ఉత్తర్‌ప్రదేశ్ పోలీసుల సహకారంతో నిర్వహించిన పైలట్ రన్లో దాదాపు 2 కోట్ల అత్యవసర కాల్స్, మెసేజ్‌లను ఈ సర్వీస్ ద్వారా విజయవంతంగా ట్రాక్ చేశారు. ఇది ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది.
అత్యవసర సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉండి.. మీరు ఎక్కడున్నారో ఎదుటివారికి వివరించలేని పరిస్థితి ఎదురైందా? ఆ కంగారులో లొకేషన్ చెప్పకపోయినా పోలీసులు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే టెక్నాలజీ ఉంటే ఎంత బాగుంటుందో కదా!? గూగుల్ సరిగ్గా అలాంటి అద్భుతమైన ఫీచర్‌నే ఇప్పుడు ఇండియాలోకి తెచ్చింది. కావాలంటే, ఈ కొత్త సర్వీస్ ఎలా పనిచేస్తుందో మీరే చూడండి. గూగుల్ తన ‘ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్’ (ఈఎల్ఎస్)ను భారత్‌లోని ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ఇటీవలే అందుబాటులోకి తెచ్చింది. దీనిని మొదటగా ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించారు. మనం ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు 112 నంబర్‌కు కాల్ చేస్తే, మన ఫోన్ ఆటోమేటిక్‌గా మన ఖచ్చితమైన లొకేషన్ వివరాలను అత్యవసర సేవా విభాగాలకు పంపిస్తుంది. ఒకవేళ మీరు మాట్లాడలేని స్థితిలో ఉన్నా, కాల్ కట్ అయినా కూడా, మీ లొకేషన్ ఆధారంగా సహాయక బృందాలు మిమ్మల్ని చేరుకుంటాయి.
జీపీఎస్, వైఫై లేదా మొబైల్ నెట్‌వర్క్‌ల సాయంతో ఈ టెక్నాలజీ దాదాపు 50 మీటర్ల పరిధిలోని ఖచ్చితమైన వివరాలను అందిస్తుంది. ఈ సర్వీస్ వల్ల మన వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందేమోనని భయపడాల్సిన అవసరం లేదని గూగుల్ స్పష్టం చేసింది. ఈ ఫీచర్ కేవలం మీరు అత్యవసర నంబర్లకు కాల్ చేసినప్పుడు మాత్రమే యాక్టివేట్ అవుతుంది. గూగుల్ మీ లొకేషన్ డేటాను ఎక్కడా సేకరించదు, భద్రపరచదు. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ 6.0 ఆపై వెర్షన్ ఉన్న ఫోన్లలో ఇది పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో దేశంలోని మిగిలిన రాష్ర్టాల్లో కూడా ఈ సేవలను విస్తరించాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల ప్రమాద సమయాల్లో బాధితులకు వేగంగా సహాయం అందే అవకాశం ఉంటుంది.
మొత్తానికి, టెక్నాలజీని ప్రాణాలను కాపాడటానికి ఉపయోగించడం గూగుల్ తీసుకున్న గొప్ప అడుగని చెప్పొచ్చు. ఆపదలో ఉన్నవారికి ఈ ఫీచర్ ఒక నిజమైన రక్షణ కవచంలా మారుతుంది.