గుల్మార్గ్ అంటే పూలదారి అని అర్థం. ఇప్పుడు మాత్రం ఈ ప్రాంతంలోని దారులన్నీ.. మంచుతో నిండి ఉంటాయి. ఇండ్ల పైకప్పులు, ఆరుబయట, ఆపిల్ తోట అంతటా మంచు ముసురుకుంటుంది! అక్కడున్న వాళ్ల సంగతేమో కానీ, ఈ మంచుపల్లకిని చూసేందుకు పర్యాటకులు గుల్మార్గ్ బాట పడతారు. కశ్మీర్‌లోని అందమైన ప్రాంతాల్లో ఇదీ ఒకటి. బారాముల్లా జిల్లాలో ఉండే గుల్మార్గ్ ఏటా నవంబర్ చివరి వారం వచ్చేసరికి మంచు దుప్పటి కప్పుకొంటుంది. స్కేటింగ్, స్కీయింగ్ ఆటలు మొదలవుతాయి.
జారుడు పలకలపై కూర్చొని దూసుకుపోయే స్లైడింగ్ విన్యాసాలు గుల్మార్గ్ వచ్చే పర్యాటకులకు క్షణం తీరిక లేకుండా చేస్తాయి. చుట్టూ ఉన్న పీర్‌పంజాల్ పర్వత శ్రేణులు నవంబర్ నుంచి తెల్లగా మెరిసిపోతుంటాయి. గుల్మార్గ్ కేబుల్ ప్రత్యేక ఆకర్షణ. దీనిని గొండోలా రైడ్ అంటారు. గుల్మార్గ్ నుంచి ఆఫర్వాట్ పర్వత శిఖరంపైకి కేబుల్ కారులో చేరుకోవచ్చు.
మంచుతెరలను తోసుకుంటూ ఐదు కిలోమీటర్లు సాగే కేబుల్ కారు ప్రయాణం.. హిమాలయాల సౌందర్యాన్ని 360 డిగ్రీల కోణంలో కళ్ల ముందు ఆవిష్కరిస్తుంది. పార్కులు, పర్యాటక కేంద్రాలు సరేసరి. స్థానికుల ఆతిథ్యం, కశ్మీరీ రుచులు, సంప్రదాయాలు పర్యాటకులకు మరచిపోలేని అనుభూతినిస్తాయి. ఆతిథ్యం కోసం బడ్జెట్ హోటళ్ల నుంచి స్టార్ హోటళ్ల వరకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి.