విక్టోరియన్ కలెక్షన్.. తెలుగు రాష్ర్టాల్లో నడుస్తున్న నగల ట్రెండ్. హైదరాబాద్‌లోని పెద్ద పెద్ద నగల తయారీ సంస్థల నుంచి ఇమిటేషన్ జువెలరీ షాపుల దాకా అన్నింటా వినిపిస్తున్న మాట ఇదే! బ్రిటన్ను పాలించిన క్వీన్ విక్టోరియా ధరించే నగలను పోలిన ఆభరణాలను ఇప్పుడు అతివలు అమితంగా ఇష్టపడుతున్నారు.
విక్టోరియా రాణి హయాంలో బ్రిటన్ సిరిసంపదలతో తులతూగేది. రాణెమ్మ దగ్గర ఎక్కడెక్కడి నుంచో తెచ్చిన వజ్రాలు, పోల్కీలు, పచ్చలు, కెంపులు, రత్నాలు ఉండేవి. మొత్తంగా, ‘విక్టోరియన్ జువెలరీ’ అంటే, బ్రిటన్ రాణి విక్టోరియా కాలం నాటి నగలన్న మాట! ఇటీవల పాత నగలే కొత్త ట్రెండుగా మారుతుండటంతో విక్టోరియా కలెక్షన్ మళ్లీ తెరమీదికి వచ్చింది. నిజానికి రాణి నగలు మంచి బంగారు వర్ణంలో మెరుస్తూ ఉండేవి. కానీ వందేళ్ల నాటివి కావడం వల్ల వన్నె తగ్గి నల్లగా మారిపోయాయి. వాటిని పోలినట్టు చేస్తున్నారు కాబట్టి ఈ నగలు కూడా మసకబారిన ఫినిషింగ్‌లో వస్తున్నాయన్నమాట. ఆమె నగల్లాగే పువ్వులు, చెట్లు, పక్షులు, సీతాకోక చిలుకలు, పాములు… ఇలా రకరకాల మోటిఫ్‌లు వీటిలోనూ ఉంటున్నాయి. పోల్కీ, వజ్రాలతో పాటు టర్మొలిన్, అంబర్, అగేట్, ఒపల్.. ఇలా రకరకాల రత్నాలతో వీటినీ రూపొందిస్తున్నారు.