ఫలానా హీరో ఆ బ్రాండ్ పర్ఫ్యూమ్ వాడుతున్నారంటే చాలు.. ఫ్యాన్స్ అంతా దాన్నే ఫాలో అయిపోతారు. ఫలానా క్రికెటర్‌కు ఇష్టమైన డ్రింక్ ఇదే అంటే చాలు.. ఇష్టం లేకపోయినా దానికి మారిపోతారు అభిమానులు. సెలెబ్రిటీలకు ఉన్న డిమాండ్ అది. దాన్ని కంపెనీలు తమ బ్రాండ్ ప్రమోషన్స్‌కు వాడుకుంటున్నాయి. సినిమా, స్పోర్ట్స్ ఈ రెండు రంగాల్లో సెలెబ్రిటీల క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ క్రేజ్‌తోనే బ్రాండ్ ప్రమోషన్లో ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్లు సత్తా చాటుతున్నారు.
రణ్వీర్ సింగ్, విరాట్ కోహ్లీ, అక్షయ్ కుమార్, ఆలియా భట్, దీపికా పదుకొణె.. అత్యధిక బ్రాండ్ వాల్యూ ఉన్న మొదటి ఐదుగురిలో ఉన్నారు. సౌత్ విషయానికొస్తే.. టాప్ 10 ఇండియన్ సినిమాల్లో దక్షిణాది భాషలకు చెందినవి ఆరు ఉండటం విశేషం. కొంతకాలంగా సౌత్ చిత్రాలు పాన్ఇండియా మార్కెట్‌ను పెంచుకుంటున్నాయి. ఈ క్రమంలో మన నటుల బ్రాండ్ వాల్యూ కూడా పెరుగుతున్నది. పుష్పతో జాతీయస్థాయి హీరోగా అవతరించిన అల్లు అర్జున్ కేఎఫ్‌సీ, రెడ్‌బస్, కోకాకోలా, జొమాటో అంబా సిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. రామ్‌చరణ్ హీరో మోటార్స్, పార్లే ఆగ్రో ప్రకటనలతో అదరగొడుతున్నాడు. రశ్మిక, సమంత, తమన్నా తదితర నటీమణులు కూడా బ్రాండ్ బజాయిస్తున్నారు.