ఆకలి కేకల జీవితం తనది. ఆయినా చదువుకుంటే బతుకు మారుతుందని పట్నం బాటపట్టాడు. ఆకలి తీర్చుకోవడం కోసం క్యాటరింగ్ పనిచేశాడు. తన పొట్ట నింపుకొంటూనే.. పదిమందికీ పట్టెడన్నం పెట్టాడు. శుభకార్యాలలో మిగిలిన అన్నాన్ని నిరాశ్రయులకు నిత్యాన్నదానం చేస్తున్నాడు.‘డోంట్ వేస్ట్ ఫుడ్’ పేరిట ఎంతోమంది ఆకలి తీరుస్తున్నాడు నేమాని మల్లేశ్వర రావు. ఆకలి విలువ కాలే కడుపునకే తెలుస్తుందంటున్న ఆయన బతుకమ్మతో పంచుకున్న విశేషాలు…
అందరి ఆకలి తీర్చే అన్నపూర్ణదేవికి నేను అంటే చాలా ఇష్టం. ఒకప్పుడు ఆకలితో అల్లాడుతుంటే చూస్తూ ఊరుకుంది. నేడు అందరి ఆకలి తీర్చే అన్నదాతగా మార్చింది. మాది నిజామాబాద్ జిల్లాలోని వర్ణి. నా చిన్నతనంలో కుటుంబ షోషణ కోసం నాగ్‌పూర్ వెళ్లి మూడేళ్లపాటు అక్కడే పనిచేసుకుంటూ జీవించాం. నాన్న అనారోగ్యానికి గురి కావడంతో తిరిగి సొంతూరు బాటపట్టాం. ఉండేందుకు సొంత ఇల్లు కూడా లేని పరిస్థితి మాది. ఒక్కపూట తిండి కోసం ఎన్నో ఇబ్బందులు పడేవాళ్లం. నాన్న తాపీమేస్త్రీ పనిచేసి కుటుంబాన్ని పోషించేవారు. ఆయనకు పని దొరికిన నాడు మా ఇంట్లో ఎసరు పడేది. ఇంట్లో కష్టాలను చూసి నేను, తమ్ముడు కలిసి హోటళ్లలో పనికి కుదిరాం. మా ఊరికి దగ్గర్లో కోటయ్య క్యాంప్ వద్ద సంస్కార్ ఆశ్రమం ఉండేది. నాలాంటి వాళ్లకు అదో దేవాలయం. పదోతరగతి వరకు అందులోనే ఉచితంగా చదువుకున్నాను.

స్నేహితుడి మాటతో..
పదోతరగతి తర్వాత ఇంటర్లో చేరా. మరోవైపు ఇల్లు గడవడం కోసం మంతని సత్యనారాయణ ఆశ్రమంలో పనిలో చేరాను. అక్కడికొచ్చే వారికి సేవలు చేసేవాణ్ని. అందులోని కొంతమంది పై చదువులకు వెళ్లమని ప్రోత్సహించారు. దాంతో నేను ఎంసెట్‌లో అర్హత సాధించాను. హైదరాబాద్‌లో సీటొచ్చింది. ఆ విషయం ఇంట్లో చేబితే ‘మా నుంచి కాద’ని చెప్పేశారు. ఆ మాటలేం పట్టించుకోకుండా 2012లో హైదరాబాద్‌కొచ్చా. ప్రారంభంలో కాలేజీలో అన్ని ఫ్రీ అని చెప్పారు. అది నమ్మి చేరాను. కొన్నాళ్లకు హాస్టల్ ఫీజు చెల్లిస్తేనే ఫుడ్, బెడ్ అని చెప్పడంతో చాలా ఇబ్బందిపడ్డాను. క్యాటరింగ్ పనికి వెళ్తే… తిండి దొరుకుతుందని నా స్నేహితుడు చెప్పాడు. మొదటిసారి వాడితో కలిసి క్యాటరింగ్ సర్వీస్‌కు వెళ్లాను. నా పని మెచ్చి రూ.3,000 టిప్పుగా ఇచ్చారు. ఆ డబ్బుతో నాకు కావాల్సిన పుస్తకాలు, డ్రాఫ్టర్, ఆప్రాన్ కొనుక్కొని తెల్లారి గర్వంగా క్లాస్‌కు వెళ్లాను.
అలా మొదలైంది
రెగ్యులర్‌గా క్యాటరింగ్ సర్వీస్‌కి వెళ్తూ ఉండేవాణ్ని. ఇంతలో ఫీజు కట్టలేదని హాస్టల్ నుంచి వెళ్లగొట్టారు. దాదాపు మూడు నాలుగు నెలలు ప్రతి రాత్రీ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లోనే నా మకాం. పోలీసులు కొట్టిన సందర్భాలూ ఉన్నాయి. ఓ సారి ఓ పెళ్లికి వెళ్తే అక్కడ చాలావరకు ఆహారం మిగిలిపోయింది. దాన్ని తీసుకెళ్లమని నిర్వాహకులు చెప్పారు. ఆ పదార్థాలను నిరాశ్రయులకు పెడదామని నాతో వచ్చిన వాళ్లతో చెప్పాను. వాళ్లలో కొంతమంది మాత్రమే నాతో ఏకీభవించారు. కవర్లలో ప్యాక్ చేసి ఆ ఒక్కరోజే 600 మందికి ఆహారాన్ని పంచాం. అలా క్యాటరింగ్‌కు వెళ్లడం, అక్కడ మిగిలిన ఆహారాన్ని పంచిపెట్టడం ఇదే పనులుగా పెట్టుకున్నాను. కొన్నాళ్లకు దీన్ని చానలైజ్ చేయాలని ఓ సంస్థను నెలకొల్పాను. చాలామంది ‘డోంట్ వేస్ట్ ఫుడ్’ అని చెబుతుంటారు. అందుకే ఆ పేరునే మా సంస్థకు ఖరారు చేసుకున్నాను. మేము రుచి చూసిన ఫుడ్‌నే పంచిపెడతాం. బస్తీవాసులకు, ఆసుపత్రుల వద్ద ఉండే రోగుల బంధువులకు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద ఉండే నిరాశ్రయులకు ఆహారాన్ని అందిస్తుంటాం. బిచ్చగాళ్లకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పంచిపెట్టను. ఎందుకంటే చాలామంది అవసరం లేకున్నా అడుక్కోవడం అలవాటుగా చేసుకున్నారు.

కరోనా వారియర్‌గా
క్యాటరింగ్ పనులు లేనప్పుడు హోటళ్ల వద్దకు వెళ్లి మిగిలిన ఆహారం ఇవ్వమని అడిగితే కొత్తతరం బిచ్చగాడని హేళనగా మాట్లాడారు. మరికొందరు దానం చేసినా నన్ను వెంబడించి పరిశీలించేవారు. కొందరైతే బూతులు తిట్టేవారు. ఎవరు ఎమనుకున్నా పదిమంది ఆకలి తీర్చడమే పనిగా ముందుకు సాగాను. కరోనా కాలంలో ప్రతిరోజూ దాదాపు 20 వేల మందికి ఆహారం అందించాను. నేను చేస్తున్న సేవలను తెలుసుకొని నార్సింగికి చెందిన అవంతిక గారు వారికున్న కార్లను ఉచితంగా ఆహారం పంపిణీ చేసేందుకు ఇచ్చారు. ఇలా చాలామంది తమవంతుగా మాతో ఆహారం పంపిణీ చేయించారు. ఆహారంతో పాటు ఆక్సిజన్ సిలిండర్లు కూడా అందించాను.
కరోనాలో నా సేవలను గుర్తించి మెగాస్టార్ చిరంజీవిగారు ‘కొవిడ్ వారియర్’ అవార్డుతో సత్కరించారు. ఆనంద్ మహేంద్ర గారు సైతం నా సేవలపై ట్వీట్ చేశారు. ప్రధాని మన్ కీ బాత్‌లో నా గురించి ప్రస్తావించారు. బాలకృష్ణగారు అన్‌స్టాపబుల్ కార్యక్రమానికి పిలుచుకొని మెచ్చుకున్నారు. ప్రస్తుతం శుభకార్యాలప్పుడు ముందస్తు సమాచారం ఇస్తున్నారు. సుమారు 200 మంది ఈ సంస్థలో స్వచ్ఛందంగా పనిచేస్తూ ఆకలితో ఉన్నవాడి కడుపు నింపుతున్నారు. ప్రస్తుతం రోజుకు రెండు వేల మందికి ఆహారాన్ని అందిస్తున్నాం. హైదరాబాద్‌తో పాటు రాజమండ్రి, డెహ్రడూన్, దక్షిణ ఢిల్లీ వంటి ప్రాంతాలకూ మా సేవా కార్యక్రమాన్ని విస్తరించాం. భవిష్యత్తులో నేను ఉన్నా లేకున్నా ఈ సేవ కొనసాగుతుండాలనే ఆలోచనతో యాప్ డెవలప్ చేస్తున్నా. దీని వల్ల దేశంలో కొంతమంది ఆకలినైనా తీర్చగలుగుతాను.

ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో మా సేవలు చూసి చాలా మంది దాతలు ముందుకొస్తున్నారు. మీరూ పదిమంది ఆకలి తీర్చాలనుకుంటే Www.dontwaste.food లేదా 7207103539 నంబర్‌ను సంప్రదించండి.
…? రాజు పిల్లనగోయిన