ఒత్తిడి, అపసవ్య జీవనశైలితో జుట్టు బలహీనం అవుతున్నది. వెంట్రుకలు రాలడం, చుండ్రు, దురద సర్వసాధారణమై పోతున్నది. దీంతో రసాయనాలు ఎక్కువగా ఉండే షాంపూలు, కండిషనర్లను వాడటం వల్ల సమస్య మరింత తీవ్రం అవుతుంటుంది. స్కాల్ప్ ఇన్ఫెక్షన్లకూ దారి తీస్తుంది. ఈ క్రమంలో ఇంట్లో ఉండే కొబ్బరి నూనె-కర్పూరం.. కురుల సమస్యలకు పరిష్కారం చూపుతున్నది.
కొబ్బరి నూనెలో విటమిన్ ఇ, లారిక్ యాసిడ్తోపాటు కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి జుట్టు మూలాలకు పోషణ అందిస్తాయి. దాంతో కురులకు బలం చేకూరి, జుట్టు రాలడం తగ్గుతుంది. కర్పూరంలో యాంటి బ్యాక్టీరియల్, యాంటి ఫంగల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి మాడు ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. ఫంగస్ సమస్యనూ దూరం చేస్తాయి. కర్పూరంలో ఉండే సుగుణాలు మాడులో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.
కర్పూరాన్ని కరిగించి, కొబ్బరి నూనెలో కలిపి తలకు పట్టించడం వల్ల.. జుట్టుకు కొత్తజీవం వస్తుంది. జుట్టు రాలడం తగ్గి.. కొత్త జుట్టు పెరుగుతుంది. కర్పూరాన్ని వేడి నీళ్లలో కరిగించి కొబ్బరినూనెతో కలిపి తలపై మర్దనా చేయడం వల్ల.. జుట్టు చల్లబడుతుంది. స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. తరచూ ఇలా చేయడం వల్ల మాడు శుభ్రంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. జుట్టు సమస్యలూ దూరమవుతాయి.