హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర ప్రభు త్వ క్రీడా ప్రాంగణాల్లో స్పోర్ట్స్ కోచింగ్ ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వద్ద శనివారం క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు, క్రీడా సంఘాల ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. ఈ నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త ఫీజులతో పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వర్ధమాన క్రీడాకారులపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వమే వ్యాపార ధోరణితో ఫీజులను అమాంతం పెంచడం సరికాదన్నారు. గతంలో ఉన్న నామమాత్రపు ఫీజులను ఏకంగా వేల రూపాయలకు పెంచడం వల్ల భవిష్యత్ తరాల క్రీడాకారులు ప్రాక్టీస్‌కు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిభ ఉన్నా ఆర్థిక స్థోమత లేక పేద పిల్లలు క్రీడలకు స్వస్తి చెప్పాల్సిన దుస్థితి ఏర్పడుతోందని ప్లకార్డులతో నినాదాలు చేశారు. కోచింగ్ ఫీజులు తగ్గించాలని కోరుతూ స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనిబాలా దేవికి తైక్వాండో మాజీ ప్లేయర్ బాబూలాల్ వినతి పత్రం అందజేశారు. క్రీడా ప్రాంగణాల అద్దె పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
