కాలేజీల్లో హ్యాపీడేస్ ఎంజాయ్ చేసే సాదాసీదా విద్యార్థులు కాదు వాళ్లు..తమ చుట్టూ ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను వెదుకుతూ ఆంత్రప్రెన్యూర్లుగా ఎదగాలని కలలు కంటున్నారు. ఆ కలలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. దైనందిన జీవితంలో ఎదురయ్యే సవాళ్లనే తమ ప్రయోగాలకు బీజాలుగా చేసుకుని అధునాతన పరికరాలు, యంత్రాలకు రూపమిస్తున్నారు. తాజాగా యంగ్-కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఆంత్రప్రెన్యూర్ ప్రకటించే నగదు బహుమతిని గెలుచుకోవడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన అంకుర సంస్థలపై ఈ వారం స్టార్టప్ స్టోరీ.
Startup Stories | అధ్యాపకులిచ్చిన ప్రాక్టికల్స్ అసైన్మెంట్ రిపోర్టులు రాయడానికే పరిమితం కాకుండా ప్రయోగాలను ఆచరణలోకి తీసుకువచ్చి సర్వీస్ ప్రొవైడర్లుగా మారుతున్నారు కొందరు విద్యార్థులు. గర్భిణులకు వైద్యసేవలను ఒకేచోట అందించాలని ‘బద్రుకా’ విద్యార్థుల బృందం ప్రెగాకేర్ ప్రాజెక్టును ఆవిష్కరిస్తే.. ధాన్యం ఆరబెట్టడానికి ఆధునాతన పరికరాన్ని తయారుచేశారు ‘సీబీఐటీ’ విద్యార్థులు.
ప్రెగాకేర్తో గర్భిణులు సురక్షితం
బద్రుకా కాలేజీలో బీబీఏ చదువుతున్న మిర్యానం రిషిత, మాళవిక పడవ, మిథాలీ సిన్హా, వొర్రే అభిషేక్ శెట్టి బృందం గర్భిణులకు సేవలు అందించడంలో దాగి ఉన్న బిజినెస్ కాన్సెప్ట్‌ను అభివృద్ధి చేశారు. నెలలు నిండుతున్నవారికి మెడికేషన్, డాక్టర్ కన్సల్టేషన్, వైద్యపరీక్షలు, న్యూట్రిషన్, మెంటల్ వెల్బీయింగ్, డెలివరీ, పోస్ట్ డెలివరీ సేవలను కలిపి అందించే ప్రాజెక్టును తీర్చిదిద్దారు. అందుకు కావాల్సిన టెక్నాలజీ, నెట్‌వర్క్‌తోపాటు మ్యాన్‌పవర్, స్కిల్స్‌తో సమగ్ర ప్రాజెక్టుగా ‘ప్రెగాకేర్’ను మెంటార్ మిథేశ్ సాయంతో డిజైన్ చేశారు.
హైదరాబాద్ లాంటి నగరాల్లో ఈ సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు స్టార్టప్‌ను ప్రారంభించారు. వైద్యరంగంలో ఇలాంటి సేవలు అందించే అప్లికేషన్లు, సంస్థలు ఇప్పటికే ఉన్నప్పటికీ గర్భిణులకు మాత్రమే ఈ తరహా సేవలు అందించే సంస్థలు లేవని చెబుతున్నది ‘ప్రెగాకేర్’ ఫౌండర్ బృందం. ముఖ్యంగా గర్భిణులకు అందించే వైద్యసేవల్లో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని దీనిని డిజైన్ చేశామని బృంద సభ్యురాలు రిషిత చెబుతున్నది. ‘ప్రస్తుతం ఇంక్యుబేషన్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ప్రాజెక్టు కాన్సెఫ్ట్‌పై పేటెంట్ కోసం కూడా దరఖాస్తు చేశాం. ప్రెగాకేర్ ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా డెలివరీకి అవసరమైన సేవలను పొందే వీలు ఉంటుంది. పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత మా సేవలను విస్తరిస్తాం’ అంటున్నది రిషిత. ‘సామాన్యులకు అందుబాటులో ఉండే ధరల్లోనే సేవలు అందిస్తాం!’ అంటున్నారు ప్రెగాకేర్ ఫ్రెండ్స్.
ధాన్యం ఎండబెట్టే ఆధునిక యంత్రం
ఆరుగాలం కష్టపడి ధాన్యం పండించే రైతులకు అడుగడుగునా గండాలే. పంటను విక్రయించే సమయంలో అన్నదాతలకు అత్యంత కీలకమైనది సానుకూల వాతావరణం. పంట కోసిన తర్వాత రోడ్లకు ఇరువైపులా ధాన్యాన్ని పోసి ఆరబెట్టడం మనం చూస్తుంటాం. ఆ దారిన పరచిన వరికుప్పలు, మక్కజొన్న గుట్టలు చూసిన బీటెక్ విద్యార్థినికి అధునాత ఎయిర్ డ్రయర్‌ను తయారుచేయాలనే ఆలోచన కలిగింది. గింజలను శాస్త్రీయంగా స్కాన్ చేసి, అమ్మకానికి సరిపడా తేమశాతంతో ఆరబెట్టేలా ‘ధాన్యగుణ’ పరికరాన్ని తోటి విద్యార్థులతో కలిసి డిజైన్ చేసింది.
సీబీఐటీలో బీటెక్ చదువుతున్న శృతిలయ, భవ్యశ్రీ, వర్షితతోపాటు మరికొందరు ఇంక్యుబేషన్ సెంటర్ మెంటార్ల సహకారంతో ‘ధాన్యగుణ’ను డెవలప్ చేశారు. గంటల వ్యవధిలోనే వేగంగా ధాన్యాన్ని ఆరబెట్టడంతోపాటు, గింజల్లోని టాక్సిన్లను తొలగించడం ధాన్యగుణ ప్రత్యేకత. నీట మునిగిన ధాన్యం గింజలను సైతం ఆరబెట్టడానికి వీలు ఉండేలా దీన్ని తీర్చిదిద్దారు.
తక్కువ నిర్వహణ వ్యయంతో ఎక్కడికైనా తీసుకెళ్లేలా డెవలప్ చేసిన ఈ ఎయిర్ డ్రయర్… రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నది ‘ధాన్యగుణ’ బృందం. ప్రస్తుతం ఈ తరహా యంత్రాలు మార్కెట్లో ఉన్నప్పటికీ అవన్నీ పోర్టబుల్, మూవబుల్ ఎయిర్ డ్రయర్స్ కాదని చెబుతున్నారు. వాటితో పోల్చితే దీని ధర తక్కువ అని.. రూ.50 వేల లోపే ఉంటుందని, రవాణా ఖర్చులతో కలిపి రూ.60 వేలు ఖరీదు చేస్తుందని తెలిపారు. రైతులకు తక్కువ ఖర్చుతో సేవలను అందించేందుకు సిద్ధమవుతున్నట్టు ధాన్యగుణ కో ఫౌండర్ శృతిలయ వివరించింది.
యంగ్-కోవే అండతో..
ఆంత్రప్రెన్యూర్‌షిప్ వైపు అడుగులు వేస్తున్న ఈ విద్యార్థులకు యంగ్-కోవే అండగా నిలుస్తున్నది. తెలంగాణవ్యాప్తంగా ఉన్న 100కు పైగా కాలేజీలతో ఈ సంస్థ నెట్వర్క్ కలిగి ఉన్నది. విద్యార్థుల్లో స్టార్టప్ ఆలోచనలను గుర్తించి, వారు పారిశ్రామిక నైపుణ్యాలను పెంపొందించుకునేలా కృషి చేస్తున్నది. ఏటా ఫెమ్ప్రెన్యూర్ పేరిట ప్రత్యేక పోటీలను నిర్వహించి ఉత్తమ
ఆలోచనలకు నగదు పురస్కారంతోపాటు నేరుగా తమ వద్దే ఇంక్యుబేట్ అయ్యేందుకు అవసరమైన ఆర్థిక, వ్యాపార మెలకువలు నేర్పుతున్నది.
ఈ రెండే అత్యున్నతం
యంగ్-కోవే ఈ ఏడాది నిర్వహించిన ఫెమ్ప్రెన్యూర్ పోటీలకు వచ్చిన 33 స్టార్టప్ ఆలోచనల్లో ప్రెగాకేర్, ధాన్యగుణ ఉత్తమమైనవిగా నిలిచాయి. పోటీకి వచ్చిన అన్ని ఆలోచనలను పలు దఫాలుగా వడబోసి ఆరింటిని ఎంపిక చేశారు. అందులోంచి బెస్ట్ ఆఫ్ త్రీ ఎంపిక చేయగా ‘ప్రెగాకేర్’ మొదటి స్థానంలో, ‘ధాన్యగుణ’ రెండో స్థానంలో నిలిచాయి. భవిష్యత్తులో పూర్తిస్థాయిలో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించేందుకు అవసరమైన సహకారం యంగ్-కోవే ఇస్తుందని, సుస్థిర వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే స్థాయికి విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు యంగ్-కోవే చైర్మన్ శ్రీనిత్య వెల్లడించారు.
…? కడార్ల కిరణ్