ఓడిన మనుషులకు ఊరట
ఎంతోమంది జీవితాలు కొద్ది సమయం వరకు, కొన్ని సంవత్సరాల వరకు బాగున్నా, అనుకోకుండా అందరి జీవితాల్లో కుదుపులు సంభవిస్తుంటాయి. దీంతో ఆకాశంలో తిరుగాడే వారు కూడా నేల మీదికి పడిపోతారు. ఇన్నాళ్లూ వాళ్లు గడిపిన జీవితం అంతా ఇప్పుడు శూన్యంగా అనిపిస్తుంది. అయితే, కొంతమంది ఆ కుదుపులకు తట్టుకుని నిలబడతారు. మళ్లీ జీవితంలో పరుగు మొదలుపెడతారు. కష్టపడి తాము అనుకున్న రంగంలో నిలదొక్కుకుంటారు. ఇంకొంతమంది మాత్రం ఆ అంధకారం నుంచి తేరుకోలేరు. వారికి జరిగిన సంఘటనల ప్రభావం నుంచి బయటపడలేరు. కాలం చేసిన గాయాన్ని మర్చిపోలేరు.
దీంతో కుంగుబాటుకు లోనైపోయి అలాగే నాలుగు గోడల మధ్య బందీలుగా బతుకుతూనే ఉంటారు. అలాంటి వారికి మణి వడ్లమాని రాసిన ‘పథికుడు’ నవల ఓ మంచి సమాధానం. ‘నా జీవితం ఇంతే! నాకు ఇక భవిష్యత్తు లేదు, ఏం చేసినా జీవితం మారదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ జీవితం తాలూకు గాయాలు మానవు’ అని కుమిలిపోయే వారికి ఈ నవల బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు, మనతో ఉన్నవాళ్లు నిజంగానే వంద శాతం నిజాయితీగా ఉన్నారా? వారి అంతరంగం అంతా మనతో చెప్పుకొంటున్నారా? మనం అసలు వారికి ఆ చెప్పుకొనే అవకాశం ఇస్తున్నామా? అనే ప్రశ్నలు నవల పూర్తి అయ్యాక రావడం ఖాయం. మనోవిశ్లేషణాత్మకంగా సాగే ఈ ‘పథికుడు’ నవల నేటి యువతకు మార్గదర్శకంగా నిలుస్తుంది.
పథికుడు
రచన: మణి వడ్లమాని
పేజీలు: 76; ధర: రూ. 150
ప్రచురణ: అచ్చంగా తెలుగు ప్రచురణలు
ప్రతులకు ఫోన్: 85588 99478, 96520 67891
చక్రి భజనలు… భక్తి సోపానాలు
చక్రిభజన మహారాష్ట్రకు చెందిన భజన సంప్రదాయం. దీన్ని తెలంగాణలో ప్రాచుర్యంలోకి తెచ్చిన వ్యక్తి రుక్మాభట్ల విధుమౌళి శాస్త్రి. సంగీత, సాహిత్యాల్లో నిష్ణాతుడైన విధుమౌళి శాస్త్రి సిద్దిపేట జిల్లా గజవెల్లి వాస్తవ్యులు. మరుకూకు పాండురంగ ఆశ్రమంలో సిద్ధగురు నారాయణ గారి అనుగ్రహం పొందారు. ఆయన దగ్గరే శాస్త్రి వివిధ రకాలైన భజన స్వరూపాలను ఆకళింపు చేసుకున్నారు.
మధ్య తెలంగాణ ప్రాంతంలో భజన సంప్రదాయ నెలకొల్పే దిశగా ఆయన తన గురువుగారితో కలిసి గజవెల్లిలో (గజ్వేల్) ‘శ్రీరామ భజన సంఘం’ స్థాపించారు. ఈ క్రమంలో విధుమౌళి శాస్త్రి ‘శ్రీరామ భజన’, ‘శ్రీకృష్ణ భజన’, ‘శ్రీవిశ్వేశ్వర భజన’ మొదలైన భజన గీతాలు అనేకంగా రచించారు. వీటిని విఠాల చంద్రమౌళి శాస్త్రి పరిష్కరించారు. చక్రిభజనల ప్రచారానికి విధుమౌళి శాస్త్రి ఉద్యమ స్ఫూర్తితో పనిచేసి 108 భజన సంఘాలను ఏర్పాటుచేశారు. ఆయన రచించిన వివిధ దేవతల భజనలు ‘భజనావళి’ పేరుతో శ్రీపాండురంగాశ్రమము వారు పుస్తకంగా తీసుకువచ్చారు. భగవత్ నామ స్మరణలో ఉత్తమమైనది దేవుడిని నోరారా కీర్తించడం. ఆ దిశగా విధుమౌళి శాస్త్రి భజనలు మనల్ని భగవంతుడి మార్గంలో నడిపిస్తాయి.
భజనావళి
రచన: రుక్మాభట్ల విధుమౌళి శాస్త్రి
సంకలన కర్త: మదునూరి వెంకటరామశర్మ
పేజీలు: 296; ధర: రూ. 150
ప్రచురణ: పాండురంగాశ్రమము
ప్రతులకు: 96764 54189
…? ఆరుద్ర ఈశ్వర్