నమస్తే మేడమ్. నా వయసు ఇరవై ఎనిమిది. తొలిసారి తల్లి కాబోతున్నా. ప్రస్తుతం ఏడోనెల. బీపీలో హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. కొన్నిసార్లు హైబీపీ చూపిస్తున్నది. అసలు, బీపీని ఎలా అదుపులో ఉంచుకోవాలి? ఇలా జరిగితే బిడ్డకు ప్రమాదమా?
– ఓ సోదరి
బీపీలో హెచ్చుతగ్గులు తల్లికి, బిడ్డకు ప్రమాదమే. ఈ సమయంలో అలా జరిగితే గుర్రపువాతం వచ్చే ఆస్కారం ఉంది. దీన్ని వైద్య పరిభాషలో ‘ప్రీ ఎక్లెంప్సియా’ అని పిలుస్తారు. ఫలితంగా పొట్టలోని శిశువుకు మాయ ద్వారా జరిగే రక్త ప్రసరణ తగ్గిపోతుంది. పాపాయి సరిగ్గా ఎదగదు. తల్లికి ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంది. కిడ్నీలు విఫలం కావచ్చు. గుండెపోటు రావచ్చు. రక్తం గడ్డకట్టుకుపోయే అవకాశం ఉంది.
మీరు పురుడు పోసుకోవాలనుకునే వైద్యశాలలో అన్ని వసతులూ ఉన్నాయా అనేది చూసుకోండి. ‘క్రిటికల్ కేర్’ అందుబాటులో ఉన్న దవాఖాననే ఎంచుకోండి. క్రమం తప్పకుండా మందులు వాడండి. మర్చిపోవడం, మానేయడం క్షేమం కాదు. సొంత వైద్యం అసలే వద్దు. ఆహార పరంగా.. ఉప్పు ఎక్కువగా ఉండే ఊరగాయలు, వడియాలు, అప్పడాలు, వేపుళ్ల లాంటివి ఎక్కువగా తినవద్దు. సమయానికి భోంచేయాలి, వేళకు నిద్ర పోవాలి. అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ.. ధైర్యంగా ఉంటే ప్రసవం సజావుగా అవుతుంది.
మహిళా పాఠకులు తమ ఆరోగ్య సమస్యలను zindagi@ ntnews.comకు మెయిల్ చేయవచ్చు.
డాక్టర్ పి. బాలాంబ
సీనియర్ గైనకాలజిస్ట్