అందాన్ని రెట్టింపు చేసే ఆభరణాల ఎంపికలో అతివల అభిరుచే వేరు! ఒక్కొక్కరూ ఒక్కో రకమైన నగలను ఇష్టపడతారు. అంతేకాదు వేడుకకు తగ్గట్టు డిఫరెంట్ కాంబినేషన్స్ సెట్ చేసుకుంటారు. కొందరు సంప్రదాయ దుస్తులపైన భారీ ఆభరణాలు ఇష్టపడితే, మరికొందరు ఆధునిక దుస్తులపైన తేలికపాటి నగలను అలంకరించుకుని మురిసిపోతారు. అదేవిధంగా ఆభరణాల తయారీలోనూ రకరకాల కాంబినేషన్లు జిగేల్ మంటున్నాయి. రత్నాలు, ముత్యాలు పొదిగిన బంగారం, వెండి, రోజ్ గోల్డ్ కాంబినేషన్ జువెలరీ విశేషాలు ఇవి..
వివిధ రకాల ఆభరణాల తయారీలో వాడే బంగారం, వెండి లాంటి లోహాలతోపాటు వజ్రాలు, పగడాలు, ముత్యాలు ఇలా నానాజాతి రత్నాలు కలిపి తయారు చేసే ఆభరణాలను కాంబినేషన్ జువెలరీ అంటారు. సంప్రదాయంతోపాటు ఆధునికతను కలబోసిన ఈ నగలు ఈతరం మహిళలను అమితంగా ఆకర్షిస్తున్నాయి. వీటి తయారీలో బంగారం ప్రధాన లోహం. దీనికి వెండి, ప్లాటినం, రోజ్ గోల్డ్, రాగి లాంటి ఇతర లోహాలనూ జోడిస్తున్నారు. ఆపై రూబీ, ఎమరాల్డ్, సఫైర్ వంటి రత్నాలు, ముత్యాలు, కుందన్లను పొదిగి రకరకాల డిజైన్లలో అందమైన ఆభరణాలుగా మలుస్తున్నారు.
ఈ నగల్లో కొన్ని కాంబినేషన్లు అత్యంత ఆదరణ పొందుతున్నాయి. కుందన్లు పొదిగిన బంగారు ఆభరణాలు సంప్రదాయ వేడుకల్లో అగ్రపీఠం అందుకుంటున్నాయి. వజ్రాలు పొదిగిన నాజూకు నగలను నవ యువతులు తెగ ఇష్టపడుతున్నారు. రోజ్ గోల్డ్, బంగారం కలిపి చేసే బ్రేస్లెట్స్, ఉంగరాలు వెస్ట్రన్వేర్పై చక్కగా సరిపోతాయి. ముత్యాలు, రత్నాలతో ముస్తాబైన పెండెంట్లు బంగారు హారాలతో జతకట్టి ఆకట్టుకుంటున్నాయి. కాంబినేషన్ ఆధారంగా ఈ ఆభరణాలు అన్ని ధరల్లో అందుబాటులో ఉన్నాయి. వెండి, రోజ్ గోల్డ్ నగలు సరసమైన ధరల్లో లభ్యమవుతున్నాయి. ఈ నగలను సున్నితమైన వస్త్రంతో శుభ్రం చేయాలి. రత్నాలు, ముత్యాలు పొదిగి ఉండటం వల్ల కెమికల్స్, పర్ఫ్యూమ్స్ నుంచి వీటిని దూరంగా ఉంచడం అవసరం. అంతేకాదు వీటిని వేర్వేరు డబ్బాల్లో, పాకెట్స్లో భద్రపరచాల్సి ఉంటుంది.