అక్కకు అయిదో తరగతి నుంచీ ఇంటర్ వరకూ క్లాస్మేట్ అయిన ఇంద్రాణితోపాటు ఇంటర్లో క్లాస్మేట్స్ అయిన సరోజక్క, విజయ కూడా చాలా దగ్గరయ్యారు. వాళ్లు నలుగురూ ప్రాణ స్నేహితులే కాదు, నన్నూ ఆ గ్రూపులో చేర్చుకున్నారు. ఇప్పటికీ ఆ స్నేహబంధం అలాగే కొనసాగుతూ ఉంది.
అక్కకు ఇంటర్ చదివేటప్పుడు సంధ్య, ఉష అని మరో ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్లు. సంధ్యతో ఇప్పటికీ ఫోన్లో మాట్లాడుతూ, అప్పుడప్పుడూ కలుస్తూ ఉంటుంది. ఇక 1978-79 ప్రాంతంలో అనుకుంటా.. ఉష వాళ్ల నాన్న బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా (ఇప్పుడు ఎంపీడీవో అంటున్నారు) మా ఘన్‌పూర్‌కి వచ్చారు. మా ఇంటి దగ్గరలో ఒక మంచి ఇల్లు ఉండేది. అన్నీ ఇళ్లూ మామూలుగా అగ్గిపెట్టెల్లా వరుసగా మూడు గదులుంటే, ఈ ఇల్లు మాత్రం ఓ హాల్, రెండు బెడ్రూమ్లు, కిచెన్‌తో కొంచెం ఉన్నదాంట్లో మోడరన్‌గా ఉండేది. ఏ బీడీవో వచ్చినా కుటుంబంతో సహా ఆ ఇంట్లోనే ఉండేవారు. అలా ఉష వాళ్ల నాన్న హనుమంతరెడ్డి గారు బీడీవోగా రావడంతో మళ్లీ వాళ్లు మాకు దగ్గరయ్యారు.
మొదట్లో మా చిన్నప్పుడు రాజా అనే బీడీవో ఉన్నప్పుడు వాళ్ల పిల్లలు అనిత, సునీతలతో మేము బాగా ఆడుకునేవాళ్లం. తర్వాత నా క్లాస్మేట్ గోపీధర్ వాళ్ల నాన్న మధుసూదన స్వామి గారు ఉన్నప్పుడు వాళ్ల కుటుంబం చాలా దగ్గరయ్యింది. వాళ్లమ్మాయి మనుజతో బోలెడు ఆటలు, ముచ్చట్లు ఉండేవి. ఇప్పటికీ గోపీధర్ నాకు మంచి స్నేహితుడు. ఆ తర్వాత హనుమంతరెడ్డి గారు కుటుంబంతో సహా అదే ఇంట్లో వచ్చి ఉన్నారు. ఉషాకి అప్పటికే పెళ్లయింది. ఆమె భర్తది జడ్చర్ల అనుకుంటా! వేణుగోపాల్ రెడ్డి ఆయన పేరు. మేము వేణన్నయ్య అనేవాళ్లం. ఎందుకో మరి అప్పట్లో స్నేహితుల భర్తల్ని అన్నయ్య అనేవారందరూ. ఉషకు చెల్లెలు గీత, తమ్ముడు జయపాల్ ఉండేవారు. జయపాల్ నిక్కర్లేసుకుని చిన్నగా ఉండేవాడు. గీతది నా వయసే కానీ, మరీ చిన్నగా, పీలగా వుండేది. మా అక్కను సరే… నన్ను కూడా అక్కా అనే పిలిచేది.
ఉష, వేణన్నయ్య ఎప్పుడు ఘన్పూర్ వచ్చినా ఆ రోజే సాయంత్రానికి మా ఇంటికి తప్పకుండా వచ్చేవారు. వాళ్లిద్దరూ కలిసి ఇక్కడున్నన్ని రోజులు ప్రతిరోజూ మా ఇంటికి వచ్చి గంటో రెండు గంటలో గడిపి ఒక్కోసారి సాయంత్రం డిన్నర్ కూడా చేసి వెళ్లేవారు. వేణన్నయ్యకు కబుర్లు చెప్పటం బాగా అలవాటు. ఎక్కువగా జోక్స్ చెప్పి నవ్వించేవాడు. ఆయనకు కొత్త పాత లేదు. మా నాన్నతో వ్యవసాయం గురించి మాట్లాడేవాడు, నానమ్మతో ఏదో కబుర్లు చెప్పేవాడు. మాతో అయితే సినిమాల గురించీ, పుస్తకాల గురించీ, వాళ్ల స్నేహితుల గురించీ తమాషా సంఘటనల గురించీ చెప్పి చెప్పి నవ్వించేవాడు. ఉష ఎక్కువగా మాట్లాడేది కాదు. కానీ, ఆయన ఉష మీద కూడా జోకులేసేవాడు. మాకు వేణన్నయ్య వస్తున్నాడు అంటే బాగా సంబురంగా ఉండేది. మమ్మల్ని అమ్మా, అమ్మా అని సంబోధించేవాడు. తెల్ల పైజామా, లాల్చి, స్లిప్పర్లు వేసుకొని మెల్లగా జేబుల్లో చేతులు పెట్టుకొని నడుస్తూ ఉషను తీసుకుని మా ఇంటికి వచ్చేవారు. మాకు మగ కజిన్స్ ఉన్నా, వాళ్లతో చనువు కూడా ఉన్నా… ఆ రోజుల్లో అలా ఒక కొత్త వ్యక్తి అంత చనువుగా మాట్లాడటం మాకే విడ్డూరంగా ఉండేది.
మా ఇంటికి ఎవరైనా బయటి మగవాళ్లు రావడం చాలా అరుదు, అదే మొదలు కూడా. వేణన్నయ్య, ఉషా వాళ్ల ఇంట్లో సరదాగా పేకాట ఆడేవాళ్లు. మేము వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు ఆయన మాకు రమ్మీ ఆట నేర్పి టైం పాస్ కోసం మాతో కలిసి ఆడేవాడు. నాన్నకు పేకాట అంటే అసలు ఇష్టం ఉండదు. మేం కూడా నాన్న ఇష్టానికి వ్యతిరేకంగా ఎప్పుడూ ఆడలేదు. ఒకసారి మా ఇంటికి వస్తూ కార్డ్స్ పట్టుకొచ్చాడు. మధ్యాహ్నం మేమందరం పేకాడుతుంటే నాన్న చూశాడు కానీ, అప్పుడేమీ అనలేదు. అప్పుడు వేణన్నయ్య నాన్న ముఖంలోని భావాలు గమనించి ‘నేనే ఆడమన్నాను అంకుల్, ఏం ఫర్వాలేదు, డబ్బు పెట్టి ఆడితే మంచిది కాదు కానీ, ఎప్పుడైనా టైంపాస్ కోసం సరదాగా ఆడొచ్చు. చెల్లెళ్లని నేను బతిమిలాడితేనే ఆడారు’ అని చెప్పి నాన్నని ఒప్పించాడు. ఆడేటప్పుడు ‘నాకు కార్డ్స్ మంచిగ ఒచ్చినయి’ అనే బదులు ఆయన ‘నాకు కమ్మలు మంచిగ ఒత్తుగ ఒచ్చినయ్’ అనేవాడు. ‘ఒత్తుగా జుట్టు వచ్చినట్టు ఇదేమిటి?’ అనుకునేవాళ్లం.
వేణన్నయ్య ఓ సంఘటన చెప్పేవాడు. ఒకసారి వాళ్ల జడ్చర్ల నుంచి ఇంకేదో ఊరికి వెళ్లినప్పుడు ఒక జీప్‌లో వెళ్లారట. అసలే వర్షాకాలం.. అప్పుడు రోడ్లు మరీ అధ్వానంగా ఉండేవి కదా! ఒక చోట రోడ్డు అడ్డంగా తెగిపోయి ఉందట. ఆ పెద్ద గుంత వచ్చినప్పుడు జీపులోంచి ఈయన ఎగిరి పక్కన పడ్డాడట. వీళ్లకు తెలిసినాయన ఆ గుంతలో పడ్డాడట. జీపు ఆన్‌లో ఉండటంతో గుంత నుంచి ఎత్తుకి ఎక్కడానికి వెళ్లడం, మళ్లీ వెనక్కి రావడం… ఆ వెనక్కి వచ్చినప్పుడల్లా గోతిలో పడ్డాయన కాలు మీది నుంచే జీపు టైరు వెళ్తూ ఉందట. అలా నాలుగైదు సార్లు జీపు పైకి వెళ్లడం వెనక్కి రావడం, ఆయన కాలు మీదుగా వెళ్లడం మళ్ళీ పైకి వెళ్లడం… ఇట్లా జరిగిందనీ, ఆయన కాలు నుజ్జు నుజ్జు అయిందనీ, తర్వాత సర్జరీ చేసి రాడ్ వేశారు అని చెప్తూ ఉండేవాడు. ఆయన చెప్పిన విధానానికి ఇప్పటికీ నాకు ఆ సంగతి బాగా గుర్తుండి పోయింది.
నెల్లుట్ల రమాదేవి
రచయిత్రి