నేను గతంలో ఒక వ్యక్తిని ప్రేమించి మోసపోయాను. నా కాబోయే భర్త గత చరిత్ర కూడా ఇలాంటిదే. ఆ చేదు అనుభవాల కారణంగా మా ఇద్దరిలోనూ అభద్రత పెరిగి పోయింది. ఎవర్నీ ఓ పట్టాన నమ్మాలనిపించదు. ఆ అపనమ్మకం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వ్యక్తిని కూడా అనుమానించేలా చేస్తున్నది. అతను తరచూ నా సెల్‌ఫోన్ చెక్ చేస్తుంటాడు. నేను కూడా దొంగచాటుగా అతని వాట్సాప్ సంభాషణలు చదువుతుంటాను. ఆఫీసులో ఎవరితో క్లోజ్‌గా ఉంటాడు, ఎవరితో పార్టీలకు వెళ్తాడు అనేది కూడా ఆరా తీస్తాను. తను నా కదలికలు తెలుసుకోవడానికి షాడోటీమ్ ఏర్పాటు చేసినట్టు అనుమానం. ఇన్ని అపోహల మధ్య మా బంధం నిలబడుతుందా?
– ఓ సోదరి
దీన్నే మానసిక శాస్త్రంలో ‘ఎమోషనల్ చీటింగ్’ అంటారు. ఒక బలమైన బంధాన్ని నిర్మించుకున్నాక కూడా పక్క చూపులు చూడటం.. అవతలి వ్యక్తిని మోసం చేయడమే కాదు, మనల్ని మనం మోసం చేసుకోవడమే. ప్రేమకు నిజాయతీ పునాది. దానికి కనుక బీటలు పడితే.. ఏదో ఒక రోజు కుప్పకూలిపోవడం తథ్యం. ‘మనం ఫలానా వ్యక్తితో ఎందుకు ప్రేమలో పడ్డాం అనేది మరిచిపోవడం చాలా సులభం’ అంటారు ‘వై మెన్ చీట్’ పుస్తక రచయిత గ్యారీ న్యూమన్. ఒక్కసారి గతాన్ని తలుచుకోండి. తనకు ప్రపోజ్ చేసిన రోజున మీ గుండెల్లో ఎంత ప్రేమ ఉండేదో గుర్తు చేసుకోండి.
అదంతా ఏమైపోయిందో సమీక్షించుకోండి. అనుబంధ యాత్రలో రకరకాల మజిలీలు ఉంటాయి. అపోహలు ఎదురవుతాయి. అనుమానాలు తారసపడతాయి. ఆకర్షణలు గాలం వేస్తాయి. వాటన్నిటినీ దాటుకుని వెళ్లాల్సిందే. నూరేండ్లు కలిసి బతకాల్సిందే. ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకోండి. క్షమాపణలు ఇచ్చి పుచ్చుకోండి. అయినా, పక్కచూపులు ప్రలోభపెడుతుంటే మాత్రం.. బంధంలోంచి బయటికి వచ్చేయండి. ఎంతకాలమని మోసం చేస్తారు, ఎంతకాలమని మోసానికి గురవుతారు? ఆ కూలిపోయే పేకమేడ వద్దే వద్దు.