Making Curd : భోజనంలో ఎన్ని రకాల వెరైటీలు ఉన్నాసరే చివరలో కొద్దిగా పెరుగుతో తింటేనే సంతృప్తి కలుగుతుంది. అందుకే చాలామంది తాము తినే భోజనంలో కచ్చితంగా పెరుగు ఉండేలా చూసుకుంటారు. అయితే చలికాలం వచ్చిందంటే పెరుగు తోడుకోవడం సమస్యగా మారుతుంది. పెరుగు సరిగా గడ్డకట్టకుండా పాలుపాలుగానే ఉండిపోతుంది. తక్కువ ఉష్ణోగ్రతలే ఇందుకు కారణం. అయితే కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఆ టిప్స్ఏమిటో ఇప్పుడు చూద్దాం..
సాధారణంగా పెరుగు తోడుకోవాలంటే గది ఉష్ణోగ్రత 37 నుంచి 45 డిగ్రీల మధ్య ఉండాలి. కానీ చలికాలంలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉండవు. అందుకే ఆ వెచ్చదనాన్ని కలిగించడానికి మనమే బయటి నుంచి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అందుకోసం పెరుగు తోడుపెట్టిన తర్వాత ఆ పాత్రని ఒక దళసరి వస్త్రంతో చుట్టాలి. ఆపై గాలి లోపలికి చొరబడకుండా పాత్ర మీద మూత పెట్టాలి. పాత్రను చలిగాలి తగిలేచోట పెట్టకుండా కాస్త వెచ్చగా ఉండే ప్రదేశంలో పెట్టాలి. అప్పుడే పెరుగు గట్టిగా తోడుకునే అవకాశం ఉంటుంది.
ఇంట్లో ఓవెన్ ఉన్నవారు ఆ ఓవెన్‌ను ఒక రెండు నిమిషాలపాటు 180 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వేడిచేసి ఆఫ్ చేయండి. ఇప్పుడు అందులో పెరుగు తోడేసిన పాత్రను 6 నుంచి 7 గంటలు లేదా రాత్రంతా ఉంచండి. ఉదయం లేచేసరికి గడ్డ పెరుగు రెడీగా ఉంటుంది. పైగా రుచికరంగా కూడా తయారవుతుంది.
బియ్యం డబ్బా కూడా పెరుగు గట్టిగా తోడుకోవడానికి తోడ్పడుతుంది. పెరుగు తోడేసిన పాత్రను బియ్యం డబ్బాలో పెడితే ఆ వెచ్చదనానికి పెరుగు గట్టిగా తోడుకుంటుంది. పెరుగు తోడుపెట్టిన పాత్రను థర్మాకోల్‌తో చేసిన పెట్టెలో పెట్టినా వెచ్చగా ఉంటుంది. కాబట్టి పెరుగు గట్టిగా తోడుకుంటుంది.
పెరుగు గట్టిగా, చిక్కగా, కమ్మగా ఉండాలంటే మనం తోడుకు ఉపయోగించే పెరుగు కూడా నాణ్యమైనదై ఉండాలట. పెరుగు తోడుపెట్టడానికి ఉపయోగించే పాలు కూడా నాణ్యమైనవే అయి ఉండాలి. పాలతో నీటి శాతం ఎక్కువగా ఉండి పలుచగా ఉంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అది గట్టిగా తోడుకోదు. కాబట్టి పాలు చిక్కగా ఉండేలా చూసుకోవాలి. పాలల్లో తోడు కోసం పెరుగు వేసేముందు అవి గోరువెచ్చగా ఉన్నాయో.. లేదో చెక్ చేసుకోవాలి. మరీ వేడిగా ఉన్న పాలల్లో తోడు వేస్తే అది అంత చిక్కగా, కమ్మగా ఉండకపోవచ్చు. పైగా పెరుగు కాస్త జిగురుగా, నీళ్లలా కూడా అనిపించే అవకాశం ఉంది.