ఇంటర్వ్యూల్లో క్యాండిడేట్స్ గురించి ముందే తెలుసుకునేందుకు రెజ్యూమె, సీవీలు అడుగుతుంటాయి కంపెనీలు. అయితే, కొన్ని జాబ్ పోస్టింగ్‌లలో రెజ్యూమె అడుగుతున్నారో.. సీవీ పంపమంటున్నారో అర్థం కాదు. దీంతో కొందరికి రెండూ పంపాలని అనిపిస్తుంది. రెండూ మీ వృత్తిపరమైన చరిత్రను చెప్పేవే అయినా.. వాటిని చూసే విధానం, ఉద్దేశం వేరుగా ఉంటుంది. ఈ తేడా తెలియకపోతే, మీ ప్రొఫైల్ అన్‌ప్రొఫెషనల్‌గా అనిపించవచ్చు. అందుకే ఏ డాక్యుమెంట్ ఎంచుకోవాలిఅనేదానిపై క్లారిటీ తెచ్చుకుందాం.

ఇదో క్విక్ స్నాప్‌షాట్. చాలా చిన్నది. మరింత అర్థమయ్యేలా చెప్పాలంటే ఫోకస్డ్ డాక్యుమెంట్. కంపెనీలకు మీ గురించి.. అంటే మీరు ఏం చేయగలరు, మీకు ఎంత అనుభవం ఉందో త్వరగా తెలుసుకోవడానికి ఇది సాయపడుతుంది.
పరిమాణం: సాధారణంగా ఒకటి లేదా రెండు పేజీలకే పరిమితం అవుతుంది.
ఫోకస్: మీరే ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నారో దానికి తగ్గట్టుగా రెజ్యుమె ఉండాలి. అంటే.. జాబ్ టార్గెట్‌గా అన్నమాట. దీనిలో మీ కాంటాక్ట్ వివరాలు, కెరీర్ లక్ష్యం, ఉద్యోగ అనుభవం, నైపుణ్యాలు మాత్రమే ఇందులో పొందుపరచాలి.
ఎప్పుడు వాడాలి?: రెజ్యూమెను ఎక్కువగా కార్పొరేట్ ఉద్యోగాలు, పరిశ్రమలకు సంబంధించిన ఉద్యోగాలకు వాడతారు.
గుర్తుంచుకోండి: రెజ్యూమె ఉద్యోగానికి తగ్గట్టుగా మార్చాలి. అంటే మీరు ఐప్లె చేసే జాబ్‌కు ఏ నైపుణ్యం అవసరమో, దాన్ని హైలైట్ చేయాలి.

కరికులమ్ వీటా ఫుల్ లైఫ్ రికార్డ్ లాంటిది. అంటారు. ఇది మీ అకడమిక్, వృత్తిపరమైన ప్రయాణం గురించి వివరంగా చెబుతుంది.
పరిమాణం: ఇది మీ అనుభవం ఆధారంగా చాలా పేజీలు ఉండొచ్చు.
ఫోకస్: సీవీలో విద్యకి సంబంధించిన చరిత్ర (ఎడ్యుకేషన్) మొదట వస్తుంది. ఇందులో మీ పరిశోధనలు, అవార్డులు, ప్రచురణలు, వృత్తిపరమైన సంస్థలలోని సభ్యత్వాలు.. లాంటి ప్రతీ అకడమిక్ విజయాన్ని జత చేయొచ్చు.
ఎప్పుడు వాడాలి?: సీవీలను ముఖ్యంగా అకడమిక్ ఉద్యోగాలు, పరిశోధన, టీచింగ్, ఫెలోషిప్‌లు లాంటివాటికి అప్లయ్ చేసినప్పుడు వాడతారు.
ముఖ్యమైన తేడా: సీవీ సమయం గడిచే కొద్దీ అప్డేట్ అవుతుంది కానీ, ఉద్యోగాన్ని బట్టి దాని నిర్మాణం మారదు.
చాలా దేశాల్లో, ముఖ్యంగా ఇండియాలో రెజ్యూమె, సీవీ అనే పదాలను ఒకే అర్థంలో వాడుతుంటారు. అందుకే కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే.. రీసెర్చ్, టీచింగ్ (అకడమిక్) అయితే సీవీ ఎంచుకోవాలి. కార్పొరేట్, ఐటీ, మార్కెటింగ్ (ఇండస్ట్రీ) అయితే రెజ్యూమె పిక్ చేసుకోండి.
కంపెనీకి మీ ఫైల్ రెండు నిమిషాల్లో మొత్తం అర్థం కావాలి. అందుకే రెజ్యూమెను షార్ట్ అండ్ స్వీట్‌గా తయారు చేయండి. ఎక్కువగా ఉన్నది కట్ చేసి, ఆ జాబ్‌కు సరిపోయే అనుభవాన్ని మాత్రమే హైలైట్ చేయండి. రెజ్యూమె అనేది ఇండస్ట్రీకి మీరు పంపే ఫస్ట్ అటెన్షన్ గ్రాబర్. సీవీ అనేది మీ మొత్తం కెరీర్ జర్నీని తెలిపే డైరీ. సరైన డాక్యుమెంట్ ఎంచుకుని, బాస్ మైండ్‌లో ఫస్ట్ ఇంప్రెషన్ కొట్టేయండి!