సోనీ టీవీ సూపర్‌స్టార్ సింగర్ సీజన్ 3 వేదికపైకి గులాబో సపేరా రావడంతోనే అందరూ నిలబడ్డారు. కరతాళ ధ్వనులతో ఆమెకు స్వాగతం పలికారు. అక్కడున్న వారంతా ఆమెను గొప్ప కళాకారిణిగానే కాదు అంతకుమించిన పోరాటంలో గెలిచినందుకు అంతెత్తున గౌరవించారు. ఇంట్లో లింగ వివక్షను, సమాజంలో కుల వివక్షను ఎదుర్కొని ఎదిగొచ్చిన సాహసి ఆమె. బొందలోంచి బయటపడి బతికింది. ఊరికి దూరంగా పెరిగింది. దేశం గర్వించే కాల్బేలియా నృత్య కళాకారిణిగా ఎదిగింది. బహిష్కరించిన ఊరే స్వాగతం పలికిన ఆ బిడ్డకు ఘన స్వాగతం ఈ రేంజ్లో ఉండాల్సిందే!
భూమిలో పాతిపెట్టినా పోరాడి గెలిచిన ఒక బిడ్డ కథ ఇది. అది రాజస్థాన్, అజ్మీర్ ప్రాంతంలో కొత్డా గ్రామం. ఆ ఊరిలో పాములు ఆడిస్తూ బతికే కాల్బేలియా అనే సంచార జాతికి చెందిన ఓ కుటుంబం నివసించేది. ఆ ఇంట్లో ఓ రోజు ఒక ఆడపిల్ల పుట్టింది. బిడ్డ పుట్టినప్పుడు తండ్రి ఊళ్లో లేడు. పాములు ఆడించేందుకు సంచారానికి వెళ్లాడు. ఆ పిల్లను వదిలించుకోవాలని పుట్టిన కొన్ని గంటలకే గొయ్యి తీసి పసిగుడ్డును పూడ్చిపెట్టారు కొందరు ప్రబుద్ధులు.
పోరాడి తెంచుకున్న పేగు తడి ఆరకముందే ఈ సమాజంతో ఆ బిడ్డ యుద్ధం మొదలైంది. గోతిలో పాతిపెట్టినా గుక్కపట్టి ఏడుస్తూనే ఉంది. మట్టికింద ఏడు గంటలు బతికే ఉంది! ఆ ఏడుపు విన్న తల్లి కడుపు తరుక్కుపోయింది. బొందను తవ్వి బిడ్డను గుండెలకు హత్తుకుంది. కప్పెట్టిన మట్టిలో అడ్డుగా ఉన్న గడ్డి పరకలు ఆ బిడ్డ శ్వాస తీసుకోవడానికి సాయపడ్డాయి. కొన ఊపిరితో బయటపడ్డ ఆ చిన్నారి నృత్యమే ఉచ్ఛాస నిశ్వాసలుగా ఎదిగింది.
రోజులు గడిచాయి. సంచారానికి వెళ్లిన తండ్రి ఇంటికి చేరుకున్నాడు. బిడ్డను ఎత్తుకొని ముద్దాడాడు. తన బిడ్డ విషయంలో ఇంట్లో వాళ్లు చేసిన దారుణం ఆయనకు అప్పటికింకా తెలియదు. ఓ రోజు ఆడబిడ్డను, మగబిడ్డను సమానంగా
చూడాలని చెప్పే మనసున్న పెద్దలు ఆ తండ్రిని పంచాయితీకి పిలిచారు. ఆ పసికందు విషయంలో అతని కుటుంబం ఎంతటి దారుణానికి ఒడిగట్టిందో చెప్పారు. అందుకు శిక్ష అనుభవించాల్సిందే అన్నారు. గ్రామం నుంచి వెలివేశారు. పెద్దలు విధించిన బహిష్కార శిక్ష ఆ వెనుకబడిన కుటుంబానికి ఎలాంటి పరిష్కారం చూపలేకపోయింది.
గులాబీ విరిసింది
జరిగిన తప్పునకు కుంచించుకుపోయింది ఆ కుటుంబం. బిడ్డకు ధన్వంత్రి అని పేరు పెట్టుకుంది. ఆ చిన్నారికి జబ్బు చేస్తే దవాఖానలో చేర్పించారు తల్లిదండ్రులు. మందులకు జబ్బు లొంగలేదు. వైద్యులు చేతులెత్తేశారు. ఆమె బతకాలని ఆశిస్తూ తన పక్కన ఒక గులాబీని ఉంచి పోయారు. చివరికి బతికింది. ఆ పువ్వుకు గుర్తుగా బిడ్డ పేరుని గులాబీగా మార్పించాడు తండ్రి.
ఊరికి దూరంగా పెరిగిన గులాబీకి పాములే స్నేహితులు. వాటిని ఆడించే నృత్యమే ఆమెకు ఆటపాటలు. గులాబీ వాళ్ల నాన్న పాములు ఆడించడానికి ఎక్కడికి వెళ్లినా కూతురును వెంట తీసుకెళ్లేవాడు. పుంగి ఊదుతూ పాములను ఆడించేవాడు. తండ్రిని నిశితంగా గమనిస్తూ ఆ వాద్యం ఊదడంలో పట్టుసాధించిందీ బిడ్డ. తండ్రి ఆడిస్తున్న పాములకు పోటీగా తనూ మెలికలు తిరిగేది. ఆ అనుభవమేతర్వాత కాల్బేలియా నృత్యంపై పట్టుకు కారణమైందంటారామె.
పుష్కర్ మేళా సంబురాలు
గులాబీకి పదేండ్లు ఉన్నప్పుడు రాజస్థాన్‌లో పుష్కర్ మేళాకు హాజరయ్యింది. ఆ మేళాలో జానపద నృత్య కళాకారులకు ప్రదర్శన అవకాశం కల్పించారు. ఆ చిన్న అవకాశం ఆమె జీవితాన్ని మార్చేసింది. గులాబీ తొలి ప్రదర్శన చూసినవాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఆ ప్రాంగణమంతా చప్పట్లతో మార్మోగింది. చిన్నప్పటి నుంచి తమను అదోలా చూసేవాళ్లే తప్ప.. అభినందించే వాళ్లను ఆమె చూసి ఎరగదు. ఆ అభినందనలు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. నిమ్న కులమనే ఈసడింపులు పోయి.. నృత్య కళాకారిణిగా కొత్త గుర్తింపు వచ్చింది. పుష్కర్ మేళాలో మొదలైన ప్రయాణం మూడున్నర పుష్కరాలుగా అప్రతిహతంగా కొనసాగుతున్నది.
పదహారేండ్లకు
చిన్న చిన్న గ్రామాలు తిరుగుతూ వీధుల్లో ప్రదర్శనలిచ్చే గులాబీ ప్రతిభను గుర్తించి పెద్ద పెద్ద సంస్థలు ఆహ్వానించడం మొదలుపెట్టాయి. 1980లో జైపూర్‌లో జరిగిన ప్రదర్శన ఆమె జీవితాన్ని మరింతగా మార్చేసింది. తమ సాంస్కృతిక కళారూపాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించే నృత్యకారిణి దొరికిందని రాజస్థాన్ పర్యాటక శాఖ అధికారులు గుర్తించారు. రాజస్థానీ సంస్కృతిని పరిచయం చేసేందుకు ప్రభుత్వం నిర్వహించే వేడుకల్లో ఆమె ప్రదర్శన తప్పనిసరి చేశారు. అయిదేండ్ల తర్వాత… వాషింగ్టన్ నగరంలో జరిగే ఒక ప్రదర్శనకు భారత్ తరఫున ప్రదర్శన ఇచ్చేందుకు గులాబీ ఎంపికైంది.
అప్పుడు ఆమె వయసు పదహారేండ్లు! ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నది లేదు. కేవలం వీధి ప్రదర్శనలు, భిక్షాటనతో మొదలైన ఆమె నాట్యం అంతర్జాతీయ వేదికపై కొత్తపుంతలు తొక్కింది. భారతీయ పత్రికలు సపేరా బిడ్డ (పాములోళ్ల బిడ్డ) అమెరికాలో మన దేశం గర్వించేలా నృత్య ప్రదర్శన చేసిందని అభినందిస్తూ కథనాలు ప్రచురించాయి. ఆ సందర్భంలో ఓ విదేశీ పత్రిక గులాబీ ఇంటర్వ్యూ ప్రచురించింది. అందులో ఆమె పేరును గులాబోగా ప్రస్తావించింది. ఈ మార్పు గులాబీకీ నచ్చింది. తన పేరును గులాబోగా స్థిరం చేసుకుంది. అదే పేరుతో కాల్బేలియా నృత్యంలో మహారాణిగా ఎదిగింది.
పొమ్మన్న ఊరే రమ్మంది!
అమెరికా ప్రదర్శన తర్వాత గులాబో తిరిగి తన ఊరికి చేరింది. ఒకప్పుడు సపేరా కుటుంబాన్ని వెలివేసిన పెద్దమనుషులంతా వచ్చి ఆమెకు స్వాగతం పలికారు. ఆమెను అవమానించిన వాళ్లే… జయజయ ధ్వానాలు పలికారు. తమ పిల్లలకు కూడా ఈ నృత్యం నేర్పించమని అడిగారు. ‘నీవు మా ఊరి బిడ్డవైనందుకు ఎంతో గర్విస్తున్నామ’ని కీర్తించారు.
‘నా నృత్యం వివక్షను దూరం చేస్తుందని, ఊరిని దగ్గర చేస్తుందని, గ్రామ ప్రజలలో ఉండే భేదభావాలను తొలగిస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. నేను నమ్మిన కళతో ఇది సాధ్యమైంది’ అంటారు గులాబో. కాల్బేలియా నృత్యాన్ని తమ జాతివారికే కాకుండా ఇతరులకూ నేర్పించడం మొదలుపెట్టింది. అవసాన దశకు చేరుకున్న ఆ నృత్యరీతికి మళ్లీ జీవం పోసింది. ఎన్నో ప్రయోగాలు చేసి కొత్త రూపునిచ్చింది. జైపూర్‌లో ‘గంగౌర్ ఘుమర్’ డ్యాన్స్ అకాడమీని నెలకొల్పింది.
కూడుపెట్టని కళ
డప్పు, తాళం, కంజరి, పుంగి వాద్యకారులతో కలిసి గులాబో చేసే నృత్య ప్రదర్శన ఆద్యంతమూ ఆసక్తిగా సాగుతుంది. పాదాలను బొంగరంలా తిప్పుతూ, దేహాన్ని అలవోకగా వంచుతూ చేసే విన్యాసాలు ‘ఔరా!’ అనిపిస్తాయి. ఎన్ని చేసినా ఈ కళ కడుపు నింపదంటుంది గులాబో. ‘ఎంతోమంది కళాకారులు వేదికపై అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారు.
కానీ, వాళ్ల జీవితాలు మాత్రం దయనీయంగా ఉన్నాయ’ని అంటారామె. తన దగ్గర శిక్షణ తీసుకున్న కళాకారులకు గుర్తింపు వచ్చినంతగా ఆదాయం రావడం లేదని గమనించింది. నాట్యం నేర్పడమే కాదు, వాళ్ల ఆకలి తీర్చడమూ తన బాధ్యతగా స్వీకరించింది. యాభై ఏండ్ల వయసులో సాంకేతిక విషయాలు నేర్చుకొని, ఆన్లైన్లో నాట్య పాఠాలు చెబుతున్నది. అలా వచ్చిన ఆదాయాన్ని నిరుపేద కాల్బేలియా కళాకారులకు పంచుతున్నది.
శాస్త్రీయ సంగీతంలో హార్మోనియం కళాకారుడిని
వివాహమాడిన తర్వాత గులాబో వైవాహిక జీవితం జుగల్బందీగా సాగింది. తన కళకు ఎల్లలు లేవని చాటి చెబుతున్నది.
డెన్మార్క్‌లో పాఠశాల నెలకొల్పి అక్కడివారికి కాల్బేలియా నృత్య శిక్షణ ఇస్తున్నది. జానపద నృత్య కళాకారిణిగా గులాబో ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో సత్కరించింది.