నాట్యానికి పరవశించి పాడే కాలి అందియల్లో, చెంగు చెంగున దుమికే లేగదూడల మెడల్లో ఇత్తడి గజ్జెలు మోగుతుంటాయి. ఆ మువ్వల చప్పుడు మనసును ఆహ్లాదపరుస్తుంది. చూడగానే మదిలో మధురానుభూతి కలుగుతుంది. ఎద ఝల్లుమనిపించే ఆ సిరిసిరి మువ్వలతో నగలనూ ఘల్లుమనిపిస్తున్నారు నేటి డిజైనర్లు. ‘ఘుంఘ్రూ నెక్లెస్’లు మార్కెట్లో నయా ట్రెండ్.
నగల అందానికి ప్రతిసారీ పుత్తడే అవసరం లేదు.. ఇత్తడి అయినా సరిపోతుంది. నాజూకు నగిషీలే కావాలని లేదు.. నయా లుక్ ఉంటే చాలు. కొత్త రకాలను సృష్టించనక్కర్లేదు… ఉన్నవాటితోనే ప్రయోగాలు చేస్తే సరిపోతుంది. జనం మెచ్చుతారు. తమ కలెక్షన్లో వాటికీ చోటిస్తారు. సరికొత్తగా రూపు దిద్దుకుంటున్న ఘుంఘ్రూ నెక్లెస్లు అచ్చం అలాంటివే. ఇత్తడి మువ్వలను పొదిగిన అందమైన దండలివి.
త్రెడ్వర్క్, ఫ్యాబ్రిక్, క్లే నగల్లో ఘల్లున మోగే మువ్వల్ని జతచేసి ముచ్చటైన గొలుసుల్ని తయారు చేస్తున్నారు డిజైనర్లు. రంగు రంగుల బీడ్స్ నెక్లెస్లలోనూ వీటిని జొప్పించి ప్రత్యేకమైన లుక్ తెస్తున్నారు. అలంకారంలో విభిన్నతను కోరుకునేవారికి ఇవి మంచి ఎంపిక. మ్యాచింగ్ జువెలరీ ఇష్టపడేవారికి ఇందులో బోలెడు ఆప్షన్స్. ధర తక్కువ, లుక్ ఎక్కువ.. ఇంకేం, మెడలో మువ్వ ఘల్లుమనడం ఎంతసేపూ!