వాన కురిస్తే.. బయటి వాతావరణం ఎంత ఆహ్లాదంగా ఉంటుందో, ఇంటి లోపల అంత అపరిశుభ్రంగా తయారవుతుంది. ఎప్పుడూ తడితడిగా.. చిరాకుగా అనిపిస్తుంది. అంతేకాదు.. తేమ ఎక్కువుంటే బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్ లాంటివి పెరిగిపోతాయి. వీటిని నివారించాలంటే.. వానకాలంలో ‘ఇంటి శుభ్రత’పై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందే!
గదుల్లో డీ హ్యుమిడిఫయర్లను వాడుకోవాలి. ఇవి గదుల్లో ఎక్కువగా ఉండే తేమను తొలగిస్తాయి. ఎక్కడైనా తడి ఎక్కువగా ఉందనిపిస్తే.. పొడివస్త్రంతో ఒకసారి తుడిచేస్తే సరి.
మార్బుల్, గ్రానైట్ తరహా ఫ్లోర్లపై ఏదైనా మరకపడితే.. వెంటనే గట్టిపడుతుంది. దాన్ని వదిలించడం కష్టమవుతుంది. అందుకే వీటిపై మార్బుల్ సీలర్ వేయడం మంచిది. లేకుంటే, ఫ్లోర్ పాలిషింగ్ చేసినా మెరుగైన ఫలితం ఉంటుంది.
వర్షకాలంలో బాత్రూములు, టాయిలెట్లలో క్రిమికీటకాలు ఎక్కువగా వృద్ధి చెందుతాయి. కాబట్టి వాటి శుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి. టాయిలెట్ క్లీనర్, బాత్రూమ్ క్లీనర్‌తోపాటు టాయిలెట్, సింక్ షవర్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి.
ఇంట్లో అన్ని గదులనూ క్లీన్ చేయడం ఒకెత్తయితే.. కిచెన్ ఫ్లోర్‌ను శుభ్రం చేయడం మరో ఎత్తు! వంట చేసేటప్పుడు నూనె చిందడం వల్ల.. గోడలకు ఉండే టైల్స్‌తోపాటు ఫ్లోర్ కూడా జిడ్డుగా మారుతుంది.
అది తొలగిపోవాలి అంటే.. వేడినీటిలో వెనిగర్, కొంచెం ఉప్పు వేసి.. మాప్‌తో శుభ్రం చేయాలి. తర్వాత పొడివస్త్రంతో తుడిస్తే సరిపోతుంది.