హైదరాబాద్ అమ్మాయి అంకితా జైన్ ఆంత్రప్రెన్యూర్షిప్ వైపుగా అడుగులేస్తున్న మహిళలకు మహోపకారం చేశారు. తను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఫాలోయర్ల సంఖ్యా ఎక్కువే. దాదాపు ఎనభైవేలమంది తనను అనుసరిస్తారు. ఆ పాపులారిటీని తోటి మహిళలకు ఉపయోగపడేలా.. ‘అంకితా జైన్ కీ వెన్స్డే షాపింగ్ లైవ్’ పేరిట ఓ కార్యక్రమం ప్రారంభించారు. బుధవారంనాడు ఆసక్తి ఉన్న మహిళా ఆంత్రప్రెన్యూర్స్ తమ సరుకులను ఈ వేదిక మీద విక్రయించుకోవచ్చు. తను ఓ గృహిణి. భర్త వ్యాపారవేత్త. చాలాకాలం నుంచీ ఇన్స్టాలో చురుగ్గా ఉంటున్నారు. ఎంతోకొంత డబ్బు సంపాదిస్తున్నారు.
‘మా అత్తామామలకు నేను బయటికి వెళ్లడం ఇష్టం ఉండదు. నాకేమో ఏదో ఓ వ్యాపారం చేయాలని కోరిక. వాళ్లను కష్టపెట్టకుండా, నేనూ రాజీ పడకుండా ఈ మార్గాన్ని ఎంచుకున్నా’ అంటారామె. ‘వెన్స్డే షాపింగ్ లైవ్’లో భాగంగా అంకిత వారానికి ఒక ఆంత్రప్రెన్యూర్నే ఎంచుకుంటారు. స్పందన బాగానే ఉంటున్నది. ‘తోటి మహిళలకు సాయపడటంలోని ఆనందాన్ని మాటల్లో చెప్పలేను’ అని సంబురంగా చెబుతారు అంకిత. నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తున్నా సరైన మార్కెటింగ్ లేకపోవడంతో మార్కెట్లో వెనుకబడిపోతున్నవారికి తన వంతు సాయం అందించాలన్నదే అంకిత ఆలోచన.