జనవరి 1. సూర్యాస్తమయాలు యథావిధిగానే ఉంటాయి. అన్ని జీవులూ వాటి బతుకుపోరులోనే నిమగ్నమై ఉంటాయి. ఒకో రోజు ఒకోలా గడుస్తుందంతే! కానీ మనిషికి మాత్రం ఆ తేదీ ఒక మజిలీ. తన జీవితానికి వయసుల వారీగా ఎలాగైతే పుట్టిన రోజులు చేసుకుంటాడో… తన చుట్టూ ఉన్న లోకంలో సంఘటనలను నమోదు చేయడానికీ, భవిష్యత్తును అంచనా వేయడానికీ, గతాన్ని తవ్వుకోవడానికీ ఓ కొలమానమే జనవరి 1. ఆ రోజు నుంచి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. చరిత్రలో మరో అధ్యాయం మొదలవుతుంది. అందుకే జనవరి ఒకటి ఓ తేదీ మాత్రమే కాదు! లోకం ఇంకా బాగుంటుందనే ఆశ, తన జీవితం మెరుగుపడుతుందనే కోరిక, జీవితాన్ని తిరిగి గాడిన పెట్టుకునే అవకాశం, సరికొత్త లక్ష్యాల వైపు నడిపించే కదలిక. ఇంతకూ ఈ 2025లో ఏం జరగబోతున్నది. ఎలాంటి మార్పులు మన జీవితాల్ని పలకరించబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్న కొన్ని నివేదికలు, విశ్లేషణల ఆధారంగా ఆ మార్పులను ఊహించి, వాటికి సిద్ధపడే ప్రయత్నమిది!
New Year | లోకాన్ని పట్టించుకోకుండా ఏకాంతంలో కాలం గడిపేయాలంటే… ఆశనిరాశలతో పనిలేదు. ఊపిరి ఆడుతున్నంతసేపూ భవిష్యత్తు గురించి బెంగ అక్కర్లేదు. కానీ లోకంలో ఎదురీదాలంటే మాత్రం… ఏ రంగంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో… అవి ఏ దిశగా ప్రవహిస్తున్నాయో గమనించుకోవాల్సిందే. అందుకే విద్య, వైద్యం, సాంకేతికం, రాజకీయం, వ్యవసాయం, రవాణా… ఇలా ప్రతీ రంగంలోనూ కనిపిస్తున్న సూచనల ఆధారంగా 2025 మన జీవితాలను ఎలా మార్చే గేమ్‌చేంజర్ అంటున్నారు విశ్లేషకులు.
ఇంట్లో ఓ నలుగురు సభ్యులుంటే ఎలాగోలా తంటాలు పడి బస్సో, ఆటోనో పట్టుకుని బయల్దేరే రోజులు పల్చబడుతున్నాయి. కారు విలాసం నుంచి సౌకర్యం స్థాయికి వచ్చేసింది. అయితే అదే స్థాయిలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. కాబట్టి అటు ప్రమాదాలను తట్టుకుంటూ ఇటు ఇంధన ఖర్చులనూ తగ్గించేలా బ్యాటరీ ఆధారంతో పనిచేసే మందపాటి కార్లకు గిరాకీ పెరగనుంది. కేవలం మైలేజీకి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే మారుతిలాంటి కంపెనీలు ఇప్పుడు రక్షణకు, సంప్రదాయేతర ఇంధనాలకూ ప్రాముఖ్యతనిస్తూ వాహనాలు రూపొందిస్తుండటమే ఇందుకు రుజువు. అయితే పాశ్చాత్య దేశాల్లో సంచలనం సృష్టిస్తున్న స్వయంచోదిత వాహనాలకు ఇంకా సమయం ఉంది. ఉపాధి, భద్రతల దృష్ట్యా డ్రైవర్ రహిత వాహనాలను అనుమతించేది లేదని 2023లోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కుండబద్దలు కొట్టేశారు. అయితే Advanced Driver Assistance Systems (ADAS)కి మాత్రం గిరాకీ పెరిగిపోనుంది. నేరుగా ఉండే రోడ్ల మీద డ్రైవర్‌కు కాస్త శ్రమ తగ్గించే సాంకేతికతే ADAS. దాని గురించి మనం మరింతగా వినబోతున్నాం.
ఇప్పుడు విద్యార్థులు కూడా ఏదన్నా అనుమానం వస్తే చాట్ జీపీటీ, జెమిని, మెటాలను అడిగేస్తున్నారు. బొమ్మలు గీయడం నుంచి పాటలు పాడటం వరకూ అంతా కృత్రిమ మేధ రాజ్యమేలుతున్నది. కోరిన విధంగా కంటెంట్ అందించే ఈ మేధను Generative AI అంటున్నారు. అయితే వచ్చే ఏడాదిలో దీని ప్రభావం ఓ సాయంగా మాత్రమే ఉండబోవడం లేదు. నిర్ణయాలు తీసుకోవడం దగ్గర నుంచీ, ప్రణాళికలు అమలు చేయడం వరకూ కృత్రిమ మేధ తన విశ్వరూపాన్ని చూపించబోతున్నది. దాదాపు 75 ఏళ్ల చరిత్ర ఉన్న AI ఒక్కసారిగా మన జీవితాలను మార్చేయబోతున్నది. ఇప్పటికే సాంకేతిక సంస్థల్లో 55 శాతం ఏదో ఒక స్థాయిలో AI ని వినియోగిస్తున్నట్టు ఓ నివేదిక వెల్లడించింది. దీనివల్ల ఉద్యోగాల కోత గురించి తెలిసిందే. దీంతో పక్షపాత ధోరణి, సైబర్ మోసాలు లాంటి ఎన్నో నష్టాలు వస్తాయనే భయం లేకపోలేదు. అదే సమయంలో వినియోగదారుల సేవలు, రవాణా, విద్య, ఆరోగ్య రంగాల్లో సానుకూలమైన మార్పు రాబోతున్నది. కృత్రిమ మేధ మంచా చెడా అన్న ఓ బ్రహ్మపదార్థం లాంటి చర్చ 2025లో చాలా వేడి పుట్టించబోతున్నది. ఫలితంగా కాపీరైట్ నుంచి డేటా భద్రత వరకూ ఎన్నో అంశాలు లేవనెత్తుతూ… దాని మీద అదుపు చేసే ప్రయత్నాలు పెరగబోతున్నాయి.
వందల గిగాబైట్ల వీడియో సెకన్లలో డౌన్లోడ్ అయిపోతే. సెకనులో వెయ్యో వంతులో ఓ యంత్రం నుంచి సమాచారం అందితే… 5G యుగంలో ఇదంతా సాధ్యమే. ఇప్పటికే మనదేశంలో కొన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చిన ఈ 5G వల్ల నెట్ వేగం దాదాపు 20 రెట్లు పెరిగిందని అంచనా. 2025లో లోకంలో మూడో వంతు జనాభాకు 5G సేవలు అందుబాటులోకి రానున్నాయి. మనం ఒక మాట మాట్లాడినా, సందేశాన్ని పంపినా, పాట విన్నా, టీవీ చూసినా… కాస్త సమయం పడుతుంది. అది సెకన్ల వ్యవధే కావచ్చు. దీన్ని లేటెన్సీ అంటారు. 5G లో ఇది కేవలం 8 మిల్లీసెకన్లు మాత్రమే ఉండబోతున్నది. నెట్ వేగంగా ఉంటే దాని ఆధారంగా పనిచేసే సాంకేతికత (Internet of things) కూడా సంచలన వేగాన్ని అందుకోబోతున్నది. అదే సమయంలో దాని ప్రతికూల ప్రభావాన్ని కూడా చూడబోతున్నాం. నెట్ స్పీడుతోపాటు మనలో సహనం, విచక్షణ తగ్గిపోతున్నదని ఇప్పటికే పరిశోధనలు నిరూపిస్తున్నాయి.
సాగులో కృత్రిమ మేధ, మార్కెటింగ్ నైపుణ్యాలు, ఇంటర్నెట్ వాడకం… లాంటి విషయాల గురించి తరచూ వినేదే. కానీ సామాన్య రైతు జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అన్నది కాస్త ఆసక్తికరమే. సేంద్రియ (ఆర్గానిక్) సేద్యం వైపు మొగ్గు పెరగనుందనేది విశ్లేషకుల అంచనా. అటు పర్యావరణాన్నీ, ఇటు ప్రజల ఆరోగ్యాన్నీ దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు కూడా ‘పరంపరాగత్ కృషి వికాస్ యోజన’ లాంటి పథకాల ద్వారా సేంద్రియ సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నాయి.
గత కొన్నేళ్లుగా వాతావరణంలో వస్తున్న విపరీతమైన మార్పుల వల్ల చీడపీడలు, కరువులు, వరదలతో రైతులు సతమతం అవుతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో వీటిని తట్టుకునే వంగడాలు, వాణిజ్య పంటలకు ప్రాధాన్యం పెరగనుంది. ఇక ఎగుమతుల విషయంలో కూడా అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. పంటలకు తగిన విలువ దక్కడానికి శీతలీకరణ కేంద్రాల (కోల్డ్ స్టోరేజీలు) దగ్గరనుంచీ రవాణా వరకూ అంతా మరింత సులభతరం కానుంది. ప్రవాస భారతీయులు కూడా రాబోయే రోజుల్లో వ్యవసాయం మీదా పెట్టుబడులు పెట్టబోతున్నారని మరో విశ్లేషణ. ఇవన్నీ కూడా సాగుకు శుభసూచకాలే!
కొవిడ్ తర్వాత ఆరోగ్యరంగంలో వచ్చిన మార్పుల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందులో కొన్ని సందర్భాలు మరింత బలపడనున్నాయి. ఉదాహరణకు డిజిటల్ మాధ్యమాల ద్వారా వైద్యులను సంప్రదించే వ్యాపారం ఏకంగా 15 లక్షల కోట్లకు చేరుకోనుందని అంచనా. అలాగే మన జన్యువులు, ఆరోగ్యం, అలవాట్లను బట్టి ఒకో వ్యక్తికీ ఒకోరకమైన చికిత్సను అందించే ‘Personalized Medicine’కి ఇంపార్టెన్స్ పెరగనుంది. ఇక మన ఆరోగ్యాన్ని నిరంతరం గమనించే పరికరాలు చిన్నపాటి వాచీలతో ఆగిపోవడం లేదు. చిన్నచిన్న ఇంప్లాంట్స్ అమర్చడం ద్వారా రోగాన్ని విశ్లేషించేందుకు కానీ, అదుపులో ఉంచేందుకు కానీ ప్రయత్నాలు జరగబోతున్నాయి. వీటి రూపకల్పనకు నానో టెక్నాలజీ అండగా ఉండబోతున్నది. కొద్ది రోజులుగా మన జీర్ణకోశ ఆరోగ్యానికీ (Gut Health) ఆయుష్షుకీ సంబంధం ఉందని ఎన్నో పరిశోధనలు నిరూపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ గట్ హెల్త్‌కి మరింత ప్రాముఖ్యత పెరగనుంది. ఇక త్రీడీ ప్రింటింగ్ ద్వారా అంతర్గత అవయవాలను సైతం రూపొందించి అమర్చే సాంకేతికతా ఊపు అందుకోనుంది.
మర మనుషులు పెరిగిపోతున్నారు. వాటి గురించి వినడం దగ్గర నుంచీ నేరుగా రెస్టారెంట్లలో చూసే పరిస్థితికి వచ్చేశాం. రాబోయే రోజుల్లో ఈ పరిణామం మరింత విజృంభిస్తుంది. ఈ దశలో రెండు కీలకమైన మార్పులను కూడా ఆహ్వానించాల్సిందే. మొదటిది Human-robot interaction (HRI). రోబోలను రూపొందించడం, అవి సరిగ్గా స్పందించించేలా ప్రోగ్రామింగ్ చేయడం, ఉద్వేగాలను పోలిన ప్రవర్తన చొప్పించడం లాంటి ఎన్నో కీలకమైన అంశాలు ఈ HRI లోకి వస్తాయి. ఇదంతా కూడా ఉపాధికి సంబంధించినది. ఇక Brain-Computer Interface (BCI) రెండో మార్పు. అంటే నేరుగా మనమే కంప్యూటర్‌తో సంభాషించడం. మెదడులో చిప్ అమర్చడం దగ్గరనుంచీ కృత్రిమ చేయి వరకూ భిన్న మార్గాలతో ఇది సాధ్యమవుతుంది. వీడియో గేమ్స్ నుంచి అంగవైకల్యం వరకూ ఎన్నో రంగాలలో ఇది అడుగుపెట్టనుంది. BCI పరికరాలతో కంప్యూటర్లు నేరుగా మన మెదడు నుంచే స్పందనలు అందుకుంటాయి.
ఇప్పుడు మనం అనుసరిస్తున్న కేలెండర్‌ను గ్రెగోరియన్ కేలెండర్ అంటారు. అంతకుముందు వరకూ జూలియస్ సీజర్ పేరు మీదుగా జూలియన్ కేలెండర్ పాశ్చాత్య దేశాలకు ప్రామాణికంగా ఉండేది. సూర్యుని చుట్టూ భూమి తిరిగే రోజుల సంఖ్య 365. 25 రోజులు అన్న సూత్రం ఆధారంగా జూలియన్ కేలెండర్ నడిచేది. ఆ పావు రోజును సరిచేసేందుకు ప్రతి నాలుగేళ్లకు ఓసారి లీప్ ఇయర్ పాటించేవారు. నిజానికి సూర్యుని చుట్టూ భూమి తిరిగే రోజులు 365.2425 రోజులు. పైకి చూసేందుకు ఇదేమంత పెద్ద లెక్క కాకపోవచ్చు. కానీ కొన్ని శతాబ్దాలు గడిచేకొద్దీ ఆ కొద్ది క్షణాలే రోజులై, రోజులు నెలలై రుతువులు కూడా మారిపోయే ప్రమాదం ఉంది.
అందుకే పోప్ గ్రెగొరీ 1582లో ఈ కేలెండర్ని ప్రతిపాదించాడు. తన సూచన ప్రకారం ప్రతి నాలుగేళ్లకూ ఓ లీప్ ఇయర్ పాటించినా శతాబ్ది అంతానికి మాత్రం లీప్ ఇయర్ వర్తించదు. దీనికి ఒక్కటే మినహాయింపు ఏమిటంటే… 400తో భాగించగలిగే సంవత్సరం మాత్రం లీప్ ఇయర్‌గా పరిగణించాలి. కాస్త అయోమయంగా ఉన్నా లోకం ఇదే పాటిస్తున్నది. ఉదాహరణకు 1800, 1900 సంవత్సరాలను నాలుగుతో భాగించగలిగినప్పటికీ అవి లీప్ ఇయర్ కాదు. ఇక 2000 సంవత్సరాన్ని 400తో భాగించగలం కాబట్టి ఆ సూత్రం వర్తించదు.
ప్రపంచం అంతా ఒకే తాటిన నడవడానికి గ్రెగోరియన్ కేలెండర్ పాటిస్తున్నారు. కానీ మనకంటూ కొన్ని కాలమాన పరిస్థితులు ఉన్నాయి కదా! భారతదేశంలోనే మన తెలుగువారికి ఉగాది కొత్త సంవత్సరం అయినట్టు… వేర్వేరు ప్రాంతాలవారు వేర్వేరు నూతన సంవత్సరాలను పాటిస్తుంటారు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని ప్రముఖ శాస్త్రవేత్త మేఘనాథ్ సాహా ఆధ్వర్యంలో ఒక కేలెండర్‌ను రూపొందించింది ప్రభుత్వం. శాతవాహన వంశానికి చెందిన శాలివాహనుడు శక రాజులను ఓడించిన క్రీ.శ 78 సంవత్సరం ప్రామాణికంగా ఈ శక సంవత్సరం ఉంటుంది. అటు సూర్యమానాన్నీ, ఇటు చంద్రమానాన్నీ కూడా కలుపుతూ ఈ శక కేలెండర్ సాగడం విశేషం. సాధారణ సంవత్సరాల్లో మార్చి 21, లీప్ సంవత్సరంలో మార్చి 22న ఈ సంవత్సరం మొదలవుతుంది.
ట్రంప్ రాకతో లోకానికి పెద్దన్నగా భావిస్తూ, ప్రవర్తిస్తుండే అమెరికా తీరు అనిశ్చితంగా మారనుంది. వలసల మీద ఉక్కుపాదం, అధిక పన్నులను విధిస్తానని హెచ్చరించడం, మధ్యవర్తిత్వాలకు దూరం జరగడం లాంటి ప్రకటనలతో ఇప్పటికే గుబులు రేకెత్తిస్తున్నాడు ట్రంప్. చైనా నాయకత్వంలో కానీ, దూకుడులో కానీ ఎలాంటి మార్పూ లేకపోవడంతో… వచ్చే ఏడాది కూడా మన పక్కలో బల్లెంలాగే సాగుతుంది. బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక్, మాల్దీవుల్లాంటి వ్యూహాత్మక దేశాలను మనకు వ్యతిరేకంగా మార్చే ప్రక్రియ ఊపందుకుంటుంది. ఉక్రెయిన్- రష్యా, ఇజ్రాయిల్- పాలస్తీనా యుద్ధాలు… సిరియాలో అనిశ్చితి లాంటి పరిస్థితులేవీ ప్రపంచ శాంతికి అనుకూలంగా లేవు. ఉండే సూచనలూ కనిపించడం లేదు. ఇంధనం నుంచి వలసల వరకూ వీటి ప్రభావం వచ్చే ఏడాది మరింత తీవ్రం కానుంది.
ప్రపంచం అంతా జనవరి 1ని నూతన సంవత్సరాదిగా భావిస్తే ఫ్రాన్సులో కొంతమంది ఇంకా మార్చి చివరలో వచ్చే రోజునే కొత్త సంవత్సరంగా భావిస్తాం అని పట్టుబట్టారట. అలాంటివాళ్లను మూర్ఖులుగా భావిస్తూ మొదలైందే ఏప్రిల్ ఫూల్స్ డే అని ఓ నమ్మకం.
చాలాదేశాలు జూలియన్ నుంచి గ్రెగోరియన్ కేలెండర్‌కు మారే క్రమంలో కొన్ని రోజులు తగ్గిపోయాయి. ఇవి తీవ్రమైన గందరగోళానికి దారితీశాయి. ఉదాహరణకు కొన్నిచోట్ల అప్పుడే నెల పూర్తవడంతో మిగిలిన రోజులకు జీతాలు చెల్లించమంటూ ఉద్యమాలు జరిగాయి.
ఇథియోపియా, నేపాల్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్… ఈ నాలుగు దేశాలు ఇప్పటికీ గ్రెగోరియన్ కేలెండర్‌ను అనుసరించవు. భారత్ వంటి దేశాల్లో స్థానిక, గ్రెగోరియన్ కేలెండర్లు రెండూ పాటిస్తుంటారు.
జాబిల్లి దాకా: అంతరిక్షంలోకి వెళ్లడం లేదా గురుత్వాకర్షణ స్థాయిని దాటడం… ఇప్పటివరకూ కుబేరులకు మాత్రమే సాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు కొన్ని లక్షలు పెట్టుకుంటే చాలు అంతరిక్షపు అనుభూతిని అందించే సంస్థలు ముందుకొస్తున్నాయి. బ్లూ ఆరిజిన్, స్పేస్ ఎక్స్, వర్జిన్ గెలాక్టిక్ లాంటి అంతర్జాతీయ సంస్థలే కాకుండా ‘స్పేస్ ఆరా’ (ముంబయి) లాంటి కంపెనీలూ వస్తున్నాయి. 2025లో ఓ అరుగురు పట్టే బెలూన్ని సముద్రమట్టం నుంచి 35 కి.మీ ఎత్తుకు పంపేందుకు ఈ సంస్థ సిద్ధంగా ఉంది. కొన్ని సంస్థలైతే ఏకంగా చంద్రుడి మీదకే ప్రయాణికులతో రాకెట్ నడిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
సింథటిక్ మీడియా : కంటెంట్ రాయనవసరం లేదు. దాన్ని చదవనవసరం లేదు. దృశ్యాల కోసం శ్రమ అక్కర్లేదు. అంతా కృత్రిమ మేధ ఆధారంగా సాగిపోయే మీడియా ఇకపై విస్తృతం కానుంది. డీప్ ఫేక్, ఏఐ ఇమేజెస్, వర్చువల్ ఇన్‌ఫ్లూయన్సర్స్ లాంటి సాంకేతికత ద్వారా జర్నలిస్టులు, యాంకర్లు, డిజైనర్లు, కెమెరామెన్ సాయం లేకుండా కొన్ని చానెల్స్ రానున్నాయి. అయితే ప్రజలు వీటిని ఎంతవరకు ఆదరిస్తారు, వీటిలో విశ్వసనీయత ఏమేరకు ఉంటుందనేది కోటి రూపాయల ప్రశ్న!
అంతా కళ్ల ముందే: కళ్లకు ఓ పరికరాన్ని అమరిస్తే అందులో వేరేలోకాన్ని చూసుకోవడం వర్చువల్ రియాలిటీ. మన కళ్ల ముందే లేని ప్రపంచాన్ని చూడగలగడం ఆగ్మెంటెడ్ రియాలిటీ. వీటికి కొనసాగింపుగా కావల్సిన ప్రపంచాన్ని చూస్తూ… అందులో మన జోక్యాన్ని కూడా అనుమతించేది ఎక్స్టెండెడ్ రియాలిటీ. రాబోయే రోజుల్లో దీనిదే రాజ్యం. Extended Reality ద్వారా షాపింగ్ చేయవచ్చు, క్రికెట్ పిచ్ పక్కన నిలబడి చూసిన అనుభూతి పొందవచ్చు, ఇష్టమైనవారి పెళ్లిళ్లకు హాజరుకావచ్చు, దూరంగా ఉన్న బంధువులను ఆలింగనం చేసుకోవచ్చు.
ఉద్యోగపర్వం: గత ఏడాది అంతా ఉద్యోగాల తొలగింపు గురించిన వార్తలు తీవ్రమైన అభద్రత కలిగించాయి. కానీ వచ్చే ఏడాది మళ్లీ ఉపాధిరంగం పుంజుకుంటుందనే విశ్లేషణ వినిపిస్తున్నది. Artificial Intelligence (AI) and Machine Learning వంటి రంగాల్లో 40 శాతం వరకూ ఉపాధి పెరుగుదల ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
విద్య: కొవిడ్ రాకంతో ఆన్లైన్ విద్యకు (Ed Tech) ఎలాగూ ప్రాముఖ్యం పెరిగింది. ఇప్పుడది మరింత బలపడనుంది. ఉద్యోగం రావడానికీ అందులో రాణించడానికీ కేవలం డిగ్రీ మాత్రమే ముఖ్యం కాదని అటు సంస్థలూ ఇటు అభ్యర్థులూ గ్రహించడంతో పెద్దపెద్ద విశ్వవిద్యాలయాలు సైతం ఎప్పటికప్పుడు సరికొత్త కోర్సులను ప్రకటిస్తున్నాయి. ఏదో ఒక నైపుణ్యాన్ని అందుకుంటూనే ఉండేందుకు వయసుతో పని లేకుండా నిరంతరం చదివే అలవాటు పెరగనుంది.
ఇదీ ఓ అంచనా. భయపడేందుకో, సంతోషించడానికో కాదు! కాలప్రవాహానికి ఎదురీదుతూ విధిరాతను, సమాజరీతిని తిట్టుకుంటూ ఉంటే ఫలితం దక్కదు. ఆ అలలనే చుక్కానిగా మార్చుకున్నప్పుడే, ఎంత క్లిష్టమైన ప్రయాణమైనా సాఫీగా మారుతుంది. 2025లో ఆ ప్రయత్నం చేసి చూద్దాం.
– కె.సహస్ర