నా వయసు ఇరవై ఏడు. ఇప్పుడు ఆరో నెల. మేం ఒక బిడ్డ చాలు అనుకుంటున్నాం. డెలివరీ కాగానే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవచ్చా? లేదంటే
తర్వాత చేయించుకోవాలా? సాధారణ ప్రసవం కష్టమై, సిజేరియన్ అయితే ఏం చేయాలి?
– ఓ సోదరి
మీకు ఇది తొలి కాన్పు. బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలనే ఎవరైనా కోరుకుంటారు. కానీ, శిశువుగా ఉన్నప్పుడే పూర్తి ఆరోగ్య స్థితిని అంచనా వేయలేం. కాబట్టి, డెలివరీ కాగానే ట్యూబెక్టమీ (కుటుంబ నియంత్రణ ఆపరేషన్) చేయించుకోవాలన్న ఆలోచనను మనసులోంచి తీసేయండి. నిదానంగా మీరు, మీ వారు ఈ విషయం గురించి చర్చించుకోండి. ఒక్కరే చాలన్న మీ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతం. కానీ ఆ ఒక్క బిడ్డా ఎలా ఉంటుందన్నది చెప్పలేం. కాబట్టి డెలివరీ అయ్యాక, అదీ కనీసం ఏడు సంవత్సరాల తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడం మంచిది. ప్రస్తుతం రకరకాల తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. డాక్టరును సంప్రదించి ఏదో ఒక విధానాన్ని పాటించండి. పిల్లలు వద్దనుకునే వారికి కాపర్-టి కూడా మంచి ప్రత్యామ్నాయం. ప్రసవమైన ఆరు వారాలకు అమరుస్తారు. వీలును బట్టి సిజేరియన్ సమయంలోనూ వేస్తారు. మొత్తానికి, ఒక్క బిడ్డతో ట్యూబెక్టమీ చేయించుకోక పోవడమే మంచిది.
(వైద్య నిపుణుల సలహా కోసం మహిళా పాఠకులు తమ సమస్యల్ని zindagi@ntnews.com కు మెయిల్ చేయవచ్చు)
డాక్టర్ పి. బాలాంబ , సీనియర్ గైనకాలజిస్ట్