చిరిగిన జీన్సు… యమహా బైకులు కాలేజీ ఫ్యాషన్లనీ, టీనేజీ ట్రెడిషన్లనీ చెప్పుకొంటూ వాటిని తెగ ఫేమస్ చేశారు యూత్. అయ్యో దేనికో గీరుకుని చిల్లు పడ్డట్టుందే అనిపించేలా ఓ మోస్తరు చిరుగులతో ఉన్న ప్యాంట్లని మనం చాన్నాళ్ల నుంచీ చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు అందులోనే మరో కొత్త రకం వచ్చింది. రోబో 2.0 లాగా ఇది మరీ అడ్వాన్సు. జీన్సు మొత్తం దారాలు వేలాడుతూ ఉండేలా, చినుగుల కంతలాగా కనిపించేలా తయారవుతున్న వీటిని డిస్ట్రెస్డ్ జీన్స్గా పిలుస్తున్నారు.
ప్యాంటు దారాలు ఊడిపోయినట్టు, చిరిగినట్టు, మరకలు పడినట్టు, ముక్కలేసి కుట్టినట్టు… అంటే బాగా వాడినట్టు కనిపించడమే వీటి ప్రత్యేకత. దీన్ని వింటేజ్ లుక్ అని కూడా పిలుస్తున్నారు. వీటిని చూశాక ఎవరైనా, ఆ… మనకు సంబంధం లేని ఏ విదేశాల్లోనో వీటిని వాడుతున్నారు, అమ్ముతున్నారు అనుకోవడానికి లేదు. మామూలుగా మనం వాడే అమెజాన్, మింత్రలాంటి వెబ్సైట్లూ అమ్ముతున్నాయి కూడా. ఏది ఏమైనా డిస్ట్రెస్డ్ జీన్సు సంగతేమో కానీ వాటిని చూస్తే ఎదుటివాళ్లు డిప్రెస్ అయ్యేలా ఉన్నాయని మాత్రం అనిపిస్తుంది. మరి మీరెలా ఫీలయ్యారు?!