కవి ఎవరైనా సినిమాల్లో చాలాసార్లు దర్శకులు, నిర్మాతలు చెప్పినట్టు సంగీత స్వరాలకు అనుగుణంగా గీతాలు రాయాల్సివస్తుంది. దర్శకులు సూచించిన ఆ సందర్భానికి కవి అంతకు మిన్నగా రాయగలిగినా కథాగమనం, ఇతరత్రా అంశాల దృష్ట్యా దర్శకుని మాటను మన్నించక తప్పదు. అయితే వీటికి అతీతంగా కొన్నిసార్లు కవికి నచ్చినట్టు రాసే అవకాశం కూడా కలుగుతుంది. అటువంటి సమయంలో కవులు తమ విశ్వరూపాన్ని చూపించిన సందర్భాలు కూడా లేకపోలేదు. అలాంటి చక్కని సందర్భమే కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన “చెల్లెలి కాపురం” సినిమా సమయంలో లభించింది.
అలా పురుడుపోసుకున్నదే ‘చరణకింకిణులు ఘల్లుఘల్లుమన’ గీతం. కథా నాయకుడు రాము (శోభన్ బాబు) కవి, తన నలుపు రంగు కారణంగా నూన్యతాభావంతో ఉంటాడు. తన చెల్లెలి పెళ్లి కోసం డబ్బు అవసరం అవుతుంది. అందుకోసం తన కవితలను మిత్రుడు శ్రీరామ్ (నాగభూషణం) పేరుతో ప్రచురిస్తాడు. ఈ కవితలకు సంపన్న యువతి అయిన వాణిశ్రీ ఆకర్షితురాలై, అభిమానిగా మారుతుంది. చివరకు కవి శ్రీరామ్ కాదని, రామ్ అని తెలుసుకుంటుంది. ఇదీ స్థూలంగా చిత్ర కథ. ‘చెల్లెలి కాపురం’ చిత్రం గురించి సినారె ప్రస్తావిస్తూ “కథా నాయకుడు ఓ కవి లేక సంగీత విద్వాంసుడైతే, కథా నాయిక నర్తకి అయితే, నాయికా నాయకులిరువురూ కళా ప్రవీణులైతే, గేయ రచయిత భావ పరిధి, విస్తరిస్తుంది. భాషాస్థాయి వికసిస్తుంది. వర్ణవైదుష్యం వెల్లివిరుస్తుంది” అన్న ఆయన మాటలకు ప్రత్యక్షర సాక్ష్యం ఈ గీతం.
పల్లవి:
చరణకింకిణులు ఘల్లుఘల్లుమన
కరకంకణములు గలగలలాడగ
అడుగులందు కలహంసలాడగా
నడుములో తరంగమ్ములూగగా
వినీల కచభర విలాసబంధుర
తనూలతిక చంచలించిపోగా
ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ
నీ కులుకునుగని నా పలుకు విరియ
నీ నటనను గని నవ కవిత వెలయగా
ఆడవే మయూరి
ఇక పై గీతం విషయానికివస్తే శ్రీరామ్ ఆటకట్టించాలనుకున్న నాయిక తన నర్తనానికి తగినట్టుగా ఆశువుగా కవిత చెప్పి మెప్పించమని సవాలు విసిరింది. దొంగకవి ‘కాళ్లు గజ్జెలు’ అంటూ నసిగి అవమానంతో దిగిపోతాడు. కవి గౌరవం నిలబెట్టేందుకు వేదిక కింద నుంచి మన కథానాయకుడు వస్తాడు. కథానాయిక నృత్యగమనానికి, కాలి అందెల విన్యాసానికి తగినట్టుగా ‘చరణకింకిణులు ఘల్లుఘల్లుమన / కరకంకణములు గలగలలాడగ’ అంటూ పాడుతాడు. కవి సినారె ఈ గీతంలో నాయిక నర్తనానికి, శరీర భంగిమలకు అక్షర చిత్రంగా రాశారంటారు విమర్శకులు. నిజానికి ఆడేది మగ నెమలి. కానీ ఇక్కడ ‘నాట్య మయూరి’ నాట్యమాడుతున్నది. నాట్యానికి, స్త్రీత్వానికీ ఉన్న అవినాభావ సంబంధం దృష్ట్యా తాను స్త్రీ వాచకం ప్రయోగించాను అంటారు సినారె.
చరణం:
అది యమునాసుందర తీరము
అది రమణీయ బృందావనము
అది విరిసిన పున్నమి వెన్నెల
అది వీచిన తెమ్మెర ఊయెల
అది చల్లని సైకత వేదిక
అట సాగెను విరహిణి రాధిక
అది రాధ మనసులో మాధవుడూదిన
రసమయమురళీ గీతిక
ఆడవే మయూరీ-నటనమాడవే మయూరీ
నా పలుకుల కెనయగు కులుకు చూపి
నా కవితకు సరియగు నటన చూపి
ఇక – ఆడవే మయూరి
మొదటి చరణంలో విరహిణి రాధిక భావావస్థలను కవి పొందుపరిచారు. కాగా తరువాతి చరణంలోని సంస్కృత సమాసాలు గీతాన్ని మరింత విలక్షణంగా తీర్చిదిద్దాయని చెప్పవచ్చు. చూడండి
చరణం:
ఫాలనేత్ర సంప్రభవత్ జ్వాలలు
ప్రసవ శరుని దహియించగా
పతినికోలుపడి రతీదేవి
దుఃఖితమతియై రోదించగా
హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్
ప్రమధ గణము కనిపించగా
ప్రమధనాథకర పంకజ భాంకృత
డమరుధ్వని వినిపించగా
ప్రళయకాల సంకలిత భయంకర
జలధరార్భటుల-చలితదిక్తటుల-చకితధిక్కరుల వికృత ఘీంకృతుల- సహస్రఫణ సంజనిత ఫూత్కృతుల
అంటూ ఫ్రౌఢంగా సాగుతుంది. రాయడం కష్టం కానీ చిత్రంలో ఈ గీత సన్నివేశాన్ని చూస్తే చిత్రించిన తీరుతో పాటు ఇటు కవి నటన, అటు నర్తకి నాట్యం అద్భుత సాహిత్య కళా దృశ్యాకృతిగా ఉంటుంది. చివరి చరణం మరింత అందంగా ఉంటుంది. పరవళ్లు తొక్కే జలపాత సదృశ స్థితి నుంచి అందంగా, మంద్రంగా సాగే నదిలా మారిపోతుంది గీతం. కారణం.. ఈ చరణం ‘ఓజో గుణప్రవాహం’తో సాగిపోవడమే.
కనులలోన కనుబొమలలోన
అధరమ్ములోన వదనమ్ములోన
గళసీమలోన కటిసీమలోన
కరయుగములోన పదయుగములోన
నీ తనువు లోని అణువణువులోన
అనంతవిధముల అభినయించి ఇక
ఆడవే ఆడవే ఆడవే
కవి ఒక్కో అంగాన్ని పేర్కొంటూ పాడుతున్నప్పుడు నాయిక అందుకు అనుగుణంగా తన నర్తనను ఆయా అంగాల విన్యాసంతో చేస్తుంది. కవి నోటి నుంచి వచ్చిన ప్రతి పదానికి అంతే దీటుగా నర్తిస్తుంది. చివరికి అందుకోలేక కొద్దిగా తడబడి, పట్టుతప్పి పడిపోతుంది. అన్ని సినిమాల్లోలాగే అటు తరువాత కథ సుఖాంతం అవుతుంది. ‘దర్శకుడు ఈ సన్నివేశం వివరించినప్పుడు నాలోని ‘కవి’ నిలువెత్తు పొంగిపోయాడు. సృజన పౌరుషం శిరసెత్తి ఆడింది’ అని కవి ఉవాచ. సంగీత దర్శకులు కె.వి. మహాదేవన్ తొలుత ఈ గీతంలోని ప్రౌఢ సమాసాల ఉచ్చారణ వినడం కోసం స్వయంగా కవి సినారెతో పాడించి రికార్డు చేసుకున్నారట. అదే శబ్దోచ్ఛారణతో తరువాత ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యంతో ఈ గీతాన్ని పాడించారు.
…? పత్తిపాక మోహన్