Parenting | ఇది సోషల్ మీడియా శకం.. కాదేదీ కవితకు అనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఈ డిజిటల్ యుగం.. కాదేదీ షేరింగ్‌కు అనర్హం అన్నట్టుగా మారిపోయింది. సరదాలు, సంతోషాలు.. పండుగలు, పబ్బాలు .. జ్ఞాపకాలు, జాతరలు.. ఆక్రోశాలు, ఆవేదనలు.. అన్నిటినీ సోషల్ మీడియాలో షేర్ చేయడం సర్వ సాధారణమైపోయింది. పిల్లలను కూడాఈ ట్రెండ్ వదలటం లేదు. తమ చిన్నారుల ఎదుగుదలలోని ప్రతి మైలురాయిని తల్లిదండ్రులు సోషల్ మీడియాలో పంచుకుంటూ వింత ప్రేమను చాటుకుంటున్నారు. బుజ్జాయి బడిలో చేరింది మొదలుకొని ప్రతి విషయాన్నీ ఫేస్బుక్లో, ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ లైకుల కోసం ఆరాటపడుతున్నారు. ఈ తరహా పేరెంటింగ్‌ని సైకాలజీలో ‘షేరెంటింగ్’ అని పిలుస్తున్నారు.
బుజ్జాయి
బోర్లాపడితే బొబ్బట్లు వేసి అదిరేట్టు వేడుక చేసుకుంటాం. అరిసెలు చేసి చిన్నారి తొలి అడుగులకు మడుగులొత్తుతాం. పేరెంటింగ్ కల్చర్ మరింత వింతగా మారిపోయింది. చిన్నారి అంబాడితే.. ఆ ఫొటోలను ఎఫ్బీ అంబారీ ఎక్కిచ్చేస్తున్నారు. పిల్లల మార్కులు, వాళ్ల అలకలు, అలవాట్లు అన్నీ శ్రుతి మించి నెట్టింట పంచుకుంటున్నారు. ఈ విపరీత ధోరణే షేరెంటింగ్! ఈ వైఖరి వల్ల పిల్లలకు ఊహ రాకముందే వారి గురించి అయినవాళ్లూ, కానివాళ్లూ అందరికీ తెలిసేలా చేస్తున్నది.
లెక్కలు ఇలా..
2023లో నిర్వహించిన ఒక సర్వేలో 75% మంది పేరెంట్స్ పిల్లలకు సంబంధించిన అంశాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని తెలిసింది. 80 శాతం మంది పేరెంట్స్ పిల్లల పేర్లు కూడా సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. 13.9 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఎక్కడ ఉంటున్నారు, ఏ బడికి వెళ్తున్నారు తదితర వ్యక్తిగత వివరాలు షేర్ చేస్తున్నారు. ఐదు శాతం మంది పిల్లలకు సంబంధించిన అభ్యంతరకర సమాచారాన్ని కూడా సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఇలా పిల్లలకు సంబంధించిన ప్రతి అంశం పేరెంట్స్ పోస్ట్ చేయడం వెనుక ఉన్న కారణాల్లో కొన్ని..
ఆనందమానందమాయే..
పొత్తిళ్లలో పెరిగిన బుడుతడు నాలుగు అడుగులు వేయటం కూడా తల్లిదండ్రులకు ఒక పెద్ద ఆనందమే. అలిగినా, అల్లరి చేసినా మురిపెమే. చదువులో ముందంజలో ఉన్నా, ఆటల్లో గెలుపొందినా వారికి గర్వ కారణమే. ఈ చిన్ని, చిన్ని ఆనందాలను నలుగురితో పంచుకోవడానికి పిల్లల గురించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
జ్ఞాపకాల దొంతర
మొదటిసారి అమ్మా అని పిలిచిన సందర్భం, తొలి పుట్టినరోజు వేడుక, బడికి వెళ్లిన తొలిరోజు, అలిగి అందంగా బుంగమూతి పెట్టుకున్న వైనం.. ఇలా పిల్లలకు సంబంధించిన ప్రతి జ్ఞాపకాన్ని పదిలం చేసుకోవాలని, ఒక ఆల్బమ్‌లా ఉంచుకోవాలని తల్లిదండ్రుల ఆరాటం. పదికాలాలపాటు పదిలంగా దాచుకోవాలని భావించిన సంగతులను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
డేంజర్ బెల్స్..
పిల్లలతో తమ అనుబంధాన్ని, ఆనందాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఆనందపడే పేరెంట్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ ధోరణి పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని. అవి ఇవే..
ఆత్మగౌరవంపై దెబ్బ
ఆ మధ్య తండ్రి, కూతురు వీడియోపై ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ అతని బృందం చేసిన అసభ్యకరమైన కామెంట్స్ వైరల్ అవ్వడం తెలిసిందే. దానిమీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడం, అతని అరెస్టు వరకు దారి తీయడం చూశాం. ఇది నాణేనికి ఒక వైపు, మరో వైపు ఏంటంటే ఆ చిన్నారి ఊహ తెలిసిన తర్వాత ఇలాంటి కామెంట్స్ గురించి తెలిస్తే తన ఆత్మగౌరవం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ ఘటనే కాదు, పిల్లలకు సంబంధించిన పోస్టులకు వచ్చే నెగెటివ్ కామెంట్స్ వారి కంటపడితే వారి మానసిక, భావోద్వేగ సంక్షేమంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
డిజిటల్ కిడ్నాపింగ్
సోషల్ మీడియాలోని పిల్లల ఫొటోలను కొంతమంది దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. మన పిల్లల ఫొటోలను తమ బిడ్డలవిగా పోస్ట్ చేసి, ఆరోగ్యం బాగోలేదని ఆర్థికసాయం అర్థించవచ్చు కూడా! అంతేకాదు చైల్డ్ పోర్న్ వైబ్సైట్లలో మన పిల్లల ఫొటోలు పెట్టే ఫ్రాడ్స్టర్లూ ఉన్నారు. డీప్ ఫేక్‌తో మార్ఫింగ్ చేసి వికృత చర్యలకు పాల్పడే ప్రమాదం ఉంది.
ఆన్లైన్ వేధింపులు..
మనం పోస్ట్ చేసిన పిల్లల ఫొటోలను నెగెటివ్ మైండ్‌సెట్ వ్యక్తులు ట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఆ మధ్య సీబీఎస్ఈ పదో తరగతిలో ఫస్ట్‌ర్యాంకు వచ్చిన విద్యార్థిని అవాంఛిత రోమాలపై ట్రోలింగ్ తెలిసిన విషయమే. వారి శరీరాకృతి గురించి అసభ్యకర కామెంట్ చేయడం ద్వారా పిల్లల ఆత్మగౌరవం దెబ్బతినొచ్చు.
ఏం చేయాలి?
సోషల్ మీడియా పోస్టులతో పిల్లలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా ఉండాలంటే పేరెంట్స్ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
బి. కృష్ణ, సీనియర్ సైకాలజిస్ట్
ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్,
హైదరాబాద్, 99854 28261