కాండిడ్ ఫొటోగ్రఫీ.. అంటే, ఎదుటివారి నిజమైన భావోద్వేగాలను, సహజమైన వ్యక్తిత్వాన్ని చిత్రీకరించే కళ. వైవిధ్యానికి, సహజత్వానికి గౌరవం ఇచ్చే కళ. మీరు ఫొటో తీయాలనుకున్న వ్యక్తి సంతోషంగా నవ్వుతున్న సమయంలోనో, ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న సందర్భంలోనో, పిల్లలతో ఆడుతున్నప్పుడో.. ఇలా, కొన్ని ప్రత్యేక క్షణాలను వారికి తెలియకుండానే ఫొటోలు తీయడం. ఈ ఫొటోలు.. అనేక భావోద్వేగాలను పట్టిచూపుతాయి. నిజజీవిత సౌందర్యాన్ని ప్రదర్శిస్తాయి. ఆయా క్షణాలకు సంబంధించిన కథలను కలకాలం చెబుతూనే ఉంటాయి.
మొబైల్ ఫోన్ కెమెరాల అభివృద్ధి తర్వాత కాండిడ్ ఫొటోగ్రఫీ అందరికీ అందుబాటులోకి వచ్చింది. మొబైల్ ఫోన్‌తోనే కాండిడ్ ఫొటోగ్రఫీని ఎలా చేయవచ్చో.. ఆనందపు క్షణాలను అద్భుతంగా ఎలా ఒడిసి పట్టుకోవచ్చో తెలుసుకుందాం.
కాండిడ్ ఫొటోగ్రఫీ.. సంప్రదాయ పోర్ట్రెయిట్ ఫొటోగ్రఫీకి భిన్నంగా ఉంటుంది. ఇందులో ఎదుటి వ్యక్తులను.. ‘ఫొటోలకు పోజులివ్వండి’ అని అడగాల్సిన పనిలేదు. వారి సహజమైన స్థితిలో ఉన్నప్పుడే.. ఆ మూమెంట్స్‌ను, ఎక్స్‌ప్రెషన్స్‌ను చిత్రీకరించాలి.
అత్యాధునిక ఫీచర్లతో వస్తున్న మొబైల్ ఫోన్లు.. డీఎస్ఎల్ఆర్ కెమెరాలకు ప్రత్యామ్నాయంగా మారాయి. కాండిడ్ ఫొటోగ్రఫీకి మొబైల్ ఫోన్లు సరైనవని చెప్పడానికి ఇక్కడ అనేక కారణాలు ఉన్నాయి.
సౌకర్యవంతంగా : స్మార్ట్ఫోన్లు తేలికగా ఉంటాయి. మన చేతిలోనే ఉంటూ.. ఏదైనా మంచి మూమెంట్ కనిపించగానే, ‘క్లిక్’ అనిపిస్తాయి. ఇక ప్రయాణాల్లోనూ కాండిడ్ ఫొటోలను తీయడాన్ని సులభం చేస్తాయి.
గమనించకుండా : కాండిడ్ ఫొటోగ్రఫీ అంటేనే.. ఎదుటి వ్యక్తికి తెలియకుండా ఫొటోలు తీయడం. డీఎస్ఎల్ఆర్ లాంటి పెద్ద కెమెరాలతో ఫొటోలు తీసేటప్పుడు.. ఆయా వ్యక్తులు గమనించే అవకాశం ఉంటుంది. అదే.. మొబైల్ ఫోన్ కెమెరాను గమనించడం, దానిని చూసి ప్రతిస్పందించే అవకాశం తక్కువ. దీనివల్ల కాండిడ్ క్షణాలను క్యాప్చర్ చేయడం సులభం అవుతుంది.
కాండిడ్ ఫొటోగ్రఫీ సహజంగా ఉంటుంది. అయితే కొంత ఎడిటింగ్ చేయడం వల్ల ఫొటోలు మరింత ప్రభావవంతంగా కనిపిస్తాయి.
సులభంగా : మొబైల్ ఫోన్ కెమెరాలు యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి. వీటి వాడకం చాలా సులభం. ఆటో ఫోకస్, ఇమేజ్ స్టెబిలైజేషన్, పోర్ట్రెయిట్ మోడ్ వంటి ఫీచర్లనూ కలిగి ఉంటాయి. పెద్దపెద్ద కెమెరాలతో పని లేకుండానే.. కొత్తవారు కూడా సులభంగా హై క్వాలిటీ ఫొటోలను తీసే అవకాశం ఉంటుంది.
అప్పటికప్పుడే : స్మార్ట్‌ఫోన్ కెమెరాతో కాండిడ్ ఫొటోలు తీసిన తర్వాత.. ఆయా చిత్రాలను అప్పటికప్పుడే ఎడిట్ చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో అప్లోడ్ చేయవచ్చు. మీ ఫొటోలను సులభంగా ప్రాసెస్ చేయడానికి, షేర్ చేయడానికి స్మార్ట్ఫోన్లు బాగా సహకరిస్తాయి.
ఇప్పుడొస్తున్న స్మార్ట్ఫోన్లు.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉంటున్నాయి. ఏఐ ఆధారిత ఫీచర్లతో.. ప్రొఫెషనల్ క్వాలిటీ చిత్రాలను అందిస్తున్నాయి.
మీ మొబైల్ ఫోన్‌తో అద్భుతమైన కాండిడ్ ఫొటోలు తీయడానికి కొన్ని చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం!
కాండిడ్ ఫొటోలను తీయడానికి మంచి స్మార్ట్‌ఫోన్ కన్నా టెక్నిక్, ఓర్పుతోపాటు ఫొటోను ఎప్పుడు, ఎలా తీయాలనే దానిపై అవగాహన ఎక్కువగా ఉండాలి. అప్పుడే మీ మొబైల్ ఫోన్ కెమెరాను సరిగ్గా వినియోగించడానికి వీలవుతుంది. స్మార్ట్‌ఫోన్‌తో క్యాండిడ్ ఫొటోగ్రఫీలో నైపుణ్యం సాధించడంలో మీకు సహాయపడటానికి ఇక్కడ కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఇస్తున్నాం.
మీరు తమను ఫొటో తీస్తున్నారని అవతలివారికి తెలిస్తే.. వారు తమ ప్రవర్తనను మార్చుకోవచ్చు. దాంతో, కాండిడ్ అర్థమే మారిపోతుంది. క్వాలిటీ కూడా తగ్గుతుంది. కాబట్టి, ఫొటో తీసేటప్పుడు మీరు చాలా సీక్రెట్ మెయిన్‌టెయిన్ చేయాలి. అలా సరదాగా తిరుగుతున్నట్టే తిరుగుతూ.. ఫొటోలు తీయాలి.
చిట్కా 1 : ఫోన్‌ను ఛాతీ స్థాయిలోనైనా, దానికి దిగువన అయినా ఉంచి, దూరంనుంచే ఫొటోలు తీయండి. ఇది అవతలివారి దృష్టిని ఆకర్షించే అవకాశాన్ని తగ్గిస్తుంది.
చిట్కా 2 : మీ ఫోన్‌ని ఒక చేతిలో పట్టుకుని, నోటిఫికేషన్లను తనిఖీ చేస్తున్నట్టు నటిస్తూ.. యాప్‌లను స్క్రోల్ చేస్తూ, మరో చేత్తో మెల్లగా ఫొటోలు తీయండి.
క్యాండిడ్ ఫొటోగ్రఫీ అంటేనే.. టైమింగ్, ఎమోషన్‌కి సంబంధించినది. సరైన పోజ్ కోసం ఎదురుచూడకుండా, నిజమైన హావభావాలను, మధుర క్షణాలను క్యాప్చర్ చేయడంపై దృష్టి పెట్టండి.
చిట్కా 1 : ఎమోషనల్ అట్మాస్పియర్పై శ్రద్ధ వహించండి. జోక్ అయినా, నిశ్శబ్దమైన క్షణమైనా, ఎవరైనా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిన క్షణమైనా సరే.. ఫొటోల్లో బంధించండి. ఇలా ఎలాంటి ప్రణాళికలేని క్షణాలే.. అత్యంత శక్తిమంతమైన కాండిడ్ ఫొటోలను అందిస్తాయి.
కాండిడ్ ఫొటోగ్రఫీలో బరస్ట్ మోడ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పబ్లిక్ ప్లేస్‌లలో సహజ కాంతిలో ఫొటోలు తీయడమే బెటర్. మీరు ఫ్లాష్‌ను ఉపయోగించినట్టయితే.. మీరు ఫొటో తీసినట్టు ఎదుటివారికి తెలిసిపోతుంది. దాంతో వారినుంచి మరో ఫొటోను ఊహించలేం.
కాండిడ్ ఫొటోగ్రఫీకి ఓపిక చాలా అవసరం. ఎప్పటికప్పుడు అప్రమత్తంగానూ ఉండాలి. ఎందుకంటే, బెస్ట్ మూమెంట్స్ అనేవి క్షణాల్లోనే కరిగిపోతాయి. అలాంటి క్షణాలు కనిపించినప్పుడు.. దాన్ని క్యాప్చర్ చేయడానికి సదా సిద్ధంగా ఉండాలి.
చిట్కా 1 : ఎదుటి వ్యక్తుల బాడీ లాంగ్వేజ్‌తోపాటు వారి చర్యలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. పిల్లల నవ్వులు, కేరింతలు.. ఇలాంటి ఆసక్తికరమైన క్షణాలు ఎప్పుడైనా.. ఎక్కడైనా జరగవచ్చు.
చిట్కా 2 : తొందరొద్దు. పరిసరాల్ని పరిశీలించడానికి ఎక్కువ సమయం తీసుకోండి. చిన్న చిన్న వివరాలను.. భావోద్వేగాలు, హావభావాలను నిశితంగా గమనించండి.
– ఆడెపు హరికృష్ణ