‘మాట’ను ‘తూటా’తో పోలుస్తారు. అందుకే.. ఒక మాట మాట్లాడేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలని పెద్దవాళ్లు చెబుతుంటారు. అయితే.. కటువుగా ఉండే మాటలే ఎదుటివారిని బాధిస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ, మర్యాదగా పలికే కొన్ని పదాలు కూడా.. అంతే ఇబ్బంది పెడతాయని మానసిక నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా, ఆఫీసుల్లో మీ సహోద్యోగులు, కిందిస్థాయి వారితో చేసే సంభాషణలో కొన్ని పదాలు వాడకుండా ఉండాలని సలహా ఇస్తున్నారు. ‘కానీ’, ‘నిజానికి’, ‘కేవలం’.. ఈ మూడు మాటలను ఆచుతూచి పలకాలని అంటున్నారు.
మామూలు మాటలాగే అనిపించినా.. ఇదో విధ్వంసకరమైన పదం. దీనికి ముందు వచ్చిన ప్రతిదాన్నీ తిరస్కరించే శక్తి.. ఈ ఒక్క పదానికి ఉంటుంది. మీరు మీ సహోద్యోగితో.. “మీ ప్రయత్నం బాగుంది. కానీ..” అని అన్నారంటే.. ఎదుటివారు డైలమాలో పడిపోతారు. మొదటగా అందించిన ప్రశంసలను వారి మెదడు చెరిపివేస్తుంది. తరువాత వచ్చే విమర్శలపై మాత్రమే దృష్టి పెడుతుంది. అందుకే, ‘కానీ’ని ఉపయోగించడం వైరుధ్యాన్ని సూచిస్తుంది. వినేవారిని డిఫెన్స్‌లోకి నెట్టేస్తుంది. అందుకే.. ‘కానీ’కి బదులుగా ‘మరియు’ను వాడండి. ఈ పదం.. మీ సందేశాన్ని అందిస్తూనే.. కనెక్షన్‌ను కూడా కొనసాగిస్తుంది.
మీ మాటల్లో ‘నిజానికి/ వాస్తవానికి’ అనే పదాలు వాడారంటే.. అవతలి వ్యక్తిది ‘తప్పు/ అవాస్తవం’ అని సూక్ష్మంగా చెబుతున్నట్లే! మీరు ఎంత మర్యాదగా ఈ మాట అన్నా.. మీకు, మీ సహోద్యోగికి మధ్య మానసిక దూరాన్ని పెంచుతుందట. అందుకే.. మీ పదబందం నుంచి ‘నిజానికి’ అనే మాటను తీసేయండి. అప్పుడే.. మీకూ, మీ టీమ్‌కూ మధ్య దూరం తగ్గిపోతుంది.
‘కేవలం’ ఈ ఒక్క మాట.. మీ సందేశాన్ని, మీ అధికారాన్ని బలహీనపరుస్తుంది. “ఇది కేవలం ఒక ఆలోచన మాత్రమే..” అని మీరు అన్నారంటే.. ఆ తర్వాత చెప్పబోయే విషయాలను మీ కిందిస్థాయి ఉద్యోగులు తేలిగ్గా తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ ఆలోచనతో మొదలుపెట్టబోయే ఎంత పెద్ద ప్రాజెక్టు అయినా.. పట్టాలెక్కేందుకు తంటాలు పడుతుంది.