‘ఈ సినిమా రఫ్ కట్ చూశా. వెరీ రూటెడ్ అండ్ రస్టిక్‌గా చాలా బావుంది. నాకు భలే నచ్చింది. తప్పకుండా ఆడియన్స్‌కి కూడా నచ్చుతుంది. మాధవ్ బాగా చేశాడు. ప్రశాంత్ విహారి పాటలు, డీవోపీ వర్క్ బావుంది. డైరెక్టర్ నాగరాజు చాలా బాగా తీశాడు. ఈ సినిమాకు మంచి పేరు, డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని అగ్ర కథానాయకుడు రవితేజ అన్నారు. ఆయన సోదరుడు రఘు తనయుడైన మాధవ్ హీరోగా పరిచయం అవుతున్న తెలంగాణ రూరల్ డ్రామా ‘మారెమ్మ’. దీపా బాలు కథానాయిక. మంచాల నాగరాజ్ దర్శకుడు.
మయూర్‌రెడ్డి బండారు నిర్మాత. ఈ నెల 10న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌కి అతిథిగా విచ్చేసిన రవితేజ పై విధంగా స్పందించారు. హీరో మాధవ్ మాట్లాడుతూ ‘ఒక మనిషికి, దున్నపోతుకీ మధ్య ఉన్న అనుబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన సినిమా ఇది.
ఈ ఎమోషన్ని మహిషాపురం మారెమ్మతల్లితో బ్లెండ్ చేసి సినిమాను జనరంజకంగా తీశారు దర్శకుడు మంచాల నాగరాజు. పనిచేసినవారంతా ప్రాణం పెట్టారు. తప్పకుండా సినిమా అందరికీ నచ్చుతుంది’ అని తెలిపారు. ఇంకా దర్శకుడు మంచాల నాగరాజు, కథానాయిక దీపాబాలు, వికాస్ వశిష్ట, తదితర చిత్రబృందంతోపాటు డైరెక్టర్ హసిత్ గోలీ, కుశాల్‌రెడ్డి కూడా మాట్లాడారు.