పిల్లికూనల్ని పిల్లలంత ఇష్టపడే వాళ్లు చాలా మందే ఉంటారు. సబ్బులు రుద్దీ, స్నానాలు చేయించీ, బొచ్చు దువ్వీ ముచ్చటపడుతుంటారు. ఏ బురద కారణంగానో వాటి కాళ్ల ముద్రలు ఇంట్లో పడ్డా ముద్దుగా చూస్తారే తప్ప విసుక్కోరు. జంతు ప్రేమికులు ఇష్టపడే ఆ ముచ్చటైన కాలి ముద్రలను వేళ్ల మీద పడేలా చేస్తున్నది ‘క్యాట్ పా రింగ్’.
పిల్లి రెండు కాళ్లతో వేలిని చుట్టినట్టు ఉండే ఈ ఉంగరాన్ని పెట్టుకుంటే, వేలి మీద దాని కాళ్ల అచ్చులు పడతాయి. లోపలివైపు పిల్లి పాదాల తరహాలో ఉబ్బెత్తు అమరిక ఉండటమే దీనికి కారణం. ఇవి పెట్టుకున్నప్పుడు బుల్లి బుల్లి పిల్లి పాదాల ముద్రలు తమ వేళ్ల మీద పడటాన్ని మురిపెంగా చూసుకుంటున్నారు క్యాట్ లవర్స్. వాటి మీద తమ ఇష్టాన్ని చాటుకునేందుకు కొత్త మార్గం దొరికిందని సంబురపడుతున్నారు.