Health Tips | చలికాలంలో కండరాలు, కీళ్ల నొప్పులు అధికం అవుతుంటాయి. వీటి నుంచి తప్పించు కునేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
– ఓ పాఠకురాలు
చలికాలం చాలా మందిలో కండరాలు పట్టేసినట్టు అవుతుంది. వీటినే ‘క్రాంప్స్’ అని పిలుస్తాం. అలాగే, కీళ్ల దగ్గరా ఇబ్బంది ఎక్కువ అవుతుంది. దీనికి రక రకాల కారణాలు. ముఖ్యంగా ఈ సమయంలో నీళ్లు తక్కువ తాగుతాం. దానివల్ల శరీరంలోని ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేసే క్రమంలో శరీరం మెగ్నీషియంను కోల్పోతుంది. దీంతో కండరాల నొప్పులు వస్తాయి. అందుకే, దాహం వేసినా వేయకపోయినా మంచినీళ్లు బాగా తాగాలి.
ఈ ఎలక్ట్రోలైట్లు కీళ్ల దగ్గర కూడా అధికంగా ఉంటాయి. వాటిలో తేడా రావడం వల్లే కీళ్ల నొప్పులూ వస్తాయి. అందుకే ఈ సమయంలో మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. బయటి చలిని తట్టుకునేందుకు ఈ సమయంలో శరీరం ఒక కొవ్వు పొరను సిద్ధం చేస్తుంది. దీనివల్ల బరువు పెరుగుతాం. బద్ధకం ఎక్కువ అవుతుంది. దాన్ని వదిలించుకోవాలి. ఎండలో నడక, వ్యాయామం వల్ల శరీరంలో వేడి పుట్టి కండరాలు కొంత రిలాక్స్ అవుతాయి.
ఎండ నుంచి విట మిన్-డి కూడా లభిస్తుంది. ఆహారంలో పుట్టగొడుగులతో పాటు పొద్దుతిరుగుడు, గుమ్మడి, అవిసె, ఆనపకాయ గింజలు, నువ్వులు, క్వినోవా, అరటి పండు, పాలకూర, బీన్స్, సోయా తదితరాల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. డార్క్ చాకొలేట్, వాల్నట్, బాదంలాంటి వాటిలోనూ ఈ పోషకాలు దొరుకుతాయి. పెరుగు చాలా మంచిది. పెరుగు మరీ చల్లగా ఉంటుంది అనుకుంటే.. చల్లచారు తీసుకోవచ్చు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.
మయూరి ఆవుల న్యూట్రిషనిస్ట్
Mayuri.trudiet@gmail.com