గుడ్డు ఆరోగ్యానికి వెరీగుడ్ అన్నది అందరికీ తెలిసిందే. బ్యాలెన్స్ డైట్‌కి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ఇందులో ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఆరోగ్యంగా ఉండాలని భావించేవాళ్లు, బరువుని పెంచుకోవాలని, నిలుపుకోవాలని కోరుకునేవాళ్లకు ఎప్పుడూ గుడ్డు అవసరమే. అయితే గుడ్డుని ఏ రూపంలో తింటే రుచితోపాటు ఎక్కువ పోషకాలు అందుతాయనే సందేహం అందరికీ ఉండేదే. ఈ సందేహాన్ని తీర్చేందుకు అమెరికన్ కెమికల్ సొసైటీ ఓ అధ్యయనం నిర్వహించింది.
వండిన తర్వాత గుడ్డు భౌతిక, రసాయన స్థితిలో మార్పులతోపాటు రుచి, పోషకాల పరిమాణాన్ని, జీర్ణక్రియలో ఎంజైముల ప్రభావం వల్ల శరీరానికి ఆ పోషకాలు అందే గుణాన్ని ఈ సంస్థ అధ్యయనం చేసింది. జీర్ణకోశ నిపుణుల సహాయంతో నిర్వహించిన ఈ అధ్యయనం పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. బాగా ఉడికించిన గుడ్డు, కొద్దిపాటిగా వేడి వల్ల ఉడికీ ఉడకనట్టుగా ఉండే గుడ్డు, ఆమ్లెట్లో ఉండే పోషకాలు, జీర్ణ వ్యవస్థ గ్రహించే సామర్థ్యాన్ని పరిశోధకులు విశ్లేషించారు.