కళ్లు లేవని చింతించలేదు. అవహేళనలకు భయపడలేదు. ఆ పట్టుదలకు గుర్తుగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ పట్టా ఇచ్చింది. ఆ ప్రతిష్ఠాత్మక సంస్థలో సీటు సాధించిన మొదటి అంధురాలు తనే. వైకల్యానికి సవాలు విసిరి, విధిరాతను తిరగరాసి.. తన గెలుపు దారి తానే నిర్మించుకుంది కణితి శ్రావ్య. నేడు లూయీ బ్రెయిలీ జయంతి. ఈ సందర్భంగా.. లక్ష్యం వైపుగా వింటినారిని సారించడానికి కంటిచూపు ఓ అవరోధమేకాదని నిరూపించిన శ్రావ్య విజయగాథ..
ఆడపిల్ల..
నర్సమ్మ చెప్పగానే సంబరపడ్డారు. బిడ్డ బోసి నవ్వులు చూసి మురిసిపోయారు. ‘పాపాయి ఏడుపు కూడా శ్రావ్యంగా ఉందే?’ అన్నారెవరో. అంతే, శ్రావ్య అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారు. బిడ్డ శూన్యంలోకి చూస్తుంటే.. పూర్వ జన్మలో తపస్వి అయి ఉంటుందని ఊహించుకున్నారు. పదమూడో రోజు నేత్ర వైద్యులు పరీక్షించాక కానీ తెలియలేదు.. అది అంధత్వమని.
ఆ నిరాశా కొద్ది రోజులే. శ్రావ్య జీవితాన్ని అందంగా తీర్చిదిద్దాలని తీర్మానించుకున్నారు తల్లిదండ్రులు సుజాత, సుదర్శన్. మహానగరమే అందుకు సరైన వేదిక కాబట్టి, వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చేశారు. కానీ శ్రావ్యకు సీటు ఇవ్వడానికి చాలా విద్యాసంస్థలు తిరస్కరించాయి. ఓ ఇంటర్నేషనల్ స్కూల్ మాత్రం ఆమోదం తెలిపింది. అక్కడా అవమానాలు తప్పలేదు. ఆటపాటల్లో తోటి పిల్లలు దూరం పెట్టేవారు.
టీచర్లు చిన్నచూపు చూసేవారు. అసహనంతో తిట్టేవారు. ఒకరోజు ఆ విషయాలన్నీ అమ్మతో చెప్పి బోరున ఏడ్చేసింది శ్రావ్య. మరొక తల్లి అయితే.. కన్నీళ్లు పెట్టుకునేది. బాధపడి పోయేది. కానీ ఆ అమ్మ మాత్రం ‘ప్రపంచం ఇలానే ఉంటుంది. ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎంతోమందికి నువ్వొక రోల్‌మోడల్‌గా నిల బడాలి’ అని ధైర్యం చెప్పింది. ఆ మాటలు స్ఫూర్తి మంత్రాల్లా పనిచేశాయి. శ్రావ్య జీవితాన్ని కొత్త మలుపు తిప్పాయి. స్క్రీన్ రీడర్ సాఫ్ట్‌వేర్‌లాంటి సాంకేతికత సాయంతో చదువుల్లో దూసుకుపోయిందా చిన్నారి.
ఐఎస్బీలో..
సెయింట్ ఫ్రాన్సిస్‌లో డిగ్రీ తర్వాత.. రెండున్నరేండ్లు ఉబర్‌లో సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్‌గా పని చేసింది శ్రావ్య. అయినా ఎక్కడో అసంతృప్తి. ఇంకా ఏదో సాధించాలనే తపన. హైదరాబాద్‌లోని ఇండియన్ బిజినెస్ స్కూల్లో ఎంబీయే చేయాలని తీర్మానించుకుంది. మొదటి రెండుసార్ల్లూ విఫలమైంది. మూడో ప్రయత్నంలో క్యాంపస్‌లో కాలుపెట్టింది. ఐఎస్బీలో చేరిన మొదటి విజువల్లీ చాలెంజ్డ్ అమ్మాయిగా రికార్డు సృష్టించింది. అంతలోనే ఇంకో ఇబ్బంది. ఐఎస్బీలో చాలా వేగంగా పాఠాలు చెబుతారు. సాధారణ విద్యార్థులే అందిపుచ్చుకోలేరు. శ్రావ్య మాత్రం దాన్ని ఓ చాలెంజ్‌గా తీసుకుంది. విజయవంతంగా ఎంబీయే పూర్తి చేసింది. ప్రముఖ విదేశీ బ్యాంకులో సీనియర్ బిజినెస్ కన్సల్టెంట్‌గా ఎంపికైంది.
సమాజ సేవలోనూ..
శ్రావ్యకు సంగీతంలో ప్రవేశం ఉంది. ఆ కళకు మెరుగులు పెట్టుకుని.. మ్యూజిక్ రియాలిటీ షోలకు హాజరైంది. విజేతగానూ నిలిచింది. డిగ్రీ రోజుల్లో కాలేజ్ మీడియా కో ఆర్డినేటర్‌గా పనిచేసి తన నాయకత్వ ప్రతిభను చాటుకుంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఐకాన్‌గానూ వ్యవహరించింది. తనలో సామాజిక స్పృహ కూడా ఎక్కువే. ప్రస్తుతం ఉద్యోగం చేస్తూనే.. తనలాంటి వారిలో స్ఫూర్తి నింపేందుకు సోషల్ మీడియా వేదికగా వీడియోలు పోస్ట్ చేస్తుంది. సామాజిక అంశాలపై స్పందిస్తుంటుంది.
పట్టుదల ఉంటే చాలు..
చాలామంది ఒకట్రెండు వైఫల్యాలకే కుంగిపోతుంటారు. తీవ్ర నిరాశలో కూరుకుపోతుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే సాధ్యం కానిదంటూ లేదు. అందుకు నా జీవితమే ఉదాహరణ. నా విజయంలో మా అమ్మానాన్నల పాత్ర ఉంది. వాళ్లు చేసిన త్యాగాలూ ఉన్నాయి. ‘సవాళ్లు వస్తుంటాయి, పోతుంటాయి. వాటిని ఎదుర్కోవాలే కానీ, పారిపోకూడదు’.. నా చిన్నతనంలో అమ్మ చెప్పిన మాట ఇది. ఇప్పటి వరకూ నేను అనుసరించిన మార్గం ఇదే. పట్టుదల కనుక ఉంటే, సాధ్యం కానిది ఏదీ లేదు.
– శ్రావ్య
…? మ్యాకం రవికుమార్