కుటుంబ బాధ్యతలతో ఇష్టాలను పక్కనపెట్టే మిడిల్‌క్లాస్ వ్యక్తిత్వం మనది. కానీ, మనసుకు నచ్చకుండా ఏ పనిచేసినా అందులో ఇమడలేం.. విజయాన్ని అందుకోలేం. అందుకే కుటుంబం వద్దని వారించినా, కష్టమైనా.. ఇష్టమైన లక్ష్యాన్ని ఎంచుకున్నాడు ఈ యువకుడు. చదువుకు తగ్గ ఉద్యోగాన్ని కాదని కెమెరా, యాక్షన్ అంటూ ముందుకు సాగాడు గంగాధర వైకే. షార్ట్ ఫిల్మ్ మేకింగ్ నుంచి వెండితెరకు చేరిన తన సినీ ప్రస్థానాన్ని బతుకమ్మతో పంచుకున్నాడు ఈ యువ డైరెక్టర్..
మధ్యతరగతి వాళ్లు ఉద్యోగాలు వదిలేయడం అంటే.. సాహసమనే చెప్పాలి. సినిమాల మీద ఇష్టంతో నేను ఆ సాహసం చేసినందుకు ఇంట్లో ఓ చిన్న యుద్ధమే జరిగింది. మాది భద్రాచలం. అమ్మ గృహిణి, నాన్న సింగరేణిలో లారీ డ్రైవర్‌గా పనిచేశారు. చదువంటే ఇష్టంతో మూడు పీజీలు పూర్తిచేశాను. చిన్నప్పటి నుంచి నాటికలు అంటే ఎంతో ఇష్టం. కాలేజీలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో రకరకాల గెటప్‌లు వేసేవాణ్ని. ఎంబీఏ చదివేందుకు చెన్నై వెళ్లాను.
మా ఫ్రెండ్ వాళ్ల నాన్న అక్కడే సినిమా రంగంలో పనిచేస్తుండేవారు. సమయం దొరికినప్పుడల్లా ఆ సెట్లకు వెళ్లేవాణ్ని. షూటింగ్‌లు జరిగే తీరు గమనించేది. ఒకసారి హీరో విక్రమ్‌ను నేరుగా చూసి ఆశ్చర్యపోయాను. టీవీల్లో మాత్రమే కనిపించే సెలెబ్రిటీలను నేరుగా చూసేసరికి నాకు కలిగిన అనుభూతి వర్ణనాతీతం! అలా సినిమా ఫీల్డ్ మీద కొంచెం ఇష్టం ఏర్పడింది. ఆ తర్వాత హైదరాబాద్‌కి వచ్చి ప్రైవేట్ బ్యాంక్‌లో ఉద్యోగంలో చేరాను. వృత్తిలో భాగంగా రెండు తెలుగు రాష్ర్టాల్లో పర్యటించేవాణ్ని. మంచి మంచి లొకేషన్లను చూస్తుండేది. వాటి ఫొటోలు తీసి ఓ బ్లాగ్‌లో రాసేవాణ్ని. ఖాళీ సమయాల్లో కవి సమ్మేళనాల్లో పాల్గొనేవాణ్ని. పలువురు నా కథలను ఆదరించడంతో నా మీద నాకు మరింత విశ్వాసం ఏర్పడింది. అలా సినిమాల్లోకి వెళ్లాలనే ఆలోచనతో 2016లో ఉద్యోగం వదిలేశాను.
టర్నింగ్ పాయింట్
నన్ను నేను నిరూపించుకునేందుకు రెండు షార్ట్‌ఫిల్మ్‌లు తీశాను. ‘మంచినీళ్ల బావి’పేరుతో జోగినీ వ్యవస్థపై షార్ట్ ఫిల్మ్ తీయగా దానికి బతుకమ్మ అవార్డు అందుకున్నాను. ఒకవైపు షార్ట్ ఫిల్మ్‌లు చేస్తునే మరోవైపు సినిమా కథలు రెడీ చేసుకుంటున్న సమయంలో రవీంద్రభారతి పిలుపు నా జీవితంలో మరోమలుపు తిప్పింది. రవీంద్రభారతిలో తెలంగాణ ఫిల్మ్‌మేకర్స్‌తో ఓ సమావేశం నిర్వహించారు. దానికి నా ఫ్రెండ్ పేపర్ బాయ్ డైరెక్టర్ జయశంకర్ నన్ను తీసుకెళ్లాడు. అక్కడ ‘యంగ్ ఫిల్మ్‌మేకర్స్‌ను గుర్తిస్తున్నాం. మంచి మంచి సినిమాలు తీయండి. పైడి జయరాజు థీయేటర్ మీదే’ అంటూ నిర్వాహకులు ప్రోత్సహించారు.
ఆ ఊపులో షార్ట్ ఫిల్మ్‌లు తీసిన అనుభవంతో ‘సురభి 70ఎంఎం’ సినిమాకు శ్రీకారం చుట్టాను. దీని కోసం నా ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో పరిచయమైన వారిని నటీనటులుగా పెట్టాను. షూటింగ్ ప్రారంభించగానే లాక్డౌన్ పడింది. చేసేదేం లేక సడలింపుల సమయంలో షూటింగ్ పూర్తి చేసుకున్నాం. ఆ సమయంలోనే మా సినిమా వస్తుందని చెప్పడానికి మెగాస్టార్ చిరంజీవి ట్రిబ్యూట్ సాంగ్‌ను విడుదల చేశాం. అది చూసిన చిరంజీవి గారు పిలిపించుకొని మెచ్చుకున్నారు. ట్రైలర్ రిలీజ్‌కు వస్తానన్నారు. కానీ, ఆలస్యంగా విడుదల చేయడం వల్ల ఆయనకు చెప్పలేకపోయాం. మొత్తానికి నా మొదటి సినిమాను 2022 ఫిబ్రవరిలో 70 థియేటర్లలో విడుదల చేశాను. కరోనా తర్వాత సినిమా రిలీజ్ అయితే చాలు అని అనుకున్నాం. కానీ, పెట్టిన డబ్బులు కూడా తిరిగొచ్చాయి.
సైబర్ క్రైం నేపథ్యంలో
ఆ తర్వాత అధిరే అభితో డెవిల్స్ ఛైర్ చేశాను. ఆ సినిమా ఇక్కడి థియేటర్లతో పాటు యూఎస్‌లోని మన తెలుగువాళ్లు ఉండే ప్రాంతాల్లో హౌజ్‌పుల్ అయ్యింది. దాని తర్వాత ‘వైఫ్ ఆఫ్ అనిర్వేశ్’ తీశాను. తాజాగా విడుదలైన ‘పాంచాలి పంచ భర్తృక’ సైబర్ క్రైం నేపథ్యంలో సాగే సినిమా. ప్రస్తుతం ప్రతీదీ అన్లైన్ మీదే ఆధారపడుతున్నాం. దాన్ని ఆసరాగా చేసుకొని సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఆన్లైన్ మోసాలపై కామెడీ క్రైమ్ యాంగిల్లో ఈ సినిమా తీశాను. ఈ కథ ఓ పెద్ద హాస్యనటుడుంటే మరింత బాగుంటుందని రాజేంద్రప్రసాద్‌ను తీసుకున్నాం. ఎనిమిది నెలల్లో పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం విజయవంతంగా సాగుతూ ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధంగా ఉంది.
మన యాసలో తీస్తాను
ఉద్యోగం వదిలేసినప్పుడు అందరూ తిట్టినా మా అక్క మాత్రమే నాకు సపోర్టుగా నిలిచింది. రవీంద్రభారతిలో తెలంగాణ డైరెక్టర్లలో నా ఫోటో పెట్టినప్పుడు ఇంట్లో వాళ్లకు నమ్మకం కలిగింది. ఒకనొక సమయంలో చేతిలో డబ్బులు లేక ఘోస్ట్ రైటింగ్ చేశాను. ప్రస్తుతం ఆ పరిస్థితులను అధిగమించాను. యాక్సిడెంటల్ యాక్టర్ అయితే కావొచ్చు కానీ డైరెక్టర్, రైటర్‌గానే రాణిస్తాను. రవీంద్రభారతీలో మొదటి సమావేశమప్పుడు మామిడి హరికృష్ణ గారు తెలంగాణ తేజోమూర్తులు పుస్తకాన్ని ఇచ్చారు. ఆ పుస్తకంలోని ఒక్కోపాత్ర ఒక్కో సినిమా అవుతుంది. భవిష్యత్తులో మన యాసలో సినిమాలు తీసేందుకు కసరత్తు చేస్తాను. డైరెక్టర్లలో మణిరత్నం, కె.బాలచందర్ సినిమాలను ఎక్కువ ఇష్టపడుతాను. భవిష్యత్తులో నటుడు మాధవన్‌తో, బాలకృష్ణతో సినిమా తీయాలన్నది నా కోరిక.
రాజు పిల్లనగోయిన