కొడవలికి, కలానికి మధ్య ఏదో ఒకటి మాత్రమే ఎంచుకునే అవకాశం వస్తే… తాత్కాలిక ఉపాధి గురించి ఆలోచించే వాళ్లయితే కొడవలినే పట్టుకుంటారు. కలాన్ని పట్టించుకునే అవకాశం తక్కువ. కానీ మధ్యప్రదేశ్ రాష్ర్టానికి చెందిన సంతోష్ కుమార్ పటేల్ మాత్రం కలాన్నే ఎంచుకున్నాడు. అందుకే అతను ఇప్పుడు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) స్థానానికి ఎదగగలిగాడు. దేవ్గావ్ గ్రామానికి చెందిన సంతోష్ది పేద కుటుంబ నేపథ్యం. వాళ్లకు రోజుకు రెండు పూటల భోజనం కూడా కష్టంగా ఉండేదట.
“పండుగలప్పుడే మేం అన్నం తినేవాళ్లం. మిగిలిన రోజుల్లో గోధుమనూకతో సరిపెట్టుకునే వాళ్లం. కొన్నిసార్లయితే జొన్నరొట్టెలతో తృప్తి పడేవాళ్లం. అప్పుడప్పుడు బడిలో దోస్తుల నుంచి గోధుమరొట్టెలు తీసుకునేవాణ్ని” అని గతం గుర్తు చేసుకుంటాడు 31 ఏండ్ల సంతోష్. పేదరికంలో పుట్టి పెరిగిన అతను తన తల్లిదండ్రుల నుంచి కష్టించి పనిచేయడం అలవాటు చేసుకున్నాడు. తండ్రి ఇంటి నిర్మాణ పనిలో ఉండగా, తల్లి వ్యవసాయ కూలీకి వెళ్లేవారు.
ఈ క్రమంలో సంతోష్ కూడా ఇండ్ల నిర్మాణ పనుల్లో తండ్రికి ఇటుకలు అందించడం లాంటివి చేసేవాడు. తల్లి వెంట కూలిపనులకు పొలాలకు వెళ్లేవాడు. దీంతో తల్లిదండ్రుల గురించి సంతోష్, ఇతని భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందేవాళ్లు. ఎండాకాలంలో అయితే తన తండ్రి బావుల తవ్వకానికి వెళ్లినప్పుడు ప్రమాదాల్లో గాయాలు కూడా అయ్యాయని అంటాడు సంతోష్.
జీవితం ఇబ్బందికరంగా నడుస్తున్నప్పటికీ సంతోష్ తల్లిదండ్రులు ఏమాత్రం నిరుత్సాహపడకుండా తమ కొడుకును బాగా చదువుకోమని ప్రోత్సహించారు. అలా పట్టుదలతో కిరోసిన్ దీపం వెలుగులోనే చదివిన సంతోష్ పదో తరగతిలో ఉత్తమశ్రేణిలో ఉత్తీర్ణత సాధించాడు. అలా కష్టాన్ని నమ్ముకుని ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. దాదాపు 15 నెలల కఠోరశ్రమతో 2017లో మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో 22వ ర్యాంకు సాధించాడు.
2018లో డీఎస్పీగా విధుల్లో చేరిపోయాడు. “ప్రజలకు సేవ చేయాలనేది నా కోరిక. పోలీసు హోదాను ఉన్నతంగా నిలపాలనేది నా ఆశ. పోలీసులంటే నేరస్తులే భయపడాలి. అమాయకులను ఖైదు చేయకుండా జాగ్రత్తపడాలి” అని సంతోష్ తన అంతరంగాన్ని వెల్లడిస్తాడు.