Phone Number | ‘సార్.. నా పేరు సాహితి. ఓ అన్నోన్ నంబర్ నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. లిఫ్ట్ చేయగానే భయంకరమైన సౌండ్స్ వినిపించాయి. భయంతో ఫోన్ పెట్టేస్తే.. మళ్లీ కంటిన్యూస్‌గా కాల్స్ వస్తూనే ఉన్నాయి. భయపడి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి.. మధ్యాహ్నం కాసేపు నిద్రపోయా. మా తమ్ముణ్ని ఎవరో హత్య చేసినట్టు పీడ కల వచ్చింది. భయంతో లేచా. తమ్ముడి కోసం వెదికా. ఎక్కడా కనిపించలేదు. ఏం చెయ్యాలో తెలీక కంప్లయింట్ ఇవ్వడానికి వచ్చా’ ముఖానికి పట్టిన చెమటను తుడుచుకొంటూ కంగారుగా చెప్తూ పోయింది సాహితి.
‘మేడమ్.. డోంట్ వర్రీ. ముందు మీరు కాస్త ఈ మంచినీళ్లు తాగండి’ సావధానపరిచాడు ఇన్స్పెక్టర్ రుద్ర. ఐదు నిమిషాలు గడిచాయి. హెడ్ కానిస్టేబుల్ రామస్వామిని డీటెయిల్స్ రాసుకొమ్మని సైగ చేసిన రుద్ర.. ‘సాహితి గారు. ఇప్పుడు చెప్పండి. మీ తమ్ముడి వయస్సు ఎంత? ఏం చేస్తాడు? అసలేం జరిగింది?’ అని అడిగాడు.
‘సార్.. మేం శ్రీమంతులం. నాన్నకు విదేశాల్లో చాలా బిజినెస్‌లు ఉన్నాయి. అయితే, కారు యాక్సిడెంట్లో అమ్మా, నాన్న ఇద్దరూ చనిపోయారు. దీంతో పదేండ్ల తమ్ముడి ఆలనాపాలన నేనే చూసుకోవాల్సి వచ్చింది. బంధువులంతా హైదరాబాద్‌లోనే ఉండటంతో ఇక్కడికి మకాం మార్చాం. ఈ రోజు మార్నింగ్ ఎప్పటిలాగే సింగపూర్, క్యూబా ఇలా మరికొన్ని దేశాల్లో ఉన్న మా వ్యాపారాలకు సంబంధించిన అప్డేట్స్ను సెక్రటరీ నుంచి తెప్పించుకొన్నా. ఇంతలో అన్నోన్ నంబర్ నుంచి కాల్స్ రావడం, భయానక శబ్దాలు వినిపించడం మొదలైంది. తమ్ముడు కనిపించకుండా పోయాడు..’ అని భయపడుతూ చెప్పింది సాహితి.
‘పర్లేదు మేడమ్..’ అని చెప్పిన రుద్ర ఏదో ఫోన్ రావడంతో మాట్లాడుతున్నాడు. ఇంతలో.. ‘మేడమ్.. మీకు ఏయే దేశాల్లో బిజినెస్‌లు ఉన్నాయ్?’ ఆత్రుతగా అడిగాడు రామస్వామి. ‘సింగపూర్‌లో వ్యవసాయ భూములు ఉన్నాయి. క్యూబాలో షేర్ మార్కెట్ ట్రేడింగ్ కంపెనీలు ఉన్నాయి. ఇంకా..’ అని సాహితీ చెప్తూ ఉండగా.. అదివిన్న రుద్ర.. ‘బాబాయ్..’ అంటూ గట్టిగా కసురుకొన్నాడు. ఇంతలో ఇంటికి వెళ్తానన్న సాహితితో.. ‘మేడమ్.. కలలో ఓ వ్యక్తి మీ తమ్ముణ్ని చంపుతూ కనిపించాడన్నారు కదా? అతని ముఖం గుర్తుందా?’ అడిగాడు రుద్ర.
‘ఉంది’ అన్నట్టు తలూపిందామె. ‘అతను మీకు తెలిసిన వ్యక్తేనా?’ అని అడిగాడు. అతణ్ని తానెప్పుడూ చూడలేదని బదులిచ్చింది. ఇంతలో అక్కడికి వచ్చిన రామస్వామి.. ‘సార్.. మీరు అడిగిన స్కెచ్ ఆర్టిస్ట్ అవుట్ ఆఫ్ స్టేషన్. రేపు మార్నింగ్ వస్తాడట’ అని అనడంతో.. సాహితిని మార్నింగ్ స్టేషన్‌కు రమ్మన్న రుద్ర.. ఆమె తమ్ముడిని వెదకడానికి ఇద్దరు కానిస్టేబుల్స్‌ను సాహితితో పంపించాడు. తర్వాత సాహితి ఇచ్చిన కంప్లయింట్ చూస్తూ అందులో ఆమె రాసిన ఫోన్ నంబర్‌ను చూడగానే రుద్ర ఒకింత ఆశ్చర్యపోయాడు.
‘బాబాయ్.. ఈ నంబర్ తెలుసా?’ అంటూ రామస్వామికి పేపర్‌పైన సాహితి రాసిన 94158 17683 మొబైల్ నంబర్‌ను చూపించాడు. ఒకింత షాక్‌కి గురైన రామస్వామి.. ‘సార్.. 15-20 ఏండ్ల కిందట బీహార్‌లో ఓ దెయ్యం ఈ నంబర్‌ను వాడిందంటూ వార్తలొచ్చాయి. అదేకదా ఈ నంబర్?’ అంటూ అరిచినంత పని చేశాడు రామస్వామి. ఇంతలో రుద్ర ఫోన్ మోగింది. సాహితి తమ్ముడు ఎక్కడా కనిపించలేదని కానిస్టేబుల్స్ సమాచారం అందించారు. సాహితికి ఫోన్లో ధైర్యాన్ని చెప్పిన రుద్ర.. స్కెచ్ ఆర్ట్ పనికోసం ఆమెను పొద్దున్నే స్టేషన్‌కు రమ్మన్నాడు.
మర్నాడు ఉదయం పది గంటలు. ముగ్గురిని చంపిన ఓ సీరియల్ కిల్లర్‌ని పట్టుకొచ్చిన పోలీసులు సెల్లో వేస్తున్నారు. ఇంతలో తన తమ్ముడికి ఏమైందోనంటూ కంగారుపడుతున్న సాహితి.. ఆ కిల్లర్‌ను చూడగానే.. ‘సార్.. సార్.. నా కలలోకి వచ్చిన కిల్లర్ వీడే’ అంటూ చెప్తూనే స్పృహ కోల్పోయింది. అక్కడ ఉన్నవాళ్లందరూ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. అరగంట గడిచింది. స్పృహలోకి వచ్చిన సాహితితో రుద్ర.. ‘మేడమ్.. ఇప్పుడు ఎలా ఉంది?’ అంటూ ప్రశ్నించాడు. ఫర్వాలేదు అన్నట్టు తలాడించిన ఆమె.. తమ్ముడి గురించి ఏదో అడగబోయింది. ఇంతలో కలుగజేసుకొన్న రుద్ర..
‘మేడమ్.. వీ ఆర్ వెరీ సారీ.. మీ తమ్ముడు చనిపోయాడు. ఇంతకుముందు మేం అరెస్ట్ చేసిన కిల్లరే మీ తమ్ముణ్ని పొట్టన పెట్టుకున్నాడు. బాగా కొడితే.. ఈ విషయాన్ని ఒప్పుకొన్నాడు’ అంటూ రుద్ర చెప్పగానే.. గుండెలు పగిలేలా రోదించింది సాహితి. తన తమ్ముడికి ఆ హంతకుడికి మధ్య వైరమేంటని ప్రశ్నించింది. ‘అదే ఇప్పుడు మా ముందున్న మిలియన్ డాలర్ ప్రశ్న మేడమ్.. అది తెలియాలంటే మీరే మాకు సాయం చేయగలరు’ అని రుద్ర అన్నాడు. ‘ఎలా?’ అంటూ కండ్లు తుడుచుకొంటున్న సాహితితో రుద్ర.. ‘మేడమ్.. ఇంతకీ మీ అమ్మానాన్నలకు యాక్సిడెంట్ ఎలా జరిగింది?’ అని అడిగాడు. ‘భూటాన్‌లో ట్రాఫిక్ రెడ్ సిగ్నల్‌ను క్రాస్ చేస్తూ ఓ లారీకి మా కారు గట్టిగా ఢీ కొట్టింది. దీంతో అమ్మా-నాన్న అక్కడికక్కడే చనిపోయారు’ అని బదులిచ్చింది సాహితి. దీంతో కాస్త కంగారుపడుతూ.. ‘మేడమ్.. మీకొచ్చిన కల నిజమైంది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి’ అన్నాడు రుద్ర. ‘ఎందుకు?’ అన్నట్టు ప్రశ్నార్థకంగా చూసింది సాహితి.
‘మీరు నిన్న ఇచ్చిన నంబర్ 15-20 ఏండ్ల కిందట కూడా ఓ కేసు ఫిర్యాదులో ఉంది. దెయ్యాలు, మంత్రాలు, హత్యలు ఇలా.. అన్నీ దాంతో ముడిపడి ఉన్నాయి’ అన్నాడు రుద్ర. ‘సార్.. మీరు చదువుకొన్నవారు. మీరు కూడా ఇలా మాట్లాడటమేంటి?’ అసహనంగా అన్నది సాహితి. ‘మీకు అలా అనిపించడంలో తప్పేం లేదు మేడమ్. అయితే, మీ అమ్మా, నాన్నల మరణానికి కూడా ఇదే నంబర్ కారణం. చనిపోయేముందు వాళ్లిద్దరూ ఈ ఫోన్‌కాల్‌ను లిఫ్ట్ చేశారు. అది జరిగిన మరునాడే వాళ్లు యాక్సిడెంట్లో చనిపోయారు. ఈ విషయం మా ఇన్వెస్టిగేషన్లో తేలింది. అందుకే వాళ్ల యాక్సిడెంట్ గురించి మిమ్మల్ని అడిగా. ఇక, నిన్న మార్నింగ్ గేమ్స్ ఆడుతూ.. మీ తమ్ముడు కూడా ఆ కాల్ లిఫ్ట్ చేశాడు. ఇప్పుడు ఇలా చనిపోయాడు. నిన్న మీరు కూడా ఆ ఫోన్ లిఫ్ట్ చేశానన్నారు. అందుకే, చెప్తున్నా.. కాస్త జాగ్రత్త’ అంటూ రుద్ర చెప్పడంతో సాహితికి ముచ్చెమటలు పట్టాయి.
‘సార్.. నాకు చాలా భయంగా ఉంది. ఒంటరి ఆడదాన్ని. ఇప్పుడు ఒక్కదాన్నే ఇంట్లో ఎలా ఉండాలి?’ అంటూ భయపడిపోతున్న సాహితితో.. ‘ఒంటరిగానే మీ దత్తత తల్లిదండ్రులను, వాళ్ల బిడ్డను మొత్తంగా ఓ ఫ్యామిలీనే పొట్టనబెట్టుకొన్న మీకు.. దెయ్యం అంటే ఓ లెక్క?? మీరే ఓ దెయ్యం’ అంటూ కోపంగా అరిచాడు రుద్ర. అది విన్న సాహితి.. ‘ఏం మాట్లాడుతున్నారు?’ అంటూ రుద్రను గద్దించబోయింది. ఇంతలో ఓ లేడీ కానిస్టేబుల్ అరచేయి సాహితి చెంపమీద పడటంతో స్టేషన్లో పిడుగు పడ్డట్టయ్యింది. దీంతో ఏం జరిగింది? అంటూ సెల్ లో వేసిన సీరియల్ కిల్లర్ అలియాస్ స్నేహిల్ అలియాస్ రుద్ర కజిన్ బయటికొచ్చాడు. సాహితీ చెంప ఎర్రగా కందడాన్ని చూసి.. ‘డియర్.. రుద్ర.. కేసు సాల్వ్ అయినట్టేనా?’ అంటూ తమ్ముణ్ని కౌగిలించుకొన్నాడు స్నేహిల్. అవునన్నయ్యా.. అంటూ స్నేహిల్ను హగ్ చేసుకొన్న రుద్ర.. ఐదు విషయాల్లో సాహితి చేసిన పొరపాట్లే ఆమెను పట్టించాయని వివరించాడు. ఇంతకీ, సాహితినే హంతకురాలని రుద్ర ఎలా కనిపెట్టాడు?
సమాధానం:
తనను తాను గొప్ప శ్రీమంతురాలిగా పరిచయం చేసుకొన్న సాహితి.. సింగపూర్‌లో వ్యవసాయ భూములు, క్యూబాలో షేర్ మార్కెట్ ట్రేడింగ్ కంపెనీలు ఉన్నాయంటూ రామస్వామికి చెప్పింది. నిజానికి సింగపూర్‌లో వ్యవసాయం చేయడానికి మచ్చుకైనా వ్యవసాయ భూమి ఉండదు. క్యూబాలో షేర్మార్కెట్లు లేనేలేవు. ఇదే విషయం రుద్రకు సాహితిపై తొలి అనుమానాన్ని కలిగించింది. పైగా కలలో కనిపించిన హంతకుడిని తాను జీవితంలో ఇంతవరకూ చూడలేదని సాహితి చెప్పడం రుద్రలో అనుమానాన్ని మరింతగా పెంచింది. శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం.. మనకు కలలో కనిపించే వ్యక్తులు మనకు పరిచయస్తులు లేదా మనం ఇంతకు ముందు చూసిన వారై మాత్రమే ఉంటారు. అయితే, సాహితి దీనికి విరుద్ధమైన సమాధానం చెప్పడంతో ఆమె సంగతి చూద్దామని తన కజిన్ స్నేహిల్ను ఓ కిల్లర్‌గా తెరమీదకు తీసుకొచ్చాడు రుద్ర.
అప్పటికే మూడు హత్యలు చేశాడని పోలీసులు అనడంతో తన తమ్ముడి హత్యను కూడా స్నేహిల్పై తోసేయడమే కాదు.. కలలో తాను చూసింది కూడా అతణ్నేనని సాహితి అబద్ధం చెప్పింది. ఇక.. భూటాన్‌లో ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవే ఉండవు. అయితే, సాహితి రెడ్ సిగ్నల్ క్రాస్ చేసి యాక్సిడెంట్‌కు గురయ్యారంటూ తన తల్లిదండ్రుల గురించి కూడా తప్పుడు సమాచారం ఇచ్చింది. మొత్తంగా ఎంక్వైరీ చేస్తే.. తనను దత్తత తీసుకొన్న కుటుంబాన్ని మొత్తంగా చంపితేనే.. ఆస్తిమొత్తం తన వశమవుతుందన్న ఆశతో సాహితి ఈ హత్యలు చేసినట్టు తేలింది. దర్యాప్తును పక్కదారి పట్టించడానికే ఫోన్ నంబర్-దెయ్యం-శబ్దాలు అంటూ.. ఎప్పుడో 2006లో వచ్చిన పుకార్లను ఇప్పుడు సాహితి వాడుకొన్నట్టు విచారణలో తేలింది
…? రాజశేఖర్ కడవేర్గు