పురుషులతో పోలిస్తే.. మహిళల్లో మైగ్రేన్ ఎక్కువగా వస్తుందట. అయితే, ఆడవాళ్లలో వచ్చే ఈ పార్వపు నొప్పిని చాలాసార్లు తప్పుగా నిర్ధారణ చేస్తున్నారట. కేవలం ఒత్తిడిగానే పరిగణిస్తూ.. యాంటి డిప్రెసెంట్స్‌ను సూచిస్తున్నారట. ‘ది లాన్సెట్ న్యూరాలజీ’లో ప్రచురితమైన ఓ అధ్యయనం ఇదే విషయాన్ని చెబుతున్నది. మహిళల్లో మైగ్రేన్ అధికంగా రావడానికి గల కారణాలు, నొప్పిని తగ్గించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించింది. మహిళల్లో మైగ్రేన్‌కు ప్రధాన కారకాల్లో ఒకటి హార్మోన్లు. అందులోనూ ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయులలో హెచ్చుతగ్గుల వల్ల వారిలో తలనొప్పి వేధిస్తుందట.
చాలామందిలో రుతుస్రావానికి ముందు విపరీతమైన మైగ్రేన్ ఇబ్బందిపెడుతుందట. ఇక గర్భధారణ, పెరిమెనోపాజ్, మెనోపాజ్ సమయంలోనూ తీవ్రత ఎక్కువగా ఉంటుందని సదరు అధ్యయనం వెల్లడించింది. ఒత్తిడి, నిద్రలేమి, ఆహారంతోపాటు జన్యుపరమైన కారణాల వల్ల కూడా మైగ్రేన్ వస్తుంది. ఈ తరహా మైగ్రేన్ 18 నుంచి 40 ఏళ్ల వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మానసిక ఒత్తిడి, అధిక శ్రమ, ఎక్కువ వెలుతురుకు గురవడం, నెలసరిలో తేడాలు, గర్భ నిరోధక మాత్రలు వాడటం, మత్తుపానీయాలతోపాటు ధూమపానం అలవాట్లు ఉన్నవారిని మరింత ఇబ్బందిపెడుతుంది.
ఇక జనాభాలో సుమారు 10 శాతం మంది మైగ్రేన్‌కు గురవుతున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది కూడా. జీవనశైలిలో మార్పుల ద్వారా మైగ్రేన్ నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, తగినంత నిద్రపోవడం, ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడంతోపాటు బరువును నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా తలనొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు.
నిత్య జీవితంలో ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళనలు తట్టుకునేందుకు యోగ, ధ్యానం లాంటివి ఆచరించాలి. తక్కువ మొత్తంలో కెఫిన్ తీసుకోవడం ద్వారా.. ప్రారంభ దశలోని మైగ్రేన్ నుంచి ఉపశమనం పొందొచ్చు. నొప్పి ఎక్కువగా ఉన్నప్పడు తల, మెడకు వేడి లేదా చల్లని కంప్రెస్లను వాడుకోవచ్చు. చీకటిగా, నిశ్శబ్దంగా ఉన్న గదిలో విశ్రాంతి తీసుకున్నా.. నొప్పి తగ్గుముఖం పడుతుంది.