ట్రైనింగ్ పనిమీద అవుట్ ఆఫ్ స్టేషన్‌కి వెళ్లి సాయంత్రం 6.30 గంటలకు స్టేషన్‌కు తిరిగొచ్చిన ఇన్స్పెక్టర్ రుద్రకు తన క్యాబిన్ ముందు హెడ్ కానిస్టేబుల్ రామస్వామి ఎవరితోనో గొడవ పడుతూ కనిపించాడు. ‘వచ్చీరాగానే ఏంటీ గొడవ?’ అంటూ కసురుకున్నాడు రుద్ర. ‘ఏంలేదు సార్. నిరుపమ్ అనే అబ్బాయి హత్య కేసుకు సంబంధించి ఇతణ్ని విచారిస్తున్నా. వివరాలు చెప్పమంటే మాపైకే ఎదురు తిరుగుతున్నాడు’ కాస్త కోపంగా అన్నాడు రామస్వామి. ‘ఏం మిస్టర్? ఏంటీ విషయం??’ కాస్త కటువుగా అన్నాడు రుద్ర. షర్ట్ మీద ఉన్న నేమ్ బ్యాడ్జీని చూస్తూ.. ‘ఓహో మీరేనా ఇన్స్పెక్టర్ రుద్ర.
ఈమధ్య చాలా ఫేమస్ అయినట్టు ఉన్నారు’ అంటూ సంబంధం లేకుండా మాట్లాడాడు సదరు వ్యక్తి. రామస్వామి కలుగజేసుకొంటూ.. ‘చూశారా సార్. ఇదీ వరుస.. పొద్దుటి నుంచి ఈ అబ్బాయి ఇలాగే మాట్లాడుతున్నాడు’ అంటూ తన కోపాన్ని వెళ్లగక్కాడు. ‘సరే.. ముందు ఆ కేసు ఫైల్ తీసుకురండి’ అంటూ కానిస్టేబుల్‌ను పురమాయించి క్యాబిన్లోకి కదిలాడు రుద్ర.
నగరంలోని ఓ హోటల్లో నిరుపమ్ అనే డిగ్రీ విద్యార్థి హత్యకు గురయ్యాడు. హత్య జరిగిన ఆ రోజున బాధితుడితో ఫోన్లో ఇద్దరే మాట్లాడారు. అందులో ఒకరు స్టేషన్లో రామస్వామితో గొడవ పడుతున్న ఇంద్ర కాగా మరొకరు ప్రణయ శ్రీనిధి. విచారణ నిమిత్తం ఇద్దరినీ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అయితే, ఇంద్రను మాత్రమే విచారిస్తుండటంతో అదే విషయమై రామస్వామిని రుద్ర ప్రశ్నించాడు. ‘అలా అడగండి సార్. న్యాయం అందరికీ సమానమే అంటారు కదా. శ్రీనిధిని పంపించి నన్నొక్కడినే ఎందుకు ప్రశ్నిస్తున్నారో గట్టిగా అడగండి’ అంటూ ఒకింత గట్టిగానే అరిచాడు ఇంద్ర. ‘మిస్టర్.. ఇది పోలీస్ స్టేషన్. మీ ఇల్లు కాదు’ అని ఇంద్రను హెచ్చరించిన రుద్ర.. ఏమైందంటూ రామస్వామిని ప్రశ్నించాడు.
‘సార్.. విచారణ కోసమని ప్రణయ శ్రీనిధి అనే మరో అబ్బాయిని కూడా స్టేషన్‌కు తీసుకొచ్చాం. అయితే, ఈరోజు అతనికి ఏదో ఓ జాబ్‌కి ఫైనల్ ఇంటర్వ్యూ ఉందట. పైగా విచారణలో అతను అలాంటి వ్యక్తి కాదని మాకు అనిపించింది. దీంతో శ్రీనిధి అడ్రస్, ఫోన్ నంబర్ తీసుకొని పంపించేశాం. ఇతనే కాస్త తేడాగా కనిపిస్తున్నాడు. అందుకే ఇక్కడే ఉంచాం’ అంటూ రామస్వామి చెప్తూపోయాడు. రామస్వామి చేసిన పనికి మనుసులోనే కాస్త కోపగించుకొన్న రుద్ర.. తనను తాను తమాయించుకొని శ్రీనిధిని కూడా స్టేషన్‌కు తీసుకురమ్మన్నాడు.
శ్రీనిధి వచ్చేలోపు కేసు వివరాలను మరోసారి పరిశీలించాడు రుద్ర. హత్య మధ్యాహ్నం ఒంటిగంట, ఒంటిగంటన్నర ప్రాంతంలో జరిగినట్టు రిపోర్ట్‌లో రాసి ఉన్నది. క్రైమ్ సీన్లో ఏ ఆధారాలూ దొరకలేదు. హోటల్ కస్టమర్స్ డైరీ, సీసీటీవీ ఫుటేజీ, పరిసర ప్రాంతాల్లో ఇంద్ర, శ్రీనిధి తచ్చాడినట్టు కూడా ఎలాంటి ఆధారాలూ లభించలేదు. దీంతో కేసు మరింత జఠిలమైంది. సమయం రాత్రి 7 గంటలు. స్టేషన్‌కు శ్రీనిధి వచ్చీరాగానే.. ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాడు రుద్ర. ‘హత్యకు గురైన నిరుపమ్ మీకు తెలుసా?’ రుద్ర ప్రశ్నించాడు. ఇద్దరూ తెలుసనారు. ‘ఎలా పరిచయం’ అని శ్రీనిధిని ప్రశ్నించాడు. ‘వాడు నా స్నేహితుడు. అంతే’ బదులిచ్చాడు శ్రీనిధి. ‘అంతే ఏంట్రా?’ కలుగజేసుకొన్నాడు ఇంద్ర. రుద్ర వారించబోతుండగా.. ‘సార్. నిరుపమ్, నేను, శ్రీనిధి ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్. శ్రీనిధి చెల్లెలు సులేఖినిని నిరుపమ్ ప్రేమిస్తున్నాడు. ఇది శ్రీనిధికి ఇష్టంలేదు.
ఇదే విషయమై ఇంతకుముందు చాలాసార్లు గొడవలయ్యాయి’ ఆగిపోయాడు ఇంద్ర. శ్రీనిధి వైపు చూసిన రుద్ర.. ‘నిజమా?’ అని ప్రశ్నించాడు. ‘తలవంచుకొని.. అవునన్నట్టు తలూపాడు శ్రీనిధి’. ఇంతలో మళ్లీ కలుగజేసుకొన్న ఇంద్ర.. ‘సార్.. ఈ రోజు ఉదయం 10.30 గంటల సమయంలో నాకు నిరుపమ్ ఫోన్ చేశాడు. హోటల్‌కు రమ్మన్నాడు. శ్రీనిధిని కూడా రమ్మన్నట్టు చెప్పాడు. అయితే, వేరే పనులు ఉండటంతో నేను హోటల్‌కు వెళ్లలేకపోయా. ఇంతలో నిరుపమ్ చనిపోయాడని, కాల్‌లిస్ట్‌లో నా నంబర్ ఉందంటూ విచారణ పేరిట పోలీసులు నన్ను పట్టుకొచ్చారు’ ఉక్రోశంతో చెప్తూ పోయాడు ఇంద్ర. ‘సార్.. ఇంద్ర చెప్పింది నిజమే. నిరుపమ్ నన్ను కూడా హోటల్‌కు రమ్మన్నాడు. అయితే, సాయంత్రం నాకు ఓ జాబ్ ఇంటర్వ్యూ ఉంది. దానికి ప్రిపేర్ అవ్వాలని వెళ్లలేకపోయా’ శ్రీనిధి సమాధానం. ‘సో ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతూ.. ఇంట్లోనే ఉన్నావన్న మాట’ తీక్షణంగా అడిగాడు రుద్ర. ‘లేదు సార్’ శ్రీనిధి సమాధానం. ‘మరి..!’ అంటూ కాస్త ఆత్రుతతో అడిగిన రుద్ర.. ఆ వెంటనే.. ‘మార్నింగ్ నుంచి ఇద్దరూ ఏమేం చేశారో, ఎక్కడెక్కడికి వెళ్లారో రుజువులతో సహా చూపించండి’ అంటూ హుకూం జారీ చేశాడు. ఇంతలో ఆ స్టేట్మెంట్స్ అప్పటికే తీసుకొన్నట్టు రామస్వామి చెప్పాడు.
ఇంద్ర తన స్టేట్మెంట్లో ఇలా చెప్పాడు.. ‘ఉదయం 7 గంటలకు నిద్రలేచా. ఇంట్లోనే ఉన్నా. 10.30కు నిరుపమ్ ఫోన్ వచ్చింది. అయితే, హాస్పిటల్లో అమ్మకు హెల్త్ చెకప్ ఉండటంతో 11 నుంచి 2 గంటల దాకా అక్కడే ఉన్నా. చెకప్ అవ్వగానే రెండింటికి అమ్మతో హాస్పిటల్ నుంచి ఇంటికి బయల్దేరా. మధ్యాహ్నం 2.30 నుంచి మూడింటి వరకూ లంచ్ చేశా. ఇంతలో పోలీసులు ఫోన్ చేసి రమ్మనడంతో స్టేషన్‌కు వచ్చా. కావాలంటే మా అమ్మకు ఫోన్ చేసి అడగండి’ అంటూ ఇంద్ర స్టేట్మెంట్లో పేర్కొన్నాడు. వెరిఫై చేసుకొన్న రుద్రకు ఇంద్ర చెప్పినవన్నీ నిజమేనని అనిపించింది.
ఇక శ్రీనిధి స్టేట్మెంట్ ప్రకారం.. ‘ఉదయం 7 గంటలకు లేచా. వాకింగ్‌కి వెళ్లి 8 గంటలకు ఇంటికొచ్చా. ఉదయం 10.15కు నిరుపమ్ ఫోన్ వచ్చింది. ఇంటర్వ్యూ ఉండటంతో లైట్ తీస్కున్నా. ఉదయం 11 గంటలకు సిటీ లైబ్రరీకి వెళ్లా. మధ్యాహ్నం ఒంటిగంటకు లంచ్ కోసం బయటకొచ్చా. అక్కడే ఓ హోటల్లో లంచ్ చేశా. బిల్లు ఇదిగో. మళ్లీ రెండింటికి లైబ్రరీ లోపలికి వెళ్లా. స్టేషన్‌కు రమ్మని మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో పోలీసులు ఫోన్ చేశారు. లైబ్రరీ రిజిస్టర్లో లాగౌట్ చేసి వచ్చా. ఇంటర్వ్యూ గురించి చెప్పడంతో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వెళ్లిపోయా’ అంటూ శ్రీనిధి స్టేట్మెంట్లో పేర్కొన్నాడు. ‘హోటల్లో గంటపాటు భోజనం చేస్తూనే ఉన్నావా?’ శ్రీనిధిని సూటిగా ప్రశ్నించాడు రుద్ర.
ఇంతలో ముఖ్యమైన ఫోన్ రావడంతో ఇద్దరినీ స్టేషన్లోనే ఉండమన్న రుద్ర.. అరగంటలో వస్తానని చెప్పి బయటకు వచ్చాడు. కారులో ఏదో ఇంపార్టెంట్ ఫోన్ మాట్లాడుతున్న రుద్ర చూపు.. ఓ విద్యాసంస్థ ఏర్పాటు చేసిన హోర్డింగ్ మీద పడింది. అందులో.. ‘ఇంటెలిజెంట్ విద్యార్థికి, డల్ విద్యార్థికి రోజులో ఉండేది 24 గంటలే. దాన్ని ఎలా సద్వినియోగం చేసుకొన్నాడన్న దానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది’ అని రాసి ఉంది. ఇంతలో రుద్ర మెదడులో ఏదో మెరుపు.
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ ఇంద్ర, శ్రీనిధి జీవితాల్లో ఏమేం జరిగాయో లెక్కేసుకొన్నాడు రుద్ర. ఆ తర్వాత.. స్టేషన్‌కు వచ్చి రాగానే అసలు హంతకుడిని నిలదీయగానే, అతను కూడా తన నేరాన్ని ఒప్పేసుకొన్నాడు. ఇంతకీ హంతకుడు ఎవరు? రుద్ర ఎలా కనిపెట్టాడు?
సమాధానం:
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ మొత్తం 12 గంటలు. శ్రీనిధి ఈ పన్నెండు గంటల లెక్కను స్టేట్మెంట్లో ఇలా చెప్పాడు. 7-8: వాకింగ్, 8-11: ఇళ్లు, 11-1: లైబ్రరీ, 1-2: లంచ్, 2-3: లైబ్రరీ, 3-4: పోలీస్ స్టేషన్, 4-7: ఇంటర్వ్యూ. అలా 12 గంటలు పూర్తయ్యాయి. ఇక, ఇంద్ర ఈ పన్నెండు గంటల లెక్కను ఇలా చెప్పాడు. 7-11: ఇళ్లు, 11 నుంచి 2 గంటల దాకా: హాస్పిటల్, 2-2.30: హాస్పిటల్ నుంచి ఇళ్లు, 2.30-3: లంచ్, 3-7: పోలీస్ స్టేషన్. ఇంద్ర తప్పించుకోవడానికి ‘అమ్మకు హెల్త్ చెకప్ ఉండటంతో 11 గంటల నుంచి 2 గంటలు వరకు అక్కడే ఉన్నా’ అని రెండింటి వరకూ అక్కడే ఉన్నట్టు స్ఫురించేలా అబద్ధం చెప్పాడు. నిజానికి హాస్పిటల్లో ఇంద్ర 11 గంటల నుంచి 2 గంటల వరకు.. అంటే 11 నుంచి రెండు గంటలు (రెండు గంటల దాకా అంటే రెండు గంటల పాటు) మాత్రమే ఉన్నాడు. అలా 11 గంటల లెక్క తేలింది. ఇంకో గంట ఏం చేశాడన్నది ప్రశ్న! వివరంగా చెప్పాలంటే మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే హాస్పిటల్లో ఉన్న ఇంద్ర.. తన తల్లి డాక్టర్ రూమ్‌లోకి వెళ్లగానే అక్కణ్నుంచి హోటల్‌కి వెళ్లాడు. నిరుపమ్‌ను హత్య చేశాడు. కొడుకు రూమ్ బయటే ఉన్నాడనుకొని ఆమె అనుకొన్నది. అదే పోలీసులకు చెప్పింది. కాగా, తాను కూడా ప్రేమించిన సులేఖినిని నిరుపమ్ కూడా ప్రేమిస్తుండటంతోనే ఇంద్ర అతన్ని చంపినట్టు తర్వాతి విచారణలో తేలింది.
…? రాజశేఖర్ కడవేర్గు