‘Dogs are millionaires in Gujarat village | వాడికేం, తాతలు కూడబెట్టిన ఆస్తులున్నాయి. హాయిగా కాలుమీద కాలేసుకుని బతికేస్తాడు’ అంటుంటాం కొందరి విషయంలో. ఇదే మాట చక్కగా వర్తిస్తుంది ఈ ఊర కుక్కలకూ. ఎందుకంటే, వీటి ఆస్తి విలువ ఐదుకోట్ల రూపాయల పైమాటే. కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, చుట్టూ ప్రేమ చూపించే మనుషులు… పుడితే గుజరాత్లోని కుశ్కల్ ( Kushkal )లోనే పుట్టాలని కోరుకుంటుందేమో ప్రతి కుక్కా..!
మూగజీవాల పట్ల చాలామందే ప్రేమ చూపిస్తారు. కానీ గుజరాత్, బనాస్కాంఠా జిల్లాలోని కుశ్కల్ గ్రామం మరీ ప్రత్యేకం. ఈ ఊళ్లో కుక్కలకు పదమూడు ఎకరాలకు పైగా పొలం ఉంది. దీనిమీద వచ్చే ఆదాయాన్ని ఊళ్లోని సుమారు రెండు వందల కుక్కల పోషణకు వినియోగిస్తారు. దాదాపు ఐదారు తరాల నుంచీ ఇక్కడ ఇదే విధానం కొనసాగుతున్నది. ప్రస్తుతం ఒక్కో ఎకరం విలువా నలభై లక్షల దాకా పలుకుతున్నది. ఆ లెక్కన మొత్తం భూమి విలువ ఐదుకోట్ల రూపాయల పైమాటే. కానీ దానిమీద వచ్చే ప్రతి రూపాయినీ మూగజీవాల మేలుకోసమే ఖర్చు చేస్తారు.
రెండు మూడు వందల ఏళ్లనాటి మాట. ఊళ్లో కుక్కలకు ఆహారం అందించడం కష్టంగా ఉందని గ్రామ ప్రజలంతా విన్నవించడంతో.. అప్పట్లో ఆ ప్రాంతాన్ని పాలించిన నవాబు తాలిబ్ మొహమ్మద్ ఖాన్.. వాటి పోషణ కోసం ఈ భూమిని మంజూరు చేశారు. ఏటా వేలం నిర్వహించి ఎక్కువ పాట పాడినవారికి కౌలుకు ఇస్తారు. అలా వచ్చిన సొమ్మును ఊళ్లో కుక్కల ఆహారానికి, వసతుల కల్పనకు వాడతారు. వాటికోసం రోజూ ఐదు కిలోల గోధుమపిండితో రొట్టెలు చేస్తారు. కిచిడీ, పాల పదార్థాలు కూడా పెడతారు. ఐదువందల గడపలున్న పల్లె కావడంతో, రోజుకొకరు ఆహారం తయారుచేసే బాధ్యత తీసుకుంటారు. పండుగల సమయంలో స్వీట్లూ పెడతారు. ఇందుకు పెద్దపెద్ద పాత్రల్ని కొన్నారు.‘సమస్త్ గావ్ కుత్రాని’ పేరిట ఏర్పాటైన సమితి ఆ వ్యవహారాలన్నీ చూసుకుంటుంది. కావలసిన పదార్థాలను తెచ్చి పెడుతుంది. కుక్కలు పడుకోవడానికి అనువుగా ఎత్తయిన అరుగులు నిర్మించారు. పుట్టినరోజు, పెండ్లిరోజులాంటి ప్రత్యేక సందర్భాల్లో అప్పటికప్పుడే ఆహారం అందించేలా ఇవి పడుకునే గట్టు దగ్గర బిస్కెట్లలాంటివి అమ్మే దుకాణాన్ని కూడా నడుపుతున్నారు. మొత్తానికి ఏ కుక్కా ఆకలితో పడుకోకుండా చూడటం ఈ కమిటీ ప్రధాన బాధ్యత. ఇక, మిగిలిన మొత్తంతో పశువులకు గడ్డి, పిచ్చుకలకు గూళ్లు, ఆహారం ఏర్పాటు చేస్తున్నారు. ప్రాణులకు సేవ చేయడమంటే దైవసేవ కిందే భావిస్తామనీ, ప్రభుత్వమే అడిగినా ఈ భూమిని అమ్మే ఆలోచన లేదనీ చెబుతారీ గ్రామస్థులు. ఇక్కడి కుక్కల్ని చూసి.. పెట్టి పుట్టాలి అనాల్సిందే ఎవరైనా. నిజమే, ఆ నవాబుగారు మనుషుల కోసమూ ఇలాంటి ఏర్పాటు చేస్తే బావుండేది.
ప్రఖ్యాత అమెరికన్ టీవీ యాంకర్ ఓప్రా విన్ఫ్రే గురించి వినే ఉంటారు. తనదైన శైలిలో ప్రత్యేక ఇంటర్వ్యూలు చేస్తూ.. ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారామె. వ్యాపారవేత్తగా, నటిగా కూడా మంచిపేరు సాధించారు. ఈమెకు కుక్కలంటే ప్రాణం. ఇరవై దాకా శునకాలను పెంచుకున్నారు. గోల్డెన్ రిట్రీవర్, కాకర్ స్పానియెల్ తదితర ప్రత్యేక జాతులూ ఉన్నాయి. అందులో అయిదింటిని పూర్తిగా తనే పెంచింది. ఒకవేళ తన ఇల్లు తగలబడిపోయే పరిస్థితి వస్తే.. ఒకే ఒక్క వస్తువును ఆ ప్రమాదం నుంచి బయటికి తెచ్చుకునే అవకాశం ఉంటే.. ఆ తెచ్చుకునేది తనకు ఇష్టమైన కుక్కల ఫొటోఫ్రేమునే అని చెబుతారామె. తన తదనంతరం ఆ మూగజీవాలు ఇబ్బంది పడకుండా ఉండాలని, తన ఆస్తిలో 30 మిలియన్ డాలర్లు.. అంటే మన కరెన్సీలో 245 కోట్ల రూపాయల పైచిలుకు మొత్తం వీటికి చెందేలా వీలునామా రాశారు. తరతరాలకూ తరగని ఆస్తిపాస్తులు ఈ కుక్కల సొంతం.