అతిథి మర్యాదలు చేయడంలో ఆడవాళ్లే ముందుంటారు. ఇంటికి చుట్టాలు వచ్చినా.. స్నేహితులు వచ్చినా ఆత్మీయంగా చూసుకుంటారు. అందుకే.. ఆతిథ్యరంగంలోనూ ఆడవాళ్లే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. హాస్పిటాలిటీలో మహిళల వాటా 52 శాతంగా లెక్కతేలింది. అయితే.. నాయకత్వంలో మాత్రం వెనకబడి పోతున్నారు. కేవలం 30 శాతం మంది మాత్రమే కీలక పదవుల్లో ఉంటున్నారట. ‘ఎంపవరింగ్ ఉమెన్ ఇన్ హాస్పిటాలిటీ’ నిర్వహించిన ఓ సర్వే ఇందుకు సంబంధించిన అనేక విషయాలను వెల్లడించింది. ఆతిథ్య రంగంలో మహిళలు అద్భుతమైన పురోగతి సాధిస్తున్నా.. ఉన్నత స్థాయుల్లో వారికి ఎదురుదెబ్బలే తగులుతున్నాయని ఈ సర్వే పేర్కొంటున్నది. హాస్పిటాలిటీ రంగంలో 2023 వరకు సీఈవో స్థాయుల్లో మహిళల వాటా కేవలం 6 శాతం మాత్రమే. ఇక వేతనాల్లోనూ మహిళలపట్ల వివక్ష కనిపిస్తున్నట్లు తేలింది.
ఆతిథ్య, పర్యాటక రంగాల్లో పురుషుల కంటే మహిళలు సగటున 14.7 శాతం తక్కువగా వేతనం అందుకుంటున్నారట. అయితే, గతేడాదితో పోలిస్తే వారి జీతభత్యాలు 4.2 శాతం నుంచి 5.2 శాతానికి పెరగడం గమనార్హం. వృత్తిపరమైన విభజన వల్లే ప్రమోషన్లు, జీతాల్లో అసమానత ఉన్నదని పరిశోధకులు అంటున్నారు. జీతాలు అందించే నాయకత్వ పదవుల్లో పురుషులే ఎక్కువగా ఉంటున్నారు. తక్కువ వేతన ఉద్యోగాలైన ఫ్రంట్‌లైన్ సర్వీసుల్లో మహిళల ప్రాతినిధ్యం ఎక్కువ. దాంతోపాటు ఇంటి సంరక్షణ బాధ్యతల కారణంగా మహిళలు పార్ట్‌టైమ్, సౌకర్యవంతమైన పాత్రల్లోనే పనిచేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది వారి ప్రమోషన్లు, వేతన పెరుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నదని సర్వేకారులు వెల్లడించారు. అయితే, ఆతిథ్యరంగంలో మహిళలకు మార్గదర్శకత్వం కల్పించడంతోపాటు, ప్రొఫెషనల్ నెట్‌వర్క్‌లను విస్తరించడం వల్ల వాళ్లు మరింతగా రాణించే అవకాశం ఉన్నదని చెబుతున్నారు.