శాస్త్రీయ నృత్యం రంగమంటపంపై రంజిల్లాలంటే.. ఆంగికం కట్టిపడేయాలి. ఆహార్యం ఆకట్టుకోవాలి. నాట్యకళాకారిణి మనసు తాదాత్మ్యం చెందాలి. అప్పుడే ఆ నృత్యం రసికుల హృదయాలపై ఆనంద తాండవం చేస్తుంది. శాస్త్రీయ నృత్యరీతులకు పట్టుగొమ్మ భారతావనిలో లాస్య విన్యాసాలు యథాలాపంగా ఆవిష్కృతం అవుతాయి. ఎల్లలు దాటిన మన కళాకారులు ఎందరో తమ అభినయ వేదంతో విదేశీయుల మనసులు కొల్లగొట్టిన సందర్భాలూ ఉన్నాయి! భారతావనికి వచ్చి.. శాస్త్రీయ నృత్యరీతుల్ని ఉపాసించిన విదేశీయులు ఉన్నారు. అయితే, చైనాలో పుట్టిపెరిగిన చిన్నది, అక్కడే గజ్జెకట్టి, భరతనాట్యంలో పట్టు సాధించి.. చైనా గడ్డపై అరంగేట్రం చేసిన తొలి నర్తకిగా కీర్తి గడించింది మాత్రం లీ ముజి. ఈ పదమూడేండ్ల చిన్నారి ఇప్పుడు సోషల్ మీడియా సెలెబ్రిటీ. ఇండో చైనా సంస్కృతులకు వారధి.
ఆదివారం.. బీజింగ్ నగరంలో ఓ నాట్యమండపం. డ్రాగన్ నృత్యాల దరువుకు అదిరిపడే ఆ వేదికకు కొత్త అనుభూతి! మెత్తటి పాదాలు సుతిమెత్తగా తాకుతున్నాయి. కృష్ణుడి పాదాలు మోదుతున్నప్పుడు పులకించిన కాళీయుడిలా తన్మయానికి లోనైంది ఆ చైనా తలం. ఆ పారవశ్యంలో ఓ పాదాన్ని హత్తుకునే లోపే.. మరోపాదం మరింత మత్తుగా తాకుతున్నది. పాదరసంలా కదులుతున్న ఆమె అడుగులకు మడుగులొత్తడం ప్రారంభించింది ఆ నాట్యవేదిక. మువ్వల మురళి వంతపాడుతూ పరవశించింది. ఘల్ ఘల్ అని ఒకసారి.. ఝణఝణ అంటూ మరోసారి! అందెల రవళితో పందెం వేసుకుందేమో… అంబరాన్నంటేలా నాట్యం చేస్తున్నది లీ ముజి. ఆమె నాట్యానికి భారతీయం సరిహద్దులు చెరిపి.. చైనా రాజధాని బీజింగ్ దాకా దూసుకెళ్లింది.
ఎటుచూసినా చీమ కండ్లేసుకున్న చీనీయులే! అక్కడక్కడా భారతీయులు. వారంతా ప్రత్యేక ఆహ్వానితులు. భరతనాట్యంలో దిట్ట అనిపించుకున్న లీలా శాంసన్ ఒకవైపు, చైనాలో భారత రాయబార కార్యాలయం ప్రతినిధులు మరోవైపు. వీరందరికీ లీ ముజిని పరిచయం చేసింది ఆమె గురువు జిన్ షాన్షాన్. చీనాంబరాలు కట్టుకున్న చీమకండ్ల చిట్టితల్లికి ఆంగిక అభినయాలు దగ్గరుండి నేర్పించింది ఆవిడే! తన శిష్యురాలు నాట్య విన్యాసాన్ని చూసి పులకించిపోయింది.
ప్రసార మాధ్యమాలు హోరెత్తుతున్న ఈ రోజుల్లో.. సామాజిక మాధ్యమాలు విజృంభిస్తున్న నేటి యుగంలో లీ గజ్జెకట్టిన గంటల్లోనే ఆ నాట్య విన్యాసాలు అంతటా వింతగొలిపాయి. కానీ, ఇప్పటికి 34 ఏండ్ల కిందట 1990లో జిన్ షాన్షాన్ భారత్‌లో అడుగుపెట్టింది. చైనాలోని పెకింగ్ విశ్వవిద్యాలయంలో పొందిన ఉపకార వేతనాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చింది. భరతనాట్య కళాకారిణి, నాట్యగురువు లీలా శాంసన్ తలుపు తట్టింది. తనకు నాట్యం నేర్పించమని అభ్యర్థించింది. కుదరదన్నారు గురువు. నిరాశగా వెనుదిరిగింది. నెల తిరగకుండానే మళ్లీ వచ్చింది. నాట్యం నేర్పమని కోరింది. ఈసారీ అవకాశం లేదన్నారు లీలా శాంసన్. మళ్లీ వెనక్కి వెళ్లింది. నెల తిరక్కుండానే మొండిగా వెనక్కి వచ్చింది. ‘మీ శిష్యురాలిగా స్వీకరించమ’ని అడిగింది. జిన్ షాన్ తపన గురువుకు నచ్చింది. తన శిష్యబృందంలో ఈ చైనా అమ్మాయికి చోటిచ్చింది. శిక్షణ మొదలైంది. జిన్ ఉత్సాహం చూసి లీలా శాంసన్‌కు ముచ్చటేసింది. మొదట్లో భాష రాకున్నా.. భావాన్ని ఇట్టే పసిగట్టేది. చిట్టి కండ్లతోనే చక్కటి అభినయాన్ని ప్రదర్శించే ఆమె వైనాన్ని చూసి అబ్బురపడ్డారు గురువు. దాదాపు ఎనిమిదిన్నరేండ్ల సాధన. అడపాదడపా స్వదేశానికి వెళ్లి వస్తుండేది. చివరికి 1999లో లీలా శాంసన్ ఆధ్వర్యంలో దిల్లీలో అరంగేట్రం చేసింది జిన్. ఓ చైనా అమ్మాయి భరతనాట్య ప్రదర్శన అప్పట్లో అద్భుతం.
ఒక్కసారి మువ్వలతో జతకట్టిన పాదాలు ఊరికే ఉంటాయా. సొంతూరుకు వెళ్తూ జిన్ భారతీయాన్ని తన వెంటే తీసుకువెళ్లింది. చైనా చేరాక ఆమె ప్రదర్శనలకే పరిమితం కాలేదు. గురువుగా అవతారం ఎత్తింది. తన ఇంట్లోనే అక్కడి చిన్నారులకు నాట్యకళ నేర్పించడం పనిగా పెట్టుకుంది. ఎందరికో నేర్పింది. కొందరు ఆటవిడుపుగా నేర్చుకున్నారు. ఇంకొందరు మధ్యలోనే ఆగిపోయారు. తన కూతురుకు కూడా భరతనాట్యం నేర్పింది. ఈ శిష్యబృందం నుంచి వచ్చిందే లీ ముజి. జిన్‌కు వచ్చిన విద్యనంతా ఆమె ఒడిసిపట్టింది. ఒకటి రెండు సంవత్సరాల్లో పైపైన సాధన చేసి… కిందామీదా పడుతూ ఓ ప్రదర్శన ఇచ్చేసి అరంగేట్రం అనిపించుకోలేదు! పదేండ్లు పరిశ్రమించింది. ప్రతీ వారాంతం రెండు రోజులు గురువు ఇంటికి వెళ్లేది. గంటల కొద్దీ నాట్యం నేర్చుకునేది. మళ్లీ వారానికి వచ్చినప్పుడు.. అంతకుముందు నేర్చుకున్న విద్యనంతా అద్భుతంగా ప్రదర్శించేది. ఇలా భారతంలో ఒడిసిపట్టిన విద్యనంతా చైనాలో తన శిష్యుల పరం చేసింది జిన్ షాన్. లీ ముజి అరంగేట్రంతోనే ప్రపంచాన్ని ఆకట్టుకుంది. లీ మాత్రమే కాదు… మువ్వల కాళ్లతో ముచ్చటగొలుపుతున్న చీనా చిన్నారులు మరెందరో ఉన్నారు. వాళ్లంతా ఆరితేరిన రోజు.. చైనా గోడపై మన అందెలు విందు చేయడం ఖాయం!!
లీ ముజి గురువు జిన్ షాన్ మరో గురువు చైనాలో లబ్ధప్రతిష్ఠురాలైన నాట్యకారిణి ఝాంగ్ జున్. 1950 ప్రాంతంలో భారత్‌కు వచ్చిన ఝాంగ్.. ఇక్కడి శాస్త్రీయ నాట్యాన్ని చూసి ముగ్ధురాలైంది. ఏడు పర్యాయాలు భారత్‌కు వచ్చి.. రకరకాల నృత్యరీతులను ఆకళింపు చేసుకున్నది. బిర్జూ మహారాజ్ శిష్యరికంలో కథక్‌లో ఓనమాలు దిద్దింది. చెన్నైలో కొంతకాలం ఉండి భరతనాట్యం అభ్యసించింది. కథాకళిలోనూ ప్రవేశించింది. చైనాలో ఎందరికో శాస్త్రీయ నాట్యం నేర్పింది. 2012లో ఝాంగ్ కాలం చేసింది. ఆమె శిష్యురాలిగా భరతనాట్యంపై పట్టు సాధించిన జిన్.. తన గురువు బాటలోనే పయనిస్తున్నది. జిన్ శిష్యురాలు లీ.. మరో తరానికి భారతీయ కళను చేరువ చేస్తుందనడంలో సందేహం లేదు.