బడి మానేసినా చదువు ఆగిపోలేదు. కాలేజ్‌లో చేరకపోయినా పదిహేనేండ్లకే బీఏ పాసైంది. ఆపై పీజీ, పీహెచ్డీ, ఎల్ఎల్బీపట్టాలు అందుకుంది! కాలేజ్‌లో జర్నలిజం పాఠాలు చెబుతూనే జర్నలిజంలో పీజీ చదివింది. పేదరికం, సంసారం, పిల్లలు, ఉద్యోగాలు.. ఇవేవీ ఆమె చదువుకు ఆటంకం కాలేదు. అవకాశాలు వెదుక్కుంటూ ఎన్నో కోర్సులు చదువుతూ, మరెన్నో జీవన నైపుణ్యాలు పెంచుకున్న డాక్టర్ ఆచంట హేమలత జిందగీతో పంచుకున్న ఎనిమిది పదుల జ్ఞాపకాలివి.
మా నాన్న విద్యాశాఖలో ఉద్యోగి. నాకు ఇద్దరు అక్కలు, ముగ్గురు అన్నలున్నారు. మొదటి ఇద్దరు ఆడపిల్లల్ని నాన్న నిర్లక్ష్యం చేశారు. వాళ్లను స్కూల్‌కి పంపలేదు. బాల్య వివాహ చట్టం వస్తుందని మా నాయనమ్మ ఒత్తిడి చేస్తే.. పెద్ద అక్కకు ఏడో ఏటనే పెళ్లి చేశారు. చిన్నక్క నాలుగో తరగతి చదువుతున్నప్పుడు పదమూడో ఏట పెళ్లి చేశారు. మా పెద్దక్క పాతికేండ్లకే వితంతువు అయింది. తనకు అయిదుగురు పిల్లలు. అత్తమామల అండతో బతికేది. చిన్నక్కది పెద్ద సంసారం. వాళ్లాయన డాక్టర్. ఉమ్మడి కుటుంబంలో అందరికీ ఆమె వండి పెట్టేది. ఆ కష్టాలన్నీ చూసి నాన్నగారు రియలైజ్ అయ్యారు. ‘నువ్వు బాగా చదువుకోవాలమ్మా’ అన్నారు. నా మూడో బిడ్డను బీఏ చదివించిన తర్వాతే పెళ్లి చేస్తానని నిర్ణయించుకున్నారు.

బడిలేని చదువు
నాన్న జీతం చాలా తక్కువ. నన్ను, ముగ్గురు అన్నయ్యలను కష్టపడి చదివించారు. ఆ రోజుల్లో బాలికల చదువుకు ఇన్ని అవకాశాల్లేవు. మా నాన్న నాకు ఇంట్లోనే చదువు చెప్పారు. నాతో అక్షరాలు దిద్దించారు. బోర్డు మీద రాస్తూ చదువు చెప్పారు. పుస్తకాలు తెచ్చి చదివించారు. అలా నా కోసం రోజుకో అర్ధగంట సమయం కేటాయించారు. నా ఏడో ఏట బడిలో చేర్పించారు. మూడు, నాలుగు తరగతులు బడిలో చదివాను. నాన్నకు ఏడాదికి, రెండేండ్లకు బదిలీ అవుతుండేది. అందువల్ల మా చదువులకు ఆటంకాలుండేవి. నాకు పదేండ్లున్నప్పుడు తనకు నెల్లూరు బదిలీ అయింది. మా పెద్దక్క రాజమండ్రిలో ఉండేది. తన దగ్గర నన్ను వదిలిపోయారు. అక్కడ గవర్నమెంట్ గర్ల్స్ స్కూల్లో థర్డ్ ఫామ్‌లో చేర్పించారు. నేను ఉండలేక నెల రోజులకే అమ్మానాన్న దగ్గరికి వెళ్లిపోయాను.
బడి మానుకున్నా నా చదువు ఆగలేదు. ఇంట్లోనే ఉంటూ చదువుకున్నాను. పన్నెండో సంవత్సరంలో ఆంధ్రా మెట్రిక్యులేషన్ పరీక్షలు ప్రైవేటుగా రాశాను. ఇక్కడ ఇంటర్మీడియెట్‌కి ప్రైవేటుగా పరీక్షకు అనుమతి లేదు. మధ్యప్రదేశ్‌లో అనుమతిస్తున్నారని తెలిసి, ఇంటర్మీడియెట్ (హెచ్ఈసీ) పరీక్షలకు దరఖాస్తు చేశాను. మొదటి సంవత్సరం అమ్మా, నాన్నను వెంటబెట్టుకుని పరీక్షలు రాయడం కోసం ఇండోర్ వెళ్లాను. అక్కడ ఒక చిన్న గది అద్దెకు తీసుకుని ఉన్నాం. వండుకోవడం, పడుకోవడం అందులోనే. పరీక్షలు అయిపోయాక తిరిగి వచ్చాం. సెకండ్ ఇయర్లో స్నేహితుల సహకారంతో పరీక్షలు రాశాను. నాన్న జాయింట్ డీఈఓగా రిటైర్ అయ్యారు. తను హైదరాబాద్‌లో గుజరాత్ హైస్కూల్లో టీచర్‌గా చేరారు. మేం కూడా హైదరాబాద్ వచ్చాం.
మెట్టినింటి ఆదరణ
పదిహేనేండ్ల వయసులో ఉస్మానియా యూనివర్సిటీ బీఏ పరీక్షలకు ప్రైవేటుగా రాసేందుకు ఫీజు కట్టాను. ఇంట్లోనే చదువుకున్నాను. వరుసగా మూడేండ్లు పరీక్షలు రాశాను. బీఏ పాసయ్యాను. తర్వాత బీఈడీలో చేరాను. అప్పుడు కాలేజీకి పోయాను. అది చదువుతున్నప్పుడే ఆచంట సద్గురు ప్రసాద్‌తో పెళ్లి చేశారు. మా ఆయన అప్పటికే మెజిస్ట్రేట్. పెండ్లయ్యాక నెలకు బీఈడీ పరీక్షలు రాసి కాపురానికి వెళ్లాను. అక్కడ నా చదువుకు ఆటంకం రాలేదు. ‘నీకు చదువుకోవాలని ఉంటే చదువుకో, ఉద్యోగం చేయాలనుంటే చేయమ’ని మా ఆయన అన్నారు. మా ఆయన నల్లగొండకు బదిలీ అయ్యారు.
అక్కడ నిర్మల కాన్వెంట్లో టీచర్‌గా పని చేశాను. మా ఆయనకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి బదిలీ అయ్యేది. నల్లగొండ నుంచి హైదరాబాద్‌కు వచ్చాం. మా అత్తగారు, మావారి మేనకోడళ్లు కూడా మాతో ఉండేవారు. పిల్లల్ని చదివిస్తూ, ఇంట్లోవాళ్లను చూసుకుంటూ టీచర్‌గా పనిచేశాను. మా అత్తగారికి అన్ని సపర్యలు చేసి, తనకు కావాల్సినవన్నీ దగ్గర పెట్టి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు చదువుకునేదాన్ని. మళ్లీ పొద్దున్నే లేచి డ్యూటీకి పోయేదాన్ని. సంసారం, ఉద్యోగం, చదువు సమాంతరంగా ఉండేవి. ఉత్కళ్ యూనివర్సిటీలో ప్రైవేటుగా ఎంఏ (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) పరీక్షలు రాశాను. పిల్లలు, కుటుంబం నా చదువుకు ఆటంకమని ఎప్పుడూ అనుకోలేదు. పిల్లలు పెద్దయ్యాక నాకు సాయపడ్డారు.
పీహెచ్డీ కోసం ఎల్ఎల్బీ
ఎంఏ పాసయ్యాను. సత్యమ్మ, నర్సింహ కాలేజ్‌లో లెక్చరర్‌గా చేరాను. కొన్నాళ్లకు ఆ కాలేజీ మూతపడింది. తర్వాత ‘బాబూ జగ్జీవన్‌రామ్ కాలేజ్’లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లెక్చరర్‌గా జాబ్ వచ్చింది. లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తూనే ఎంఫిల్‌లో చేరాను. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఫిల్ ఫస్ట్ బ్యాచ్ మాది. పంచాయతీ రాజ్పాలన గురించి ఎంఫిల్ చేశాను. ఆ తర్వాత ‘అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జ్యూడీషియల్ రివ్యూ, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిఫరెన్స్’ టాపిక్‌తో పీహెచ్డీ అడ్మిషన్ తీసుకున్నాను. హైకోర్టు లైబ్రరీలో తీర్పులు చదివి, పరిశోధన చేశాను. ‘నువ్వు లా చదివితే గానీ నీకు పూర్తిగా అర్థం కాద’ని మా ఆయన అనేవారు. నా గైడ్ లా చదివారు. ఆయన సహకారం నాకు ఉపయోగపడింది. ఈలోగా మా ఆయనకు సంగారెడ్డి కోర్టుకు ట్రాన్స్ఫర్ అయింది. మూడేండ్లు సెలవు తీసుకుని నేనూ సంగారెడ్డి చేరుకున్నాను. పీహెచ్డీ థీసిస్ కోసం ఎల్ఎల్బీ (గుల్బర్గా యూనివర్సిటీలో) చదివాను. ఇంటి దగ్గరే చదువుకుంటూ పరీక్షలు రాశాను.

Hemalathadevi
డిగ్రీలేని లెక్చరర్
బాబూ జగ్జీవన్‌రామ్ కాలేజ్‌ని కొన్నాళ్లకు ప్రభుత్వం టేకప్ చేసింది. అందువల్ల నేను ప్రభుత్వ ఉద్యోగినయ్యాను. ఇరవై ఏండ్లకు పైగా ఆ కాలేజ్‌లో పని చేశాను. బేగంపేట (సికింద్రాబాద్)లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు బదిలీ అయ్యి, అక్కడ ఏడాదిపాటు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పాఠాలు చెప్పాను. ఏడాది గడిచింది. డైరెక్టరేట్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ డిగ్రీ కోర్సుల్లో మార్పులు చేసింది. చాలా కోర్సులను రీ స్ట్రక్చర్ చేశారు. బీఏలో జర్నలిజం సబ్జెక్ట్ ప్రవేశపెట్టారు.
కానీ, పాఠాలు చెప్పేందుకు లెక్చరర్స్ లేరు. నన్ను చెప్పమన్నారు. ‘ఇరవై రెండేండ్లు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లెక్చరర్‌గా పనిచేసిన నాకు, జర్నలిజం సబ్జెక్ట్‌తో పరిచయం లేదు. నేనెలా చెప్పగలను?’ అంటే.. ‘ఏం ఫర్వాలేదమ్మా.. మీరు చెప్పగలరు’ అంటూ ఆ బాధ్యత నాకు అప్పగించారు. ఉస్మానియా యూనివర్సిటీకి పోయి లైబ్రరీలో జర్నలిజం పుస్తకాలు చదవుతూ సిలబస్‌ని అర్థం చేసుకున్నాను. నోట్స్ రాసుకుని పాఠాలకు సిద్ధమయ్యాను. పిల్లలకు జర్నలిజం పాఠాలు చెబుతూ, ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సీటీలో ఎంఏ జర్నలిజం చదివాను. 2000 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం నాకు బెస్ట్ టీచర్ అవార్డ్ ప్రదానం చేసింది.
(అ)విశ్రాంత జీవితంలో
మా ఇంటి దగ్గర చంపాపేట శాఖాగ్రంథాలయం ఉంది. ప్రభుత్వ అనుమతితో ఇరవై ఏండ్ల క్రితం పిల్లల కోసం ట్యూషన్ పెట్టాను. ఇది కాన్సెప్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్. ఆదివారం రోజున పేద పిల్లలకు కంప్యూటర్లు, సంగీతం, చిత్రలేఖనం నేర్పేవాళ్లం. వాళ్లకు నోట్స్, పెన్నులు, రంగులు నేనే ఇచ్చేదాన్ని. అన్నం, స్నాక్స్ నేనే ఇచ్చేదాన్ని. దీని కోసం ఇద్దరు టీచర్లను పెట్టాను. ఇప్పటికీ ఈ ట్యూషన్ నడుస్తూనే ఉంది. మా అమ్మాయి మమత బాల్య వివాహాలు ఆపడం, ఆడపిల్లల్ని సంరక్షణ కోసం ‘తరుణి’ సంస్థ ప్రారంభించింది. వరంగల్, హైదరాబాద్‌లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించింది. రిటైర్మెంట్ తర్వాత మా అమ్మాయికి సహకరిస్తున్నాను. పత్రికలకు వ్యాసాలు రాస్తూ, బ్లాగులు రాస్తూ (అ)విశ్రాంత జీవితం గడిపాను. ఇన్ని కార్యక్రమాల్లో మునిగిపోయినా నేర్చుకోవడం ఆపలేదు.
మా అబ్బాయి దగ్గర ఉండేందుకు అమెరికాలోని డెట్రాయిట్కు వెళ్లాను. అక్కడ ఓక్లండ్ యూనివర్సిటీ అనుమతితో లైబ్రరీలో పుస్తకాలు చదివాను. అదే యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్ ఫెలోగా చేరాను. మూడు నెలల్లో పీడీఎఫ్ పూర్తి చేశాను. దక్షిణ భారత హిందీ ప్రచార సభలో చేరి ప్రథమ, మధ్యమ, భూషణ్ పాసయ్యాను. నాలుగేండ్ల క్రితం.. కర్ణాటక సంగీత సాధన మొదలుపెట్టాను. సంస్కృతం నేర్చుకున్నాను. ఈ అనుభవాలు, జ్ఞాపకాలన్నిటినీ ‘ఏ ప్రొఫెసర్ నెవర్ వెంట్ టు స్కూల్’ పేరుతో పుస్తకం రాశాను. మూడేండ్ల క్రితం ఆరోగ్యం క్షీణించింది. మంచానికే పరిమితమైపోయాను. అయినా నేర్చుకోవాలనే కోరిక ఉంది. కానీ, మందుల ప్రభావం వల్ల ఏమీ చదవలేకపోతున్నాను. ఎనిమిది పదుల జీవితంలో నేర్చుకోని కాలం ఈ మూడేండ్లే!
మనవరాలితో కంప్యూటర్ చదువు మా ఆయన టెక్కలి, యలమంచలి, శ్రీకాకుళం, కొడంగల్, గుంటూరు, కావలి, నిజామాబాద్, అనంతపురం.. ఇలా ఎన్నో ఊళ్లు బదిలీ అయ్యారు. ఫస్ట్ తారీఖు రాగానే డబ్బులు తీసుకుని హైదరాబాద్ వచ్చేవారు. రాలేకపోతే తెలిసిన వాళ్లతో పంపేవారు. అదీ కుదరకపోతే మనియార్డర్ చేసేవారు. ఇద్దరికీ ఉద్యోగాలున్నా తక్కువ జీతాలు. ఆర్థిక కష్టాలున్నా.. చదువు, ఉద్యోగంతో నా సంసార జీవితం సంతోషంగా సాగింది. లెక్చరర్‌గా రిటైర్ అయిన తర్వాత ఒక ఏడాదిపాటు సిటీ కాలేజ్ (హైదరాబాద్)లో అధ్యాపకురాలిగా పనిచేశాను. అప్పటికే కంప్యూటర్లు వచ్చాయి. పీజీ డిప్లొమా చేయడానికి ఇన్స్టిట్యూట్లో చేరాను. నా మనవలు, మనవాళ్లు బీటెక్ చదువుతున్నారు. వాళ్లతో తెలియనివి తెలుసుకుంటూ నేర్చుకున్నాను.
నాగవర్ధన్ రాయల
కేశమౌని మహేష్‌గౌడ్