితమైన బూట్లను తయారీ చేసే ‘నీమన్స్’ అనే హైదరాబాదీ బ్రాండ్ ఇప్పటి దాకా 21 లక్షల ప్లాస్టిక్ బాటిళ్లను షూస్‌గా మార్చింది. 2025 నాటికి కోటి బాటిళ్లను రీసైకిల్ చేయాలని భావిస్తున్నట్టు చెబుతున్నది. గడచిన ఆరేండ్లలో పదిలక్షల జతల షూస్ అమ్మినట్టు వెల్లడించింది.
ఇక, ముంబైకి చెందిన ఎలెవర్ స్పోర్ట్స్ భారతీయుల కోసం ప్రత్యేకమైన కుషనింగ్‌తో బూట్లు తయారు చేస్తున్నది. రైడ్ఫోమ్ పేరిట వ్యాకోచం చెందే థర్మోప్లాస్టిక్ ఫోమ్‌తో తయారు చేసి ప్రత్యేక పేటెంట్ కూడా తీసుకున్నది. విదేశాల నుంచి మెటీరియల్ తెప్పిస్తున్నామని, తమ బూట్ల తయారీలో ఫ్యాషన్ కంటే సౌకర్యం మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నామని చెబున్నారు స్థాపకులు. మరో విషయం ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకొన్న బ్రాండ్లన్నీ తొలి దశల్లో ఉన్నవి కావు. తాము ప్రారంభించిన లక్ష్యాన్ని చేరుకుని ఎంతో మంది భారతీయులకు సేవలందిస్తూ ఘన విజయాన్ని సాధించాయి. ఇకనుంచి బూట్లు కొనాలంటే మన కాలు…మన బ్రాండ్… అనుకోవచ్చన్నమాట!
Yaar Shoes | పాతకాలం గొంగడితో రైతుల కోసం స్పెషల్ బ్రాండెడ్ బూట్లు.. బురదలో ఇవి ఎలా పనిచేస్తాయంటే..
“రైతులకు అండగా తెలంగాణ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు.. వాళ్లు ఏం చేస్తున్నారో తెలుసా”
“Sai Chinmayi | ఐటీ జాబ్ వదిలేసి వ్యవసాయం చేస్తున్న తెలంగాణ ఆడబిడ్డ”