Holi Celebrations | చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ ఆనందోత్సాహంగా జరుపుకొంటారు. హోలీని రంగుల పండుగ లేదా కాముని పండుగగా పిలుస్తారు. కొంత మంది గిరిజనులు ఈ పండుగ సందర్భంగా వారం రోజుల ముందు నుంచే దుకాణాలు, తెలిసిన వారిని డబ్బులు అడుగుతుంటారు. హోలీ రోజున నీటిలో రంగులు కలిపి ఒకరిపై ఒకరు చల్లుకుంటూ సరదాగా గడుపుతారు.
త్రిపురారం : సాధారణంగా హోలీ ఒక్కరోజు మాత్రమే జరుపుకునే పండుగ. కానీ, పలు తండాల్లో గిరిజనులు సంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలు చేస్తూ వారం రోజులపాటు సంబురాలు జరుపుతారు. తమ జాతి నాయకులు, అధికారుల ఇండ్లకు వెళ్లి కానుకలు సేకరిస్తారు. వాటితో మూడు, నాలుగు తండాలకు ఒక కుల పెద్ద కుటుంబం వద్ద హోలీ సంబురాలను ఘనంగా నిర్వహిస్తారు. స్వతహాగా అడవి నుంచి తీసుకొచ్చిన కట్టెలతో మంట ఏర్పాటు చేసి రాత్రంతా ఆడిపాడుతారు. ఈ వేడుకలకు తండాల్లో నివసించే వారే కాకుండా పట్టణాల్లో నివసించే వారు కూడా వస్తారు.
వసంతకాలం వాతావరణంలో చోటుచేసుకునే మార్పులతో వ్యాధులు ప్రభలుతాయి. ఆ సమయంలో సహజ సిద్ధమైన రంగులు శరీరానికి ఔషధంలా పనిచేస్తాయి. పూర్వం నిమ్మ, కుంకుమ పువ్వు, పసుపు, బల్వాలతో సహజ రంగులను తయారు చేసి హోలీ ఆడేవారు. కాలక్రమేణా రసాయనాలతో తయారు చేసిన రంగుల వాడకం పెరిగి సహజ రంగుల వాడకం తగ్గింది. రసాయన రంగులతో ఈ పండుగ ఎంత ఉల్లాసాన్ని నింపుతుందో.. అంతే విషాదాన్ని మిగుల్చుతుంది. రంగుల్లో వాడే రసాయన పదార్థాలతో శరీరానికి హాని కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కళ్లమంటలు, ఆస్తమా, చర్మవ్యాధులు సంభవిస్తాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. నలుపు రంగుల్లో లెడ్ ఆక్సైడ్ ఉంటుందని, ఇది మూత్రపిండాలను పాడు చేస్తుందని, వెండి రంగులో ఉండే మెర్క్యురీ సల్ఫేట్తో క్యాన్సర్ సోకే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఆకుపచ్చ రంగుల్లో ఉండే కాఫర్ సల్ఫేట్ ద్వారా ఎలర్జీతోపాటు శాశ్వత అంధత్వం వచ్చే అవకాశం ఉంది. పొడిగా ఉండే రంగుల్లో జిలెటిన్ పైలట్ కలవడం వల్ల మైకంతోపాటు ఆస్తమా, అంధత్వం వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. అందువల్ల హోలీ పండుగలో రసాయన రంగులకు బదులు సహజ రంగులు వాడడం ఎంతో శ్రేయస్కరం.
పసుపుతో చేసిన రంగులు వ్యాధి నిరోధక శక్తిని పెంపొదిస్తాయి. తులసి ఆకులతో చేసిన రంగులు మానసికోల్లాసానికి తోడ్పడుతాయి. శ్వాసక్రియ శక్తిని పెంచుతాయి. కలబంద, వేపాకులు చర్మ వ్యాధులను తగ్గిస్తాయి. దురదల నివారణకు ఉపయోగపడుతాయి. గోరింటాకు శరీర పగుళ్లను నివారిస్తుంది. గంధం పొడి మనసుకు ప్రశాంతత కలిగించడంతోపాటు సువాసన వెదజల్లుతుంది.