Food Garnish Ideas | పండుగలు అనగానే పాయసాలు, పొంగళ్ల్లు వండుతాం. అతిథులను ఆదరిస్తూ రవ్వకేసరి, హల్వాలకు ప్రాధాన్యమిస్తాం. కళాదృష్టి ఉండాలే కానీ, వీటిని కూడా పెయింటింగ్స్‌లా అందంగా అలంకరించవచ్చు. కావాలంటే ఈ ఖీర్, హల్వా గార్నిషింగ్ ఐడియాస్ చూడండి..
పాయసంలో జీడిపప్పు, బాదం పప్పు దట్టిస్తాం. రవ్వకేసరికి పిస్తా జొప్పిస్తాం. వండేప్పుడే గుమ్మరించడం కాదు, వంటకం పూర్తయ్యాక అలంకారానికి కూడా వాడుకోవచ్చు. వీటినే ముక్కలుగా చేసి ముచ్చటైన డిజైన్లను సృష్టించవచ్చు. చూడగానే ఇదేమైనా పెయింటింగా అనిపించేంత చక్కగా తీర్చిదిద్దవచ్చు. ఇదే ఈ గార్నిషింగ్ కళలోని ప్రత్యేకత.
ఈ తరహా టెక్నిక్‌తో ఫుడ్ డెకరేషన్ కోసం ప్రత్యేక రంగులు వాడక్కర్లేదు. ఆరోగ్యానికి హాని చేసే పదార్థాలు కలపనవసరం లేదు. ఆహారంలో వాడే గింజలు, డ్రైఫ్రూట్స్, పండ్లు చాలు. కొన్నిరకాల డిజైన్ల కోసం అలంకరణలో తాజా లేదా ఎండిన గులాబీ రేకుల్నీ వాడతారు. బూస్ట్, కుంకుమ పువ్వు, గుమ్మడి, పొద్దుతిరుడుగు లాంటి గింజల్ని కూడా ఉపయోగించుకోవచ్చు. మనం ఏ పదార్థం మీద అలంకరణ చేస్తున్నాం, దానికి ఏ రంగులు, ఎలాంటి డిజైన్లు బాగుంటాయి అనే ఆలోచన ఉంటే చాలు. మరీ మనకు తోచకపోతే, సింపుల్ డిజైన్ల నుంచి.. చేయితిరిగిన చిత్రకారుడు కుంచెతో మలిచాడా అనిపించేలాంటి భారీ డిజైన్ల దాకా బోలెడు రకాలు నెట్లో దొరుకుతాయి. వాటి స్ఫూర్తితో మనం కూడా విందును కనువిందుగా అలంకరించుకోవచ్చు. ఉన్న సమయాన్ని బట్టి ఎలాంటి డిజైన్‌ను ఎంచుకోవాలన్నదీ నిర్ణయించుకోవచ్చు. మొత్తానికి పదార్థాన్ని తిని వారెవ్వా అనడం కాదు, చూడగానే అదిరింది అనే కితాబు అందుకోవాంటే ఇంతకుమించిన మంచి మార్గం లేదు. ఏమంటారు?!