Marble Tea Pot | నూరిన పచ్చడి తీసి పెట్టాలన్నా, పులుసు కాచిపెట్టాలన్నా ఒకప్పుడు రాతిచిప్ప ఉండేది. గల్లుప్పు ఇల్లూ అదే. ఈ తరం మరిచిపోయిన ఆ రాతి వస్తువు తరహాలోనే క్రిస్టల్, మార్బుల్ టీ పాట్ సెట్లు వస్తున్నాయిప్పుడు. రకరకాల రాళ్లతో చేసిన ఇవి రంగుల్లో, ఆకర్షణీయంగా కనిపించడమే కాదు… ఘనంగా రాజసాన్నీ ఒలకబోస్తున్నాయి. వీటిలో టీ తాగడం మనసుకు ఉత్సాహాన్నే కాదు, సాంత్వననీ ఇస్తుందని నమ్మేవాళ్లూ ఉన్నారు. ఆ సంగతులేంటో మనమూ చూద్దాం…
కొత్తతరం ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటూనే ఉంటుంది. అయితే నేల విడిచి సాము చేయకుండా, పాత కొత్తల మేళవింపుగా ముందుకు వెళ్లడం అన్నది ఇంటీరియర్ నుంచి ఇంట్లో వస్తువుల దాకా అన్నింటా ట్రెండుగా మారింది. ఆ కోవలోనే క్రిస్టల్, మార్బుల్ టీ పాట్ సెట్లని చెప్పుకోవచ్చు. సహజ రాళ్లతో తయారైన ఇవి మామూలు పింగాణీ కప్పులతో పోలిస్తే చూసేందుకు భిన్నంగా, అందంగా కనిపిస్తాయి.
Cups
రంగుకో రాయి…
నేలలో దొరికే విభిన్న రంగుల రాళ్లూ, ఉపరత్నాలతో ఈ టీ పాట్లు, కప్పు సాసర్ సెట్లను తయారు చేస్తున్నారు. తెలుపు, లేత గులాబీ మొదలు నారింజ, నీలంలాంటి నిండైన రంగుల దాకా ఉంటున్నాయిందులో. రాయి అంతా గీతలు ఉన్నట్టు కనిపించి, వివిధ వర్ణాల్లో దొరికే ఒక రకం సహజ రాయి ఆనిక్స్ కూడా ఈ కోవలో ఉంది. అంతేకాదు, క్వార్ట్ క్రిస్టళ్లతోనూ, గ్రీన్ మార్బుల్తోనూ కూడా ఈ టీ సెట్లను తయారు చేస్తున్నారు. ఉపరత్నాల జాతికి చెందిన అగేట్, అమెథిస్ట్, లాపిస్లాజులి, జేడ్లాంటి ఖరీదైన రాళ్లనూ వీటిని రూపొందించడానికి వినియోగిస్తున్నారు.
ఒకప్పుడు రాజులు తమ పాత్రల కోసం వాడే, సంపదకు చిహ్నమైన అంబర్కూడా వీటిలో ఉంది. ఇక, పాత రాతిచిప్పలో వండినవి ఆరోగ్యాన్నిస్తాయని నమ్మితే, రకరకాల రాళ్లతో చేసిన ఈటీ కప్పులకు శారీరక మానసిక బలాన్ని చేకూర్చే శక్తులున్నాయని కొందరు విశ్వసిస్తున్నారు. నాచురల్ హీలింగ్ జెమ్‌స్టోన్ క్రిస్టల్ కప్‌లుగా పిలిచే ఇవి, సానుకూల ఆలోచనలను కలిగించి మానసిక సాంత్వన చేకూర్చడంతో పాటు ఆరోగ్యాన్నీ, అదృష్టాన్నీ అందిస్తాయని అంటారు. ఫెంగ్ షుయ్ప్రకారం గ్రీన్ మార్బుల్ సంపదకు, ప్రశాంతతకు ప్రతిరూపమట.
ఈ టీ పాట్ సెట్ల అలంకరణకు మెరిసే ఖరీదైన రాళ్లతో పాటు ఇత్తడి, వెండి, బంగారంలాంటి లోహాలనూ వాడుతున్నారు. వీటిని ఏ మెటీరియల్‌తో చేశారు… వాటి అలంకరణకు ఏం వాడారు అన్నదాన్ని బట్టి వేల నుంచి లక్షల రూపాయల దాకా ఖరీదు చేస్తున్నాయి. మనం తాగేందుకే కాదు, బహుమతిగా ఇచ్చేందుకూ సూపర్‌గా సూటయ్యే వీటిని చూస్తుంటే… మీకూ ఓ సిప్ వేయాలనిపిస్తోంది కదూ!