పాటల పోటీలో ఓటమి ఎదురైందని సంగీతాన్ని వదిలేసే అంత నిరాశ.. పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని జీవితాన్ని ముగించేంత తొందరపాటు.. ఓటమి భయంతో అసలు ప్రయత్నమే చేయని పిరికితనం..
ఇలా ఓటమి వస్తూ వస్తూ తనతోపాటు చాలా వాటిని తీసుకొస్తుంది. వాటికి తలొగ్గితే జీవితం ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. ఎదిరించి పోరాడితే విజయం వరిస్తుంది. ఇది తెలుసుకుంటే చాలు.. ఫెయిల్యూర్ ఓ పాజిటివ్ ఎనర్జీలా పనిచేస్తుంది.
Failure | అప్పుడెప్పుడో వచ్చిన పిల్ల జమిందార్ సినిమాలో హీరో నానితో రావు రమేష్ ఓ మాట అంటాడు. ‘గెలుపు ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తే, ఓటమి ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తుంది’ అని. నువ్వేంటో, నీ వారెవరో ఓడిపోతేనే తెలుస్తుంది. ఓటమిని ఓ పాజిటివ్ ఎనర్జీగా చూడగలిగితే మన విజయాన్ని ఎవరూ ఆపలేరు, చివరికి ఆ ఓటమి కూడా. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అన్నట్టుగా ఓడిపోతే పోయేదేం లేదు అహాలు, అహంభావాలు తప్ప. మనిషికైనా, మొక్కకైనా పోరాటమే ఊపిరి. ఓడినప్పుడే గెలుపు విలువ తెలుస్తుంది.
కాళ్లుతడవకుండా నదిని, కండ్లు తడవకుండా కాపురాన్ని, ఓటమి తెలియకుండా జీవితాన్ని దాటలేం. అసలు ఎప్పుడూ ఓడిపోలేదంటే, కొత్తగా ఏదీ ప్రయత్నించలేదన్నమాట. పడిన ప్రతిసారి పైకి లేవడం కెరటం నైజం, ఓడిన ప్రతిసారి మళ్లీ ప్రయత్నించడం విజేత లక్షణం. సైకాలజీ ప్రకారం ఓటమి రెండు రకాలు. పాజిటివ్ ఫెయిల్యూర్, నెగెటివ్ ఫెయిల్యూర్. పాజిటివ్ ఫెయిల్యూర్ టీకా లాంటిది. అప్పటికప్పుడు నొప్పిగానే ఉంటుంది. ఒకటి రెండు రోజులు ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఆ తర్వాత కంచుకోటలా మనల్ని కాపాడుతుంది. నెగెటివ్ ఫెయిల్యూర్ ఊబి లాంటిది. కూరుకుపోవడమే గానీ బయటపడే మార్గం ఉండదు. ఓటమికి బాధపడుతూ కూర్చుంటే, మళ్లీ మళ్లీ ఓడిపోతూనే ఉంటాం. ఇంకా ఇంకా కూరుకుపోతూనే ఉంటాం.
తూకం రాయి..
ఓడిపోయావంటే.. నువ్వేం సాధించలేదని కాదు, సాధించే దారిలో ఉన్నావని అర్థం. ఓడిపోయావంటే.. ఇక చాలు అని కానే కాదు, ఇంకాస్త కష్టపడితే మేలు అని అర్థం. ఓడిపోయావంటే.. దారి మూసుకుపోయిందని కాదు, వంద దారులు వేచి చూస్తున్నాయని అర్థం. ఓటమి నికార్సయిన తూకం రాయి. నీ వాపెంతో, బలమెంతో లెక్కేసి చెప్తుంది. నీలోని భ్రమల్ని, భయాల్ని, అజ్ఞానాన్ని, అహంభావాన్ని నిస్పాక్షికంగా ఎత్తి చూపుతుంది. ఏ సైకాలజిస్ట్ వేయలేనంత గొప్పగా నిన్ను బేరీజు వేస్తుంది.
మేలు కోరే మందలింపు..
ఓటమి ఎప్పుడూ నిన్ను ప్రేమ పూర్వకంగా హెచ్చరిస్తుంది. కాలేజీకి బైక్ మీద వెళ్తున్నప్పుడు జాగ్రత్త అని అమ్మ చెప్పినట్టు.. హాస్టల్లో దిగబెడుతున్నప్పుడు బాగా చదువుకో, తిండి తినకుండా ఉండకు అంటూ నాన్న చెప్పినట్టు .. వేళకు తినండి, బయట ఫుడ్డు తినొద్దు అంటూ ఊరికి వెళుతున్న భార్య చెప్పినట్టు.. ఫెయిల్యూర్ కూడా ప్రేమతో చిన్నా, పెద్ద హెచ్చరికలు చేస్తూనే ఉంటుంది. ఓటమి అనేది ప్రమాదం కాదు, ప్రమాద సూచిక. ఇప్పటికైనా మారకపోతే, నీ పద్ధతి మార్చుకోకపోతే ‘ఇబ్బందుల్లో పడతావ్’ జాగ్రత్త అంటూ చెప్పే ప్రేమ పూర్వక మందలింపు. ఇంత మొహమాటం లేని స్నేహితుడు, కచ్చితంగా తీర్పు ఇచ్చే విమర్శకుడు, తప్పు చేస్తే దండించే ఉపాధ్యాయుడు ఇంకెక్కడా దొరకడు. అందుకే ఓటమిని గౌరవించాలి, హుందాగా స్వీకరించాలి. ఇంకా చెప్పాలంటే పండగలా సెలెబ్రేట్ చేసుకోవాలి, ఫ్రెండ్స్‌కు ఫెయిల్యూర్ పార్టీ ఇవ్వాలి. పదిమందికీ తెలిసేట్టు ఫేస్బుక్లో పంచుకోవాలి.
చీకటి ఉంటేనే..
వందేండ్ల జీవిత ప్రస్థానంలో ఇది సక్సెస్ అని, ఇది ఫెయిల్యూర్ అని గిరి గీసి చెప్పడం కష్టమే. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రాం అసలు ఓటమి అనేదే లేదు, ప్రతిదీ అనుభవమే అని చెప్తుంది. విజయం పరాజయం వెలుగు చీకటి లాంటివి. చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది. ఓటమి ఉంటేనే విజయం అంటే ఏమిటో అర్థమవుతుంది. గెలుపోటములకు ఎవరి నిర్వచనం వారిదే. నువ్వు ఓడిపోయావ్ అని బంధువులు అంటే విశ్వసించకు, స్నేహితులు గేలి చేస్తే బాధపడకు, కొలీగ్స్ చిన్నబుచ్చినా పట్టించుకోకు. ఎవరి తక్కెడలోనో నువ్వెందుకు కూర్చుంటావ్.. ఎవరో కనిపెట్టిన కొలతలతో నిన్నెలా కొలుచుకుంటావ్! నీ మనసు చెప్తేనే నమ్ము. ఎందుకు ఓడిపోయావో నిజాయతీగా బేరీజు వేసుకో. తప్పుల్ని సరిదిద్దుకుంటూ విజయ తీరాలకు చేరుకో! ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో.. ఓటమి పడవ ఉంటేనే విజయం ఒడ్డుకు చేరుతావని మర్చిపోకు.
ఓడిపో.. వీలైనంత త్వరగా వీలైనంత చవగ్గా వీలైనంత సురక్షితంగా చివరిసారి అన్నంత గొప్పగా!
రీస్టార్ట్ .. రీస్టార్ట్
‘12th ఫెయిల్’ సినిమా చూసే ఉంటారు కదా. అందులో హీరో ఫ్రెండ్ సివిల్స్ పరీక్షలో ఫెయిల్ అయినా పర్లేదు, రీస్టార్ట్ చేయమని చెప్తూ ఉంటాడు.. గుర్తుందా. ఓటమి కూడా అంతే, మళ్లీ కొత్తగా ప్రారంభించే అవకాశం ఇస్తుంది. తప్పుల్ని రివైండ్ చేయొద్దని, జీవితాన్ని రీస్టార్ట్ చేయమని చెప్తుంది. కొత్త పుస్తకం తెరిచినప్పుడు ఎంత కమ్మటి వాసన వస్తుంది.. కొత్త చొక్కా తొడుక్కునప్పుడు ఎంత హాయిగా ఉంటుంది.. కొత్త కారులో వెళుతుంటే ఎంత కులాసాగా ఉంటుంది.. ఓటమి తర్వాత మనం ప్రారంభించే కొత్త జీవితంలో కూడా అంతే తాజాదనం ఉంటుంది. ఓడిపోయిన తర్వాత మళ్లీ ప్రారంభం అంటే.. ఓటమికి కారణమైన బద్ధకాన్ని, అలసత్వాన్ని, భయాన్ని, అభద్రతాభావాన్ని కట్టెలు పేర్చి కాల్చేయడమే. ఆ బూడిదలో నుంచి కొత్త మనిషిగా అవతరించడమే.
బి. కృష్ణ, సీనియర్ సైకాలజిస్ట్
ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్,
హైదరాబాద్, 99854 28261