నేటి ప్రపంచంలో అత్యధిక మోసాలు ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. గతేడాది 60% మంది ఏదో ఒక సైబర్ మోసానికి గురయ్యారంటే.. ఫ్రాడ్స్టర్లు ఎంతలా విజృంభిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సెక్యూరిటీ అవేర్నెస్తో నిన్న మొన్నటి వరకూ నకిలీ ఇ-మెయిల్స్‌ను (ఫిషింగ్) సులభంగా గుర్తించేవాళ్లం. అయితే, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వాయిస్ క్లోనింగ్, డీప్‌ఫేక్స్ దాడి చేస్తున్నాయి. వీటికి తోడు, సోషల్ ఇంజనీరింగ్ కూడా పెరిగింది. అందుకే, ఏది నిజమో, ఏది అబద్ధమో గుర్తించడం గగనమైపోతున్నది. ఈ ప్రమాదాన్ని నిత్యంగుర్తించే వినియోగదారుల భద్రత కోసం కొత్త సెక్యూరిటీ ఫీచర్లను గూగుల్ తీసుకొచ్చింది. అవే ఇవి..

సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి గూగుల్ మెసేజెస్ యాప్ కొత్త సెక్యూరిటీ ఫీచర్స్‌ని పరిచయం చేసింది. వాటిలో సేఫర్ లింక్స్ ఒకటి. దీంతో సైబర్ మోసగాళ్లు పంపే ఫ్రాడ్ లింక్స్‌కి చెక్ పెట్టొచ్చు. మీకు వచ్చిన మెసేజ్ నకిలీది అని అనుమానం వస్తే చాలు గూగుల్ మెసేజెస్ వార్నింగ్ ఇస్తుంది. మీరు ఓకే చెప్పే వరకు.. ఆ ప్రమాదకరమైన వెబ్సైట్లోకి వెళ్లనివ్వదు.

గూగుల్ మెసేజెస్‌లో ఇప్పుడిదో కొత్త ఫీచర్. ఇది మీ చాట్లకు అదనపు భద్రత ఇస్తుంది. ఎలా పని చేస్తుందంటే.. మీరు మాట్లాడుతున్న వ్యక్తి నిజంగానే మీ ఫ్రెండేనా, లేక నకిలీ అకౌంట్ అనేది చెక్ చేసుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే.. మీ ఫ్రెండ్ ఫోన్లో చూపిన QR కోడ్‌ని స్కాన్ చేస్తే చాలు. దాంతో మీ చాట్ పూర్తిగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్‌గా మారిపోతుంది. ఇప్పుడు ఈ ఫీచర్ Android 10, ఆపై వెర్షన్లు ఉన్న ఫోన్లలో అందుబాటులో ఉంది. ఈ కీ వెరిఫైయర్ ద్వారా గూగుల్ మరిన్ని సెక్యూరిటీ ఫీచర్లను అందించేందుకు సిద్ధం అవుతున్నది.

ఫోన్ పోయిందా? పాస్వర్డ్ మర్చిపోయారా? ఇక టెన్షన్ అవసరం లేదు! ఇప్పుడు గూగుల్ కొత్త ఫీచర్ Sign in with Mobile Numberతో మీ అకౌంట్‌ని మళ్లీ సులభంగా తెరవొచ్చు. ఫోన్ పోయినా, దెబ్బతిన్నా లేదా కొత్త ఫోన్ తీసుకున్నా మీ మొబైల్ నంబర్‌తోనే అకౌంట్‌ని తిరిగి యాక్సెస్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ అవసరం లేకుండానే ఇదంతా చేయొచ్చు. మీ పాత ఫోన్లో ఉన్న లాక్‌స్క్రీన్ పాస్‌కోడ్‌తో వెరిఫై చేస్తే చాలు. గూగుల్ ఆటోమేటిక్‌గా మీ అకౌంట్‌ని గుర్తించి లాగిన్ చేస్తుంది. ఈ ఫీచర్ ని త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేందుకు గూగుల్ సిద్ధం అవుతోంది.

ఆన్లైన్ అకౌంట్ పోతే మనకు చాలా టెన్షన్ పడతాం. ఉన్న అన్ని మార్గాల్ని వాడేస్తాం. రికవరీ సోర్సుల్ని సరిగా సెట్ చేయకపోతే.. ఇబ్బంది పడతాం. అందుకే, దాన్ని తిరిగి పొందడం ఇప్పుడు చాలా సులభం అయింది. ఇందుకోసం గూగుల్ రికవరీ కాంటాక్ట్స్ పేరుతో అదనపు సౌకర్యాల్ని తీసుకొచ్చింది. మీకు నమ్మకమైన వారిని ‘రికవరీ కాంటాక్ట్స్’గా సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే మీరు ఎంచుకున్న రికవరీ కాంటాక్ట్స్‌ని వాడుకోవచ్చు. ఆ కాంటాక్ట్‌ల ద్వారానే మీ అకౌంట్‌ను తిరిగి పొందవచ్చు. ఈ ఫీచర్‌ని మీరు Google Account-Security సెక్షన్లో చూసుకోవచ్చు.