‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసి’ అని రామాయణ వాక్యం. డా॥సి.నారాయణ రెడ్డికి తన జన్మభూమి హనుమాజీ పేట అంతకు మించి అన్నది అక్షర సత్యమే కాదు, కవితాక్షర లిఖితం కూడా! ‘ఋతుచక్రం’ మొదలుకుని తన తల్లియాస తెలంగాణ భాషకు విశ్వరూపాన్నిచ్చిన ‘మా ఊరు మాట్లాడింది’ వరకు, తెలుగు సినిమా తెరమీద కావ్య గౌరవంతో వెలిగిన ‘గోగులుపూసే, గోగులుగాసే ఓ లచ్చాగుమ్మడి’ దాకా మనం చూడొచ్చు.
సినారె కేవలం కవిత్వంలోనే కాదు సినీ గేయాల్లోనూ అవకాశం వచ్చిన ప్రతిసారి ఊరుకు గౌరవాన్ని కల్పించారు. ఆయనే ఒకచోట అన్నారు ‘పల్లె పాట నేర్పింది’ అని… మరి ఊరు గురించి రాయకుండా ఎలా ఉండగలరు. సినారెకు ‘ఊరంటే పల్లెటూరే’. అటువంటి సందర్భాన్ని అద్భుతంగా వర్ణిస్తూ 1981లో వచ్చిన చిత్రం ‘ఊరికిచ్చిన మాట’ కోసం అందమైన పాట రాశారు. ఈ చిత్రానికి దర్శకుడు ఎం.బాలయ్య. ఇందులో కథా నాయకుడు చిరంజీవి. అతని తమ్ముడు సుధాకర్‌కు మెడికల్ సీటు వస్తుంది, డాక్టరై తమ ఊరిలో స్థిరపడి గ్రామస్తులకు సేవచేయాలనుకుంటాడు. ఆ సంతోషాన్ని ఊరు మొత్తం పండగలా చేసుకుంటుంది. ఈ సందర్భంగా సినారె రాసిన పాట ఎంత బాగా రాసినారె అనిపిస్తుంది.
కవికి పల్లె మీద మమకారం పల్లవిలోనే మనం చూడవచ్చు. ఈ సంతోష సందర్భాన్ని కవి సినారె అనుకుంటే ‘ధూంధాం’గా మలచవచ్చు, ‘సంతోషం సంరంభం, ఆనందం ఆహ్లాదం’గా వర్ణిస్తూ రాయవచ్చు, కానీ తన ఊరిలో, తన బాల్యంలో చూసిన సబ్బండ వర్ణాల ఊరుమ్మడి పండుగల సంస్కృతి ఆయనతో ‘ఆడింది ఊరు’ అనిపించింది.

ఈ గీతాన్ని చూద్దాం
పల్లవి
అతను: ఆడింది ఊరు పాడింది పైరు
ఎగిరెగిరీ దూకింది యేటి నీరు ॥2॥
ఈ గీతానికి పల్లవి. ఊరంటే కేవలం మనుషులు, మట్టి మాత్రమే కాదు కదా! ఊరంటే పాడీపంట, ఊరంటే ఏరూనీరు. కవి ఊరిలోనూ ఇవే కనిపిస్తాయి. సినారె అన్నట్టు “చిరుచిరు మాటల్లో కూడా ఒక భావాన్ని చిత్తరంజకంగా అందించినప్పుడు అది కవిత్వమే అవుతుంది”. అందుకే ఊరు ఆడితే ‘పాడింది పైరు’ అంటారు. పైరు పాడటమంటే ఇక్కడ ఆకుపచ్చని ఆశలతో ఊరు కళకళలాడటం అన్నమాట. ‘ఎగిరెగిరి యేటి నీరు దూకడం’ అంటే జలకళతో విలసిల్లడమే! జలమే కదా జీవం… జీవనం. నిజానికి ఊరు ఆడదు, పైరు పాడదు. ఇది ‘మానవీకరణ’. కవి కథానాయిక కవితతో ఊరందరి సంతోషాన్ని వర్ణిస్తూ ఇలా పలికిస్తారు…
ఆమె: పిల్లామేకా సంబరాలు
పడుచూ ముసలీ తందనాలు
తాం తకిటకిట తకఝుణుతామ్మని ॥ఆడింది॥
నిజానికి ఇది సాధారణంగానే అనిపించవచ్చు, కానీ ‘పిల్లా మేకా సంబరాలు/ పడుచూ ముసలీ తందనాలు’ అనడం గ్రామీణ సంస్కృతిలో మమేకమైన పశు సంపదను కవి గుండెలకెత్తుకోవడం చూడవచ్చు. ఎమ్మెస్ విశ్వనాథన్ సంగీత దర్శకత్వం వహించగా, ఎస్పీ బాలు, సుశీల, చలపతిరావు బృందం దీనిని గానం చేసింది.

చరణం
అతను: ఏ దిక్కూ లేని మనకు ఓ దిక్కు దొరికింది
అందరమూ ఒకటై ఉంటే అందరానిది ఏముంది?
కాలం నేటికి కలిసొచ్చింది
చీకటి గూటికి వెలుగొస్తుంది
ఊరుర మనపేరే నోరూర వినిపిస్తుంది॥ఆడింది॥
ఆమె: తిరుమలేశుడే దీవించంగా
పార్వతీశుడే కరుణించగా
అతను: శరభ శరభదశ్శరభా అంటూ ॥ఆడింది॥
ఊరు జనం తమ కష్టాలు తీరబోతున్నాయన్న ఆనందాన్ని తమకు ‘ఓ దిక్కు దొరికింది’ అంటూ పాడటం వాళ్లకు ఒక ఆధారం దొరికిందన్న సంతోషం. ఇంకా, కలసి వచ్చిన కాలంలో చీకటి గూటికి వెలుగు రావడమంటే పల్లెలో వికాసానికి నాంది పలకలడమే అని అర్థం. ఊరంతా కలిసి సుధాకర్‌ను మెడిసన్ చదివిస్తుంది. దానికే అతను ‘ఊరూరా మన పేరే/ నోరూర వినిపిస్తుంది’ అంటాడు. ఇంకా, ఊరి నమ్మకం, పల్లె జనుల ప్రేమ ఇలా పలుకుతుంది, నాయకుని నోట
చరణం
అతను: మా పల్లె వ్రేపల్లెంట మావాడే కృష్ణయ్యంట
ఆమె: మథురానగరికి పోతుంటే మా కళ్లే మెరిసేనంట
అతను: ఆ కృష్ణయ్య కొంటె బుద్ధులు
ఈ కృష్ణయ్యకు అంటవంట
ఆమె: ఏ పిల్ల వెంటబడినా
మా పల్లెను మరవడంట ॥ఆడింది॥
మథురా నగరికి వెళ్లి తన జెండా పాతిన కృష్ణుడిలాగే తమ ఊరివాడు వైద్యుడై వస్తాడన్న ఆనందం, తమ ఊరి బాలుడు అందరిలాంటివాడు కాదు, ఎక్కడున్నా, ఎలావున్నా తమ ఊరిని మరవడన్న అపారమైన నమ్మకం కనిపిస్తుంది ఈ పంక్తుల్లో. అంతేకాదు నర్మగర్భంగా కథలో ముందు ముందు జరిగే సంఘటనను కూడా ఊహించి చెప్పడం ఇందులో చూడవచ్చు. ఆ చిత్రం కోసం సినారె ఐదు గీతాలను రాశారు. ‘కోడి కూసే పొద్దే పొద్దు/ కొత్త జంట ముద్దే ముద్దు’ మరో మంచి యుగళగీతం.
…? పత్తిపాక మోహన్