Health Tips | హలో జిందగీ! జీర్ణ సంబంధ సమస్యలు, మలబద్ధకంలాంటి ఇబ్బందులున్న వాళ్లు పీచు పదార్థాలు తీసుకోవాలంటారు. వాటిని ఆహారంలో ఎలా భాగం చేసుకోవాలి?
-ఓ పాఠకురాలు
విరేచనం సాఫీగా అవ్వాలంటే ఫైబర్‌తో సమానంగా నీళ్లు తీసుకోవడం కూడా ముఖ్యమే. మనం తినే ఆహారంలో రోజులో 25 నుంచి 30 గ్రాముల పీచు పదార్థాలు ఉండాలి. జీర్ణ సంబంధ సమస్యలు, మలబద్ధకంలాంటి సమస్యలున్న వాళ్లు తప్పనిసరిగా మూడు పూటలా ఆహారంలో ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. అల్పాహారంలో ఏదైనా పండు తిని, టిఫిన్ చేసి నీళ్లు తాగాలి. పండ్ల పొట్టులో ఫైబర్ ఉంటుంది.
అన్ని కూరగాయల్లోనూ ఇది దొరుకుతుంది. బీరకాయ, కాకరకాయ, సొరకాయ, క్యాబేజ్ లాంటి వాటిల్లో ఇంకాస్త ఎక్కువ. ఆకుకూరల నుంచి కూడా లభిస్తుంది. వీటిని వారంలో రెండు మూడు సార్లు తీసుకోవాలి. ఇక, రోజులో రెండు పండ్లయినా తినాలి. డ్రైఫ్రూట్స్‌లో బాదం, కిస్మిస్, అంజీర్లాంటివి మేలు. బ్రౌన్ రైస్, గోధుమ, ఓట్స్, బార్లీ, చిరుధాన్యాల్లో కూడా పీచు పదార్థాలు ఉంటాయి.
మధ్యాహ్న భోజనంలో సలాడ్, సాయంత్రం పండు, రాత్రికి ఏదైనా సలాడ్… ఇలా తీసుకుంటే సమస్యలో చాలా మార్పు వస్తుంది. ఇక, వ్యాయామమూ ముఖ్యమే. ఇటీవల యోగాలో మలాసన అనేది నేర్పుతున్నారు. ఇండియన్ టాయిలెట్ మోడల్లో గొంతు కూర్చుని చేసే ఈ ఆసనం కూడా కొంతవరకూ మేలు చేస్తుంది. పోషకాహార నిపుణుల్ని కలిస్తే సమస్య తీవ్రతను బట్టి మరింత ప్రత్యేకమైన డైట్‌ను సూచించగలుగుతారు.
మయూరి ఆవుల , న్యూట్రిషనిస్ట్
Mayuri.trudiet@gmail.com